ఆ రోజు ఆఫీసు నుంచి కొంచెం పెందలాడేఇంటికొచ్చాను. అప్పటికేనా సుపుత్రుడు బంటీ కాలేజీ నుంచి వచ్చి క్రికెట్‌ ఆడడానికి బయలుదేరుతున్నాడు.అద్దంలో చూసుకుంటూ క్రాపు సరిచేసుకొని ఈల వేస్తూక్రికెట్‌ బ్యాట్‌ ఊపుకుంటూ బయలుదేరిన బంటీ నన్ను చూసి కూడా చూడనట్లేనిర్లక్ష్యంగా తలెగరేసిబయటికెళ్లాడు. ఇంతలోనే లోపలి నుంచి నా శ్రీమతి వచ్చింది. నా వంక చూసి‘‘అదేంటి అక్కడేనిలబడిపోయారేం.లోపలకి రండి కాఫీఇస్తాను’’ అంది.‘‘కాఫీ సంగతి సరే. వాడి సంగతి చూస్తున్నావా? ఒక చదువు చట్టుబండలు లేవు. ఒక్క రోజు కూడా పుస్తకం పుచ్చుకోడు. ఎపడూ స్నేహితులు, షికార్లు, ఆటలు. పైపెచ్చు ఈ క్రికెట్‌ పిచ్చి ఒకటి. అస్తమానం ఆ క్రికెట్‌ గొడవ తప్ప మరో మాట లేదు’’ అన్నాను విసుగ్గా.‘‘సరే లెండి. ఎపడూ వుండే గొడవేగా ఇది. గడ్డివాము దగ్గర కుక్క తను తినదు మరొకళ్లని తిననియ్యదు అన్న సామెత చందంగా వుంది మీ ధోరణి. మీకు క్రికెట్‌ రాదు. ఆడరు. వాడు ఆడుతుంటే చూసి సంతోషించలేరు’’ అంటూ తాను మామూలుగా చదివే దండకమే చదివింది శ్రీమతి.‘‘ఏంటా పోలిక? నేను గడ్డివాము దగ్గరకుక్కనా?’’‘‘కాక! క్రికెట్‌ సంగతి మీకేం తెలుసు? ఈ రోజుల్లో క్రికెట్‌ ఆటగాళ్లకు సినిమా తారలకున్నంత గ్లామర్‌ వుంది. రేపు మనవాడు మంచి క్రికెట్‌ ప్లేయర్‌ అయితే పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. 

ఏ వస్తువుకు సంబంధించిందైనా అన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లకు క్రికెట్‌ ఆటగాళ్లే కదా బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా పనిచేస్తున్నది. సచిన్‌ టెండూల్కర్‌నే చూడండి...’’‘‘ఎవరినీ చూడనక్కర్లేదు’’ అంటూ మా శ్రీమతి వాగ్ధోరణికి అడ్డుపడ్డాను.‘‘మనవాడిని ఆ క్రికెట్‌ రంధి మాని కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టమను చాలు’’ అన్నాను.‘‘చదువుకుంటాడు లెండి. చదువు సంగతి ఎలా వున్నా రేపు మన బంటీ మంచి క్రికెట్‌ ఆటగాడై ఏ వస్తువుకన్నా బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే లక్షలు గడిస్తాడు ఏమనుకున్నారో. మీలా ఎదుగుబొదుగూ లేని ఉద్యోగంతో సరిపెట్టుకునే ఖర్మ వాడికుండదు’’ అంది శ్రీమతి.‘‘దీనినే అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగమంటారు. బంటీ చదువు గురించి, వాడి క్రికెట్‌ పిచ్చి గురించి నేను మాట్లాడుతుంటే మధ్యలో నా ఉద్యోగం సంగతి తీసుకొస్తావెందుకు?’’ అన్నాను కోపంగా.‘‘ఎందుకంటే మీ వల్ల, మీ గొర్రెతోక బెత్తెడు ఉద్యోగం వల్ల అవస్థపడుతున్నది నేను కాబట్టి’’ అంది శ్రీమతి అంతకంటే కోపంగా.‘‘ఏంటి? నువ్వు పడుతున్న అవస్థలు?’’‘‘ఎన్నని చెప్పను? మీ జీతం వెచ్చాలకే సరిపోదు. ఇక సరదాలు చట్టుబండలూ ఎక్కడ? ఓ సినిమా లేదు. షాపింగని లేదు. ఇల్లో నారాయణా అంటూ ఇరవై నాలుగ్గంటలూ ఇంట్లో కూర్చోవడమేగా సంబడం’’ అంటూ దండకం మొదలుపెట్టింది శ్రీమతి.