దాపుడు కోకఫ కేతు విశ్వనాథరెడ్డి‘‘అయ్యో, నాయనా! నా కోక! దాపుడుకోక!’’పద్దెనిమిదేళ్ళ పల్లెటూరు చెన్నమ్మ సీట్లోంచి దిగ్గునలేస్తూ అరిచింది. వుట్టిపాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంలో హోయలు లేవు. వొళ్లో పైట మరుగున పాలు తాగుతూన్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్లోంచీ జారిపోతూ కెవ్వుమంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.‘‘నాయనా! నా కోక! దాపుడు కోక!’’చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వనాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు యెవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూచి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరుతెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు. కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకొని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరుస్తున్నదో అర్థం కాక పోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఆడవాళ్ల సీట్లవైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడివున్న వాళ్ళ తలల మధ్య నుంచీ నిక్కి చూస్తూ ‘‘యేంటమ్మా, యేం జరిగింది?’’ అన్నాడు. చెన్నమ్మకు వాళ్ళ నాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగమింగుకుంటూ అవమాన భారంతో పైటలాక్కుంటూ అంది.‘‘మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నా గుడ్డల మూటె - దాపుడుకోకున్న మూటె మర్చిపోయినా’’.టికెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్ళనూ మొరటు వాళ్ళను ఆదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్‌ చెన్నమ్మ అరుపులకు మండి పడ్డాడు. ‘కూచో’ అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు - గొర్రె పిల్లను రక్షించడానికి వచ్చిన గొర్ల కాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలి మీద లేచాడు.‘‘యేందయ్యా మీ గోల. వూరుదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంది? ఆ మూటేదో తెచ్చు కునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మండ్లేదు. నీ కోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డియస్పీవా? బ్రేకినిస్సెక్టరువా?’’కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డియస్పీ కాదు; బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు. బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.‘‘ఆ మాత్తరం జాగర్త అక్కర్లా? ఆ మూటెను యాడమర్చిపోయినావు? ఆ మూటెలో యేమున్నాయి?