ఉదయం మా దూరపు బంధువు నారాయణ శర్మ గారి నుండి వచ్చిన ఆ ఉత్తరం నాలో కొంత అలజడికి కారణమయింది. ఉదయం నుండీ మనసు అదోలా ఉంది. దానికి తోడు, ‘‘పాపం, పెద్దాయన ఎంతగా ఆశ పడుతున్నాడో, ఓ కార్యక్రమం పెట్టించండి. వినేవారు రారని భయం లేదు. ఎవరొచ్చినా, రాకపోయినా మీరూ, మీ దండాల తాత ఉంటారు కదా!’’ అంటూ మా ఆవిడ ఆడిన పరిహాసపు మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఎంతకీ తెగని ఆలోచనలతో గుడివేపు బయలుదేరాను. నేను గుడికి చేరుకునే సమయానికి - చేతికర్ర సాయంతో రోడ్డు వారగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న దండాల తాత కనిపించేడు.అతని అసలు పేరేమిటో కానీ, ఊళ్ళో అంతా అతన్ని దండాల తాత అనే పిలుస్తారు.

ఊరేమంత పెద్దది కాక పోవడంతో, దండాల తాత మా ఊళ్ళో అందరికీ పరిచయమే. తెలీని వాళ్ళెవరూ ఉండరు. దండాల తాతకి ముసలి తనం మీద పడి, పదేళ్లు కావొస్తోంది. వయసు డెబ్బైయ్యేళ్ళకి పైబడే ఉంటుంది. చేతికర్ర సాయంతో నడుస్తాడు. పళ్ళన్నీ ఊడి పోయాయి. తెల్లజుత్తు పల్చగా చేత్తో సరి చేసుకుంటే చాలన్నంతగా ఉంటుంది. దవడలు బాగా లోతుకిపోయి అస్తమానూ ఆడిస్తూ ఉంటాడు. చూపు సరిగా ఆనదు. ఎదర ఉన్న మనిషినయినా కళ్ళకి చెయ్యి ఆన్చుకుని ఎగాదిగా చూస్తాడు. 

గొంతులో వణుకు, జీర. పగలంతా ఇంటి పట్టునే ఉన్నా, సాయంత్రమయ్యేసరికి మాత్రం ఠంచునుగా మా ఊర్లో ఉన్న శివాలయానికి వొస్తాడు. చీకటిపడే వరకూ గుడిలోనే ఉంటాడు. చీకటి పడగానే అతన్ని తీసుకెళ్ళడానికి అతని మనవరాలో, మనవడో వస్తారు. వాళ్ళు రావడం కుదరక పోతే తెలిసిన వాళ్ళెవరయినా తాతని ఇంటి వరకూ దిగబెడతారు. ‘చూపుసరిగా ఆననప్పుడు పొద్దుపోయే వరకూ గుడిలో ఉండే బదులు కాస్త వెల్తురు ఉండగానే వెళ్ళిపోవచ్చు కదా తాతా!’’ అని ఎవరయినా అంటే, బోసి నోటితో నవ్వీసి ఊరుకుంటాడు. సమాధానం మాత్రం చెప్పడు.గుడికి రాగానే చేతికర్రని వో మూల పెడతాడు. గుడిలో దేవుడికి దండాలు పెట్టుకుంటాడు. విడీ విడని పెదాలతో శ్లోకాల్లాంటివి వేటినో చదువుకుంటాడు. హారతి పళ్ళెంలో ఓ అర్థరూపాయో, రూపాయో వేసి, విబూది తీసుకుని నుదుటన పెట్టుకుంటాడు. పూజారి ఏ అరటి పండో ప్రసాదంగా ఇస్తే కళ్ళకద్దుకుని కొద్దిగా నోటిలో వేసుకుని, మిగతాది పొట్లం కట్టి రొండిన దాచుకుంటాడు.