డబ్బు... ప్రాణం లేని ఒక వస్తువు. అయితేనేం మాట్లాడకుండానే ప్రపంచాన్ని పాలిస్తుంది. చేతులుఆడించకుండానే మానవ సంబంధాలను చెడగొడుతుంది. తను కదలకుండానే తన కోసం మనుషుల్ని పరుగులు పెట్టిస్తుంది. ఇవన్నీ కేవలం ప్రాణం లేకుండానే చేస్తుంది. అదే డబ్బుకి ఒకవేళ ప్రాణం వస్తే? మనలాగా మాట్లాడితే... చేతులాడిస్తే... కాళ్ళు కదిలిస్తే... అంతెందుకు, మనింటికే చుట్టం చూపుగా నడుచుకుంటూ వచ్చేస్తే! ప్రాణం లేకుండానే మనుషుల్ని ఒక ఆట ఆడుకుంటున్న డబ్బు ప్రాణమొస్తే ఊరుకుంటుందా?.... ఓరోజు ఉదయం...‘డబ్బు మిమ్మల్ని వరించాలనుకుంటోంది!అవును మీరు చదివింది నిజమే... డబ్బు మిమ్మల్ని వరించాలనుకుంటోంది. ఈరోజు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు టీవీలో డబ్బు ఇంటర్వ్యూ ప్రసారమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో స్వయంగా డబ్బే అన్ని వివరాలూ తెలియజేస్తుంది. 

ఈ ఇంటర్వ్యూని అందరూ తప్పకుండా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.ఇట్లు,పర్సనల్‌ సెక్రటరీ టు డబ్బుగమనిక: ఈ ఇంటర్వ్యూ మిస్‌ అయినవాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు.ఉదయం లేవగానే నేను పేపర్‌ తిరగేద్దామని తెరచి చూస్తే మొదటి పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో కనిపించిన అడ్వర్టైజ్‌మెంట్‌ ఇది. మొదటిపేజీ మొత్తం ఈ అడ్వర్టైజ్‌మెంట్‌తోనే నింపేశారు. ఇంకో న్యూసేమీ వేయలేదు.‘ఏమోయ్‌’ ఆశ్చర్యంతో అరిచాను నేను.‘‘ఏమైంది?’’ అరుపుతో, అంతకుమించిన పరు గుతో వంటింట్లోంచి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది నా భార్యామణి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నేను కూడా ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా అరిచాలేండి.‘‘ఇదిగో ఇది చూడు’’ అంటూ పేపర్‌ తన చేతికిచ్చా. అందుకుని ఆమె చదవసాగింది. ఇంతలో నా సెల్‌ మోగింది. తీసుకుని చూశా. నా స్నేహితుడు కామేశ్వర్రావు ఫోన్‌ చేస్తున్నాడు.

ఎత్తి, ‘‘హలో’’ అన్నా.‘‘ఏరా ఈ రోజు పేపర్‌ చూశావా?’’ అన్నాడు. సమస్యేలేదు ఈ విషయం మాట్లాడటానికే ఫోన్‌ చేశాడని అర్ధమైంది. అయినా తెలీనట్టు, ‘‘ఇంకా లేదురా... ఏఁ ఏమైంది.’’ అన్నాను.‘‘ఈరోజు ఉదయం తొమ్మిదిగంటలకు టీవీలో డబ్బు ఇంటర్వ్యూ ఉందట’’ అంటూ మొత్తం చెప్పి, ‘‘నేను సుధాకర్‌, పాణికి కూడా ఫోన్‌ చేశా. ఆంధ్రజ్యోతి, వార్తలో కూడా ఇలాగే వేశారట? మా పేపర్లో కూడా ఇదే వేశారు. నీకు వచ్చే పేపర్లో కూడా సేమ్‌ మ్యాటర్‌ వేశారో లేదో కనుక్కుందామని ఫోన్‌ చేశా’’ చివరగా అన్నాడు