ఆడుకుంట, పాడుకుంట మేము బడికి బోయేటోల్లం. తొవ్వల కాలిడబ్బ గండ్లబడితె కాలితోని తన్నెటోల్లం. ప్రార్తన కంటె ముంగటనే బోయి మైదానంల కబడ్డిఆడెటోల్లం. ఎన్నడన్న లేటైతే మా డ్రిల్‌ సార్‌ మమ్ములను బడి సుట్టూత నాలుగు సార్లు ఉర్కిపిచ్చెటోడు. ఎన్మిదో తరగతిల ఆకరి బెంచిల మేము గూసుండెటోల్లం. పాటాలు బోర్‌ గొడ్తె చుక్కల ఆట ఆడుకునేటోల్లం. ఒక్కోసారి గుండుగాడు మా తరగతిలనే పండెటోడు. గున్నాలోనికి ఊకుకె ఒంటేల్కు వొచ్చేది. తెలుగు పాటం అయితుండగ రెండు సార్లు గాడు ఒంటేల్కు బోయోచ్చిండు. మూడోసారి గాడు చిట్కెనేలు సూబెడ్తె-్ఙ‘‘కూసో’’ అని సార్‌ గదిరిచ్చిండు.‘‘మా అమ్మ బిలుస్తున్నది సార్‌’’ అని గాడు అన్నడు.‘‘అక్క బిలుస్తలేదా? మల్లగిన లేస్తివా అంటె తోడ్కలు దీస్త’’ అని తెలుగు సార్‌ అన్నడు.గున్నాలోనికి జోరుగ ఒంటేలు వొచ్చింది. గాడు మా తరగతిలోనే నల్ల కులాయించిండు. గప్పటి సంది గాన్ని మేము అమ్మ బిలుస్తున్నది అన్కుంట బనాయించటోల్లం.మా ఊరికి దగ్గర్ల వున్న పగిడిపల్లి కెల్లి అహ్మద్‌ గాడు సత్తిరెడ్డి గాడు సైకిల్ల మీద బడికి ఒచ్చెటోల్లు. అహ్మద్‌ గాడు లెక్కలు గూడ బట్టిగొట్టెటోడు. ఎన్కబెంచిల గూసోని గుండుగాడు కాయితాల తోని గాలిమోటర్‌, పడ్వ, శాయిబుడ్డి జేసెటోడు. మాకు కేదారేదశ్వర శర్మ సార్‌ సోషల్‌ జెప్పెటోడు. గా సార్‌ మమ్ములను ఒక్కతీర్గ నవ్విపిచ్చెటోడు.

ఆడోల్లు ఎట్ల నడుస్తరో, ఎట్ల సిగ్గుబడ్తరో, కుర్సి మీద గూసోని కులుక్కుంట ఎట్ల దింటరో గాయిన యాక్టింగ్‌ జేసి సూపిచ్చెటోడు.మా తరగతిల పోత్కం వెంకటేశ్‌గాడు దినాం సైకిల్‌ మీద బడికి వొచ్చెటోడు. ఒక్కోసారి చేతులిడ్సి గాడు సైకిల్‌ దొక్కెటోడు. బత్మిలాడంగ, బత్మిలాడంగ ఎపడన్న ఒక్కసారి మమ్ములను సైకిల్‌ మీద ఎక్కిచ్చుకునేటోడు.‘‘యాడాది పరీచ్చలు దగ్గర బడుతున్నయి. సద్వుతున్నరా? సిన్మలు జూస్తున్నరా?’’ అని తెలుగు సార్‌ అడిగిండు.‘‘సదువుతున్నం సార్‌. గంతేగాకుంట దినాం గుడికి బోయి మమ్ములను పాస్‌ జేపియ్యమని దేవునికి గూడ మొక్కుతున్నం సార్‌’’ అని మేము జెప్పినం.‘‘మీ అసుంటోడే ఒకాయన గుడికి బోయిండు. దేవుడా దేవుడా లాట్రిల నాకు పదిలచ్చల రూపాలు ఒచ్చెటట్లు జెయ్యి. మా పోరగాన్ని కాలేజిల షరీక్‌ జెపియ్యలె. మా బిడ్డకు పెండ్లిజెయ్యలె’’ అని మొక్కిండు.