ఉదయం పది గంటల దాటుతూంది.ఏప్రియల్‌ నెల ఎండ ఫెళఫెళా కాస్తోంది.నూతిగట్టు మీద కూచొని ఒక కాకి అదే పనిగా అరుస్తోంది.పాతపేపర్లు (పా.పే) కొనేవాడు బయట పోర్టికో నీడలో తీరిగ్గా బైఠాయించాడు. తన ముందున్న మూడు పెద్ద పోలిథిన్‌ బస్తాల్లోని పాత పుస్తకాలను క్రింద గుమ్మరించాడు. వాట్ని క్రిందా మీదా చేసి చూస్తూ, ‘‘మేడం గారూ! ఈ పుస్తకాలు మాకాడ ఎవరూ తీసుకోరండీ! మోత బరువుతప్ప మాకివి గిట్టుబాటు కావండీ! ఇయ్‌ వద్దుగానీ పాత పేపర్లుంటే పడేయండీ!’’ లోపల మేడం గారికి వినిపించాలని గొంతు పెంచి మరీ అరుస్తోన్నాడు.ఆ మేడం గారూ - ఆ యింటి కోడలమ్మా అయిన కళ్యాణి హాల్లో టీ.వీ. కంటుకుపోయి, మార్నింగ్‌ టీవీ సీరియల్‌ని సీరియస్సుగా చూస్తోంది.లోపల పిల్లల గుంపొకటి జేరింది. అందరూ కలిసి ఆడుకుంటూ కేకలు పెట్టి అరుస్తోన్నారు. ఈ గోలకు తోడు టీవి మోతా.దేముడి గదిలో పూజ చేసుకుంటున్న పతంజలి శాస్త్రిగారికి ఈ శబ్దాలకు చేస్తోన్న జపం మీద మనస్సు లగ్నం కావటం లేదు.పాపం కళ్యాణి పరిస్థితి కూడా అలాగే వుంది. ఏడాదికి పైగా వస్తోన్న ఈ సీరియల్‌ టెన్షన్తో, తనొక ప్రక్క చస్తోంటే - బయట్నుంచి ఈ పా.పే. వాడి అరుపులూ, లోపల్నుంచి ఈ పిల్ల మంద కేకలూన్నూ! ఈ వేసవి కాలం శలవులు ఎందుకొచ్చాయోగానీ ఈ పిల్లలతో పడలేక పోతుంది. 

ఇంట్లో పిల్లలు చాలదన్నట్లు బయట వూళ్ల నుంచి బంధువుల పిల్లలు దిగడ్చారు. అందరూ కలిసి యిల్లు పీకి పందిరేస్తోన్నారు. ఇల్లొక బాలకిష్కందయి పోయింది!‘‘మేడం గారూ! ఈ పుస్తకాలొద్దు. పాతపేపర్లుంటే పడేయండీ!’’ అంటూ పా.పే. వాడు చెవుకోసిన మేకలాగా అరిచినవాడు అరిచనట్లే వున్నాడు.కళ్యాణికి చిర్రెతుకొచ్చింది. ‘‘పాత పేపర్లేవయ్యా! వున్నయి అయి. ఆ వెధవ చెత్తంతా ఎంతో కొంత యిచ్చి తీసికెళ్లవయ్యా బాబూ! వూరికే అరిచి నా ప్రాణం తీయమాకూ!’’ బయటికి వినిపించేటట్లు గట్టిగా అంది.ఆ మాట చాలు. పా.పే. వాడి పంట పండటానికి ఈ మాటకోసమే ఇందాకట్నుంచీ గొంతుచించుకొని అరుస్తోన్నాడు.మార్నింగ్‌ టీవీ సీరియల్స్‌ చూస్తుంటే అమ్మగార్లు ఏ మూడ్‌లో వుంటారో, అప్పుడెంత వుదారంగా వుంటారో వాడికి బాగా తెల్సు. తన బేరం లాభసాటిగా సాగాలంటే ఇదే మంచి టైం.క్రింద గుమ్మరించిన ఆ పాత పుస్తకాలను గబగబా తన గోతం లోకి ఎత్తుకుంటున్నాడు.ఈ రణగొణధ్వనులకు ఎటూ తమ పూజ సాగదనుకున్నారేమో, ఆ పూటకు పూజ ముగించుకొని పతంజలి శాస్త్రి గారు అదే సమయానికి బయటికి వచ్చారు.