రొండుబారల పొద్దెక్కింది. ఎండ దంచుతుంది. ముసలోల్లు, పడుసోల్లు, ఆడోల్లు... యాబై అరవై మందాసర ఊరిజెనం వాకిట్ల తచ్చాడుతుండ్రు. కొంతమంది గడిమెట్ల మీద కూసుండ్రు. ఇంకొంత మంది దర్వాజను పట్టుకొని వేలాడుకుంట బంకుల్లకు సూస్తుండ్రు.రొండు చెక్క బెంచీల మీద కులపెద్దలు కూసొని దీర్ఘాలోచన చేస్తుండ్రు. మధ్యమధ్యలో ఎవరో ‘ఇట్లయితే ఎట్లుంటది దొరా? సూడ్రి’ అంటుండ్రు.ఎదురుంగ బల్లెపీట మీద పాండురంగారావు దొర కూసుండు. బనీను, తెల్లలుంగి.. సైకలమూకం యేసుకుండు. గోడకు చేరగిలబడి కంతలు నొక్కుకుంటుండు. గుదిమట్టమైన రూపం. సన్నని మీసకట్టు, ఆలోచనలు.. నిద్ర లేకపోవడం.. మొకం కొద్దిగ గుంజినట్లుంది. కింది కనురెప్పల మీద ఎర్రగ ఉబ్బిన చర్మం.‘మా ఎర్రగొల్లోల్లయ్‌ తొంబయ్‌ మూడిండ్లున్నయ్‌. అదేదో మాదాంట్లె ఆలోచిస్తెనే బావుంటది దొరా’ కర్రబోయిన సోములు పెదవులు సప్పరించుకుంట చెప్పిండు. దొర నోరు తెరవక ముందే ‘యెహ నీ యెక్క మా పూజగొల్లోల్లయ్‌ మాత్రం తక్కువున్నయా? డెబ్బయ్‌ ఇండ్లు లేవా?’ తవిటి బుచ్చయ్య తలపాగా తీసుకుంట దిగ్గున లేసిండు ముప్పయ్‌ యిండ్లే అని ఎవలన్న అంటే అవకాశం యాడబోతదోనని.‘వోరారి! దాంట్లే ఎర్రగొల్ల పూజగొల్లనుకుంట తన్నుకోకర్రా. మా మంగలోల్లయి అయిదిండ్లే. మేవేఁమి పోటికి రాముగని’ చెయ్యి అటిటు ఆడించుకుంట కాగడ బక్కులు కసిరిచ్చిండు.పాండురంగారావు దొర యినుకుంట అందరి మొకాలు గమనిస్తుండు. బయిట వో దమ్ము సుట్టతాగి, తుప్పతుప్ప ఊసుకుంట దర్వాజకాడికొచ్చి తుండుగుడ్డతో మూతి తూడ్సుకుండు బోడ జగ్గయ్య.

‘ఏ కులానియి ఎన్నిండ్లున్నయ్‌ అని కాదురా దమ్ముండాలె. వొట్టి పిల్లల పరాశికం కాదు. యాబై యిండ్లున్నా మా గౌండ్లోల్ల దాంట్లె అంత పతార ఉన్నోల్లుండ్రు. ఇది ఆలోచించురి దొరా’ అన్నడు. బోడ జగ్గయ్య యిద్దరు కొడుకులు మూడేండ్లసంది సూరత్‌ల గీత పనికి పోతుండ్రు. అంతో యింతో యెనకేసుకుండ్రు.దొర ఏ నిర్ణయానికీ రాలేకపోతుండు. ‘ఈ సర్కారోనితోని పెద్ద సావు. యెపడే నిర్ణయం తీసుకుంటడో తెల్వదు. ఊకె సర్పంచి యెలక్షన్‌లు పెడితే .. బలమున్నోడు గెలుసు. తను గెలవలే నాలుగు దమ్ములు. ఇపడు వో నీయమ్మ జెనాలను ఉద్దరించాలని రిజర్వేషన్లు పెట్టె. అదీ ఆడి మనిషికి. ఏ కులం నుంచి పెట్టాలె? ఏ ఆడి మనిషి తట్టుకుంటది? పెద్ద తలనొప్పయి పోయింది. అనుకొని కంతలు నొక్కుకుండు.దొర ఎటూ మాట్లాడలేక పోయేసరికి ‘వోయ్యా! సుట్టుపక్కల మాలమాదిగోల్లకిస్తుండ్రు. మనూల్లె ఎందుకియ్యరు? పైన ఏదన్న గట్టి పైరవి పెట్టి అదెదో మా కొచ్చేటట్లు చెయ్యిరి. ఈల్లు కులాని కోడులేసి జుట్లు పట్టుకుంటుండ్రు. మాలోల్లకో మాదిగోల్లకో గని మాదాంట్లె సదురుకుంటం’ మాసిక పిచ్చయ్య లేసి దడదడా మాట్లాడిండు.