ఉద్యోగంలో చేరిన సరిగ్గా మూడు నెలలకు తన స్వంత సంపాదనలో ఒక సైకిలు కొనుక్కోగలిగాడు రామం. అది తన చిరకాల వాంఛ.స్కూల్లో చదివే రోజులనుంచీ అనుకుంటున్నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అది వీలు పడలేదు. తను కూడా తల్లిదండ్రులను ఎక్కువ ఒత్తిడి చెయ్యలేదు. ఎలాగైతేనేం ఉద్యోగంలో చేరాక ఆ కోరిక తీరింది. వెంటనే తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. ఒకవిధంగా చెప్పాలంటే అందులో తండ్రి ప్రోద్బలం కూడా ఉంది.‘‘ఇన్నాళ్ళూ కష్టపడ్డావు. ఇప్పుడైనా నీక్కావలసింది కొనుక్కో. అది ప్రస్తుతం నీకు అవసరం కూడా. నేనింకా సర్వీసులోనే ఉన్నాను. కాబట్టి ఇంటికోసం నువ్వేమీ పంపనక్కరలేదు. నువ్వు సంపాదించిన దాన్ని కూడబెట్టుకుని ప్రస్తుతానికి నీ అవసరాలన్నీ తీర్చుకో’’ అన్నాడు తండ్రి చిరునవ్వుతో.ఆ సైకిలు తొక్కుతుంటే పట్టలేని సంతోషం. స్వార్జితంలోని నిజమైన ఆనందాన్ని అణువణువూ ఆస్వాదించాడు. ఏదో సాధించానన్న తృప్తి. తనతోబాటుగా చదువుకుని ఇంకా పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి వేలకు వేలు సంపాదిస్తూ కార్లూ బైకులూ కొన్న తన స్నేహితులతో తనను పోల్చుకోలేదు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కాలని చూసిందన్న స్వభావం కాదతనిది. తన స్థాయీ స్థోమతలు, తన బలాబలాలు క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి. పాతికేళ్ళ వయసులోనే అంతటి పరిణతిని, పరిపూర్ణత్వాన్ని సాధించాడు.ఆ రోజు కొత్త సైకిలు తీసుకుని ఆఫీసుకు వెళ్తూంటే అనిర్వచనీయమైన ఆనందం. ఆఫీసులో అడుగు పెట్టగానే కొత్తముఖం పరిచయమైంది.

‘‘గుడ్‌ మార్నింగ్‌సర్‌. మై నేమ్‌ ఈజ్‌ త్రివేదీ’’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడతను. ఇంగ్లీషు అంతంత మాత్రంగా వస్తున్నట్టుంది. ఉత్తరాదినుంచి వచ్చినట్టున్నాడు. హిందీ తప్ప మరే భాషా తెలిసినట్టు లేదు. ఇంతదూరం రావలసిన అగత్యం ఏమిటో అనుకున్నాగు గానీ అడగలేదు.కొద్ది గంటల్లోనే అతను మంచి తెలివిగలవాడని అర్థమైపోయింది. అంతేకాక శాంత స్వభావుడని కూడా తెలిసింది. అంతేకాదు మాట్లాడే ఇంగ్లీషు భాష యాసేమో గానీ భాష మీద పట్టు అమోఘమని తెలిసింది.కొత్త సైకిలుతోబాటు కొత్త వ్యక్తి పరిచయమయ్యాడు. తామిద్దరూ బ్రహ్మచారులే. ఇద్దరికీ ప్రస్తుతానికి ఏ బాదరబందీ లేదు. ఇద్దరూ స్వేచ్ఛా విహంగాలు.ప్రాంతీయ భాషా సమస్య ఉంది కాబట్టి సాధ్యమైనంత మేరకు తనే అతనికి అన్నివిధాల అండదండగా ఉంటుండేవాడు రామం.కొద్దిరోజుల్లోనే అతను పూర్తిగా రామం మీద ఆధారపడిపోయాడు. అతను చేసే ప్రతి పనికీ రామం సలహా ఉండాల్సిందే. ఇద్దరూ బాచిలర్స్‌ కాబట్టి తన గదిలోనే అతన్ని కూడా చేర్చుకున్నాడు రామం.ఐతే అతనిలోని ఒకే ఒక విషయం రామానికి నచ్చలేదు. ఎంతగా ప్రయత్నించినా ప్రాంతీయ భాష నేర్చుకోడానికి సుముఖత చూపడం లేదు. అదేమంటే ‘‘నువ్వెప్పుడూ నా తోడుండగా నాకింకేం దిగులు. నేనెందుకు నేర్చుకోవాలి?’’ అంటూ జవాబిస్తాడు.