నానమ్మా, ఇంకా సినిమా అయిపోలేదు అపడే నిలబడ్డావెందుకు? కూర్చో’’ గుసగుసగా అంటూ శాంతమ్మగారి చేయిపట్టుకుని లాగింది ఏడేళ్ల సుస్మిత. దానికి శాంతమ్మగారు ఏదో అనబోతుంటే ‘‘అమ్మా, అన్ని విషయాలు తర్వాత చెప్పచ్చు ముందు నువ్వు కూర్చో. నువ్వలా నిలబడితే నీ వెనకాల వారికి ఇబ్బంది’’ విసుక్కున్నాడు కొడుకు రాఘవ. ఇంక చేసేదేం లేక నిట్టూరుస్తూ కూర్చుంది శాంతమ్మ.శాంతమ్మ ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పనిచేసి ఏడాది క్రితమే రిటైరయ్యింది. నాలుగు రోజుల క్రితమే కొడుకునూ, మనవలనూ చూడాలని హైదరాబాద్‌ వచ్చింది. వచ్చిన క్షణం నుంచీ కొడుకు ఇంటి వాతావరణం ఆమెకు అస్సలు నచ్చలేదు. కొడుకు, కోడలు ఉద్యోగం చేయడంలో తెల్లవారుఝూమునే లేచి తయారయ్యి ఎనిమిది గంటలకల్లా ఆఫీసుకి పోవడం, మనవడు, మనవరాలు స్కూళ్ళకి పోవడం మళ్ళీ రాత్రి ఏడు గంటలకు పిల్లలకు ట్యూషన్లు, పెద్దవారికి ఓవర్‌ టైములయ్యాక కలుసుకోవడం. ఇంటికి రాగానే ఎవరిపని వారిది. భోజనం టైముకు కలుసుకున్నా అపడూ కోడలు రాధ అనుక్షణం అందరికీ గుర్తుచేస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది. త్వరగా కానివ్వండి రేపు మళ్లీ పొద్దున్నే లేవాలి అంటూ. అవన్నీ ఎలా ఉన్నా శాంతమ్మగారికి చేస్తున్న మర్యాదలకి లోటు లేదు.

మనవలిద్దరి ప్రవర్తన మరీ దారుణం. ఇద్దరూ తెలుగన్నది లేకుండా ఇంగ్లీషులోనే మాట్లాడుకోడం, టి.విలో ఇంగ్లీష్‌ ఛానల్స్‌ పెట్టుకుని చూడ డం. కానీ వచ్చిన వెంటనే నీతి బోధలు చెప్పడం తగదని ఊరుకున్నా ఇంక అరోజు సినిమా అయ్యాక ఇంటికెళ్ళాక మాత్రం ఊరుకోలేకపోయింది శాంతమ్మ.‘ఏరా, సినిమా హాల్లో పిల్లకేదో తెలియక నన్ను కూర్చోమంటే, నీకు ఏమయింది అలా అన్నావు. అయినా మీ నాన్నగారు నీకు నూరిపోసిన సంస్కా రం ఇంత త్వరగా మర్చిపోయావురా? జాతీయగీతం వినిపిస్తుంటే లేచి నిలబడి దేశంపై మనవంతు గౌరవం చూపలేని రోజులొచ్చాయా?’’ సున్నిత మనస్కురాలు కావడంతో శాంతమ్మ కళ్ళనుంచి నీళ్ళు వచ్చాయి.కోడలు రాధ మామూలే ఏం మాట్లాడలేదు. రాఘవ మాత్రం పిల్లల ఎదురుగా తను చేసిన పని సమర్థించుకుంటూ ‘అదికాదమ్మా, ఎందుకంత ఆవేశపడతావు! జస్ట్‌ కూల్‌డౌన్‌? బీ ఏ రోమన్‌ ఇన్‌ రోమ్‌ అని ఎపడో అన్నారు. మనకే కాదు జాతీయ గీతాన్ని గౌరవించాలని హాల్లో ఇంకొంతమందికి తెలుసుంటుంది కదా! వాళ్లెందుకు నిలబడలేదు. అందరూ నడిచే దారిలోనే మనం నడవాలి. లేకుంటే ఈ సిటీలో గొడవలు, కొట్లాటలు వస్తాయి. అయినా అప్పటికే నీ వెనకాల సీట్లో కూర్చున్నావిడ ఎంత సణిగిందో తెలుసా?’’ అన్నాడు.‘‘అదికాదురా ఎవరూ చేయలేదని మనమూ మానేస్తే ఎలా? మన దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం కూడా ముందు ఎవరో ఒకరు మొదలుపెడితేనే కదా ఆరంభమైంది. తర్వాత ఆ పోరాటం ఎంత బలం సంతరించుకుని ఎంతమంది తమ ప్రాణాలు త్యాగం చేస్తే మన కీనాడు ఈ స్వాతం త్య్రం అనుభవించే అదృష్టం కల్గింది. ఎవరో ఏదో చేయట్లేదని కాక మనేమే ఆరంభించాలి నాన్నా. పెద్ద చెట్టు కూడా చిన్న విత్తనం నుంచి వచ్చిందే కదా’’ అంది శాంతమ్మ తన పట్టు విడవకుండా.