చాందిని మనోహర్‌తో వెళ్లిపోయిందన్న వార్త ఊరంతా గుప్పుమంది. చాందిని గురించి బాగా తెలిసినవాళ్లంతా ‘‘ఇదేందబ్బా.. ఇట్టాజేసిండాదీపిల్ల’’ అని బుగ్గలు నొక్కుకున్నారు.మరికొందరు ‘‘ఎబ్బుడు చూసినా గోషా.. గోషా అంటాండేదని ఏదో సంప్రదాయం గల పిల్ల అనుకుండాము.. గానీ ఇట్ట జేచ్చాదని ఎబ్బుడూ అనుకోలేదబ్బా’’ అని నిష్టూరమాడారు.తల్లి మాబున్నీకి కళ్లలో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంట్లో వైరు మంచమ్మీద మౌనంగా కూర్చుని వీధిలోకి చూస్తూ ఉంది. నిజంగా వీధిలోకి చూస్తోందో లేక శూన్యంలోకి చూస్తోందో కూడా చెప్పడం కష్టం.అయితే చాందిని విషయం వీలైనంతవరకు ఎవరికీ తెలియకుండానే పరిష్కరిద్దామని తండ్రి ఫకృద్దీన్‌ శాయశక్తులా ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అసలే అది చిన్న ఊరు. విషయం క్షణాల్లో పొక్కిపోయింది. మామూలు వార్త కన్నా వేగంగా పాకింది. అయినోళ్లు కానోళ్లు వచ్చి ఏదేదో మాట్లాడిపోతుంటే ఫకృద్దీన్‌కి ఒళ్లు మండుతోంది కానీ పైకి ఏమనలేకపోతున్నాడు. అతని ఆలోచనలు అతనికున్నాయి.మనోహర్‌ కుమ్మరాంపల్లె నాగిరెడ్డి కొడుకు. నాగిరెడ్డి పెద్దమనిషి. ఇందులో ఎవరి పొరపాటు ఎంతుందో అతను గ్రహించగలడు. అయితే మనోహర్‌కు, చాందినికి ఎక్కడ పరిచయం అయ్యిందో మాత్రం ఫకృద్దీన్‌కు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. చాందిని వీరపునాయుని పల్లె కాలేజిలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. 

మనోహర్‌ మాత్రం డిగ్రీ చదివాడు. అది కూడా ఈ సంవత్సరమే పూర్తి చేశాడని ఫకృద్దీన్‌కు తెలిసింది. పైగా అతను ఉంటోంది కడపలో. కడపలో రూమ్‌ తీసుకుని అక్కడే ఉంటూ అదేదో స్కూల్లో పిల్లలకు పార్ట్‌ టైం పాఠాలు చెప్పి పదో, పరకో సంపాదిస్తున్నాడని విన్నడు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుంటాడు. అలా వచ్చినప్పుడు చాందినిని బోరింగు దగ్గర కలిసేవాడేమో అనేది ఫకృద్దీన్‌ ఆలోచన.అదెలాగన్నా ఉండనీ.. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడికెళ్లి ఉంటారు?- అర్జంటుగా నాగిరెడ్డితో మాట్లాడాలనుకున్నాడు ఫకృద్దీన్‌. కానీ మాట్లాడితే మంచిదా.. లేదా పోలీ్‌సస్టేషన్‌లో కంప్లయింట్‌ ఇస్తే మంచిదా? పోలీ్‌సస్టేషన్‌లో కంప్లయింట్‌ ఇస్తే కనీసం వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారోనైనా తెలుస్తుంది. తను ఎలాగూ మనుషుల్ని పెట్టి వెతికించలేడు. నాగిరెడ్డి మీద ఆధారపడ్డం అతనికి సబబుగా అనిపించలేదు. అందుకే పోలీ్‌సస్టేషన్‌లో కంప్లయింట్‌ చేయడానికే నిర్ణయించుకుని వెళ్లి చేసి వచ్చాడు.