‘‘కాఫీతాగి వెళ్లకూడదా నాన్నా! ఎంతలోకి-క్షణంలో చేస్తాను పాలున్నాయి- నువ్వు తెచ్చిన ఇడ్లీలూ ఉన్నాయి’’‘‘బయట తాగుతాలే అమ్మా! నాయుడు ఎటన్నా పోతాడేమో అనీ’’‘‘సరే నీ ఇష్టం’’కనకవల్లి చివరిమెట్టు వరకూ వచ్చి మరీ చెబుతోంది. కామేశ్వర శర్మ చొక్కాకి బొత్తాం పెట్టుకుంటూ ఒకచేత్తో గోడకు చేరేసిన సైకిలును మరో చేత్తో నడిపించుకుంటూ వెళ్లిపోయాడు.కామేశ్వర శర్మ తెల్లారి నాలుగింటికే లేచిపోయి ముఖం కడుక్కొని పైలాన్‌ సెంటర్‌కి తన డొక్కు సైకిలుతో చేరుకుంటాడు- అప్పటికే పాల వేన్‌ వచ్చేస్తుంది. పాల పేకట్లు రెండు ప్లాస్టిక్‌ సంచుల్లో వేసుకొని వాడిక ఇళ్లల్లో వేసి ఆరు గంటలకు ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే అతని చేతిలో ఇడ్లీపొట్లాం, పాల పాకెట్‌ ఉంటాయి.

కన కవల్లి ఆపాటికే లేచి గిన్నెలు తొల్చి పాలు మరగపెడుతుంది. కామేశ్వర శర్మ స్నానం చేస్తూ- దండెం మీద తడిగుడ్డ ఆరవేస్తున్నా నారాయణ స్తోత్రాన్ని విడవాడు. అప్పుడే మబ్బుల్లోంచి వస్తున్న బాల భానుని రెండుచేతులూ ఎత్తి నమస్కరించుకున్నాక. రెండు ఇడ్లీలు తిని ఇంత కాఫీతాగి, కూతురు కనకవల్లి చెప్పిన విషయాలు శ్రద్ధగా విని డొక్కు సైకిల్‌తో జీవన పోరాటం మొదలెడుతాడు- ఇదీ అతని నిత్యకృత్యం.కనకవల్లి గదిలోకి పోయి స్టవ్‌ వెలిగించి పాలు పడేసింది. కాయగూరలు పళ్లెం ముందు వేసుక్కూచుంది. ఓ మాదిరి పెద్ద గది అది. అందులో ఓ మూల వంట- మరో పక్క సామాన్లు సర్దుకున్నారు. నేల మీద పరచిన చాపల మీద, చింకి బొంతలు వేసుకుని జోగులాంబ, మరోపక్క నారాయణ నిద్రపోతున్నారు-పిట్టగోడకు అవతల రోడ్డు పక్క చిన్న సైజు కాకా హోటలుంది.

 అందులో పనిచేస్తున్న వాళ్లెపుడో లే చి హడావిడిగా కేకలు వేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు. అట్లకాడతో పెనం మీద కొట్టిన చప్పుళ్లూ, టీ మరుగుతున్న వాసనా- పప్పు రుబ్బుతున్న చప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. బుట్టెడు ఉల్లిపాయలూ, మిరపకాయలూ తరగడం ఒక పనివాడు పిట్టగోడ ఎక్కి కూనిరాగాలు తీస్తూ పని చేస్తుంటాడు- ఆ చిన్న హోటల్‌కి మధ్యాహ్నం తప్ప అలా బేరాలు ఉంటూనే ఉంటాయి.ఉదయం ఏడున్నర అవుతోందేమో టైము. జోగు లాంబ పెడుతున్న గురక ఆపి కాకా హోటల్‌లోని పనివాళ్ళు వేసే కేకలకి పూర్తిగా తెలివి తెచ్చుకుంది- అయినా లేవబుద్ధి కాలేదు- కాలు దగ్గరగా లాక్కుని వెండిపట్టీ సర్దుకొంది- మెడ ఎత్తి వెనక్కి తిరి గున్న కనకవల్లిని ఉద్దేశించి ‘‘పాలు మరిగాయటే అంది’’కనకవల్లి తల ఆడించింది అవునన్నట్టు‘‘మీ నాన్న వెళ్లాడా-’’ అంది తిరిగి‘‘ఆఁ ఎప్పుడో వెళ్లిపోయారు’’ అంది కనకవల్లి... పొయ్యిమీద కూర కలుపుతూ