రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఆ ఫ్లాట్‌లోని టివిలో సవాళ్లు విసురుతోన్న లేడీ విలన్‌ వాయిస్‌. తనపై కక్షతీర్చుకోవద్దని బ్రతిమాలుతోన్న పురుష హీరో దీనాలాపన! టివి ఎదురుగా ఆసీనులైన శలభారావు, ద్రవ్యమణిల కన్నీటితో సోఫా సగం తడిసిపోయింది. ద్రవ్యమణి చీరంచుతో శలభం, అతని లుంగీ అంచుతో మణి కళ్లొత్తుకున్నారు. దొరికితే లేడీ విలన్‌ తాట తీసేలా ఉన్నారు. విలన్‌ వాయిస్‌ ఇంకా పెరిగింది. హీరో కాళ్లు పట్టుకుంటున్నాడు. మణి ఇక తట్టుకోలేకపోయింది. ఘొల్లుమంటూ శలభం గుండెపైపడి శోకాలు తీయసాగింది. ఒక్కసారి టన్నురాయి గుండెల్ని గుద్దుకున్నట్లు కళ్లు తేలేశాడు శలభం.‘‘ఊరుకో మణి..కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా..వచ్చే ఎపిసోడ్‌లో చూడు! ఆ విలన్‌ పొగరు ఎలా అణగదీస్తాడో మన హీరో..’’ అంటూ భార్యను ఓదార్చసాగాడు. ఇంతలో సెల్‌ కూనిరాగం తీసింది. ‘‘హలో’’ అన్నాడు శలభం. అవతల్నించి చతురమూర్తి వాయిస్‌.‘‘రేయ్‌ శలభా.. ఏం చేస్తున్నావు? ఆ దిక్కుమాలిన కంట్లో కన్నీళ్లుండవు’ డైలీ సీరియల్‌ చూస్తున్నావు కదూ! నీవు మారవురా.. ఈ జన్మకు మారవు. అఖండమైన తెలివితేటలు, అమోఘమైన బుర్ర పెట్టుకుని కూడా నిన్ను నీవు మార్చుకోవు. పూర్‌ఫెలో..నీతో స్నేహం చేసిన పాపానికి నేనైనా నిన్ను మార్చేందుకు ప్రయత్నించాలి కదా..’’చతురమూర్తి వాగ్ధాటిని అడ్డుకుంటూ ‘‘విషయమేంటో చెప్పరా.. టెన్షన్‌తో చంపకు. నాకు మాత్రం మారాలని ఉండదా! మార్పు కోరుకోనివాడు మనిషే కాదురా. ప్రకృతిలోని ప్రతిప్రాణీ మార్పు కోరుకుంటుంది. మారాలని, మార్పుకావాలని కోరుకోనిది ప్రాణం లేని బండరాయి మాత్రమే. మార్పుతోనే మనిషిలో చైతన్యం వెల్లివిరుస్తుంది.

మార్పులోనే మనిషి జీవకణాలు పునరుజ్జీవనం పొందుతాయి.’’శలభం మాటల్ని అడ్డుకుంటూ ‘‘కాసేపు నోర్ముయ్‌.. బుద్ధిగా చెప్పేది విను. ఈ మధ్యే ‘నక్షత్ర మైనస్‌’ ఛానల్లో వారానికి మూడురోజులు కౌన్‌బనేగా రోడ్‌ పతి అనే కొత్త ప్రోగ్రామ్‌ మొదలెట్టారు. ప్రముఖ సినిమా నక్షత్రం అజిత్‌భాయ్‌ యాంకర్‌! ఈరోజది వస్తోంది. వెంటనే ఛానల్‌ మార్చి చూడు. అంతా అర్థమవుతుంది. వివరాలు రేపు మాట్లాడుకుందాం. ఉంటాను. బాయ్‌..’’ అని ఫోన్‌ కట్‌ చేశాడు చతుర.మణి మాత్రం శలభాన్ని పట్టించుకోకుండా కన్నీళ్లు కార్చడంలో మునిగి ఉంది.‘‘మణీ..నీ మొహంలో ఆనందాన్ని నింపుతానుండు.’’ అని ఛానెల్‌ మార్చి ‘నక్షత్ర మైనస్‌’ పెట్టాడు శలభం.ఓ పదినిముషాలు చూడగానే ప్రోగ్రామ్‌ చాలా వరకు అర్థమయింది. అజిత్‌ భాయ్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, వేడి ఆసనం పైని వ్యక్తి లక్షల్లో డబ్బు గెలిచేస్తున్నాడు. చతురమూర్తికి మనసులోనే కృత జ్ఞతలు చెపకున్నాడు శలభం..అంత మంచి కార్యక్రమం గురించి చెప్పినందుకు.