పలారాలల్ల బచ్చాలు అంటె ఎంత ఇస్టమో తాతీల్లల్ల ఎండకాలం తాతీల్లంటె మాకు గంతే ఇస్టం. గా తాతీలల్ల మేము దినం రాత్రి అని సూడకుంట ఆటలు ఆడ్తం. పాటలు బాడ్తం. ఎండకాలం తాతీలల్ల మేము చెర్ల ఈతలు గొట్టెటోల్లం. చెట్లు ఎక్కెటోల్లం. ఖిల్ల మీద్కి ఎక్కి కీకలు బెట్టెటోల్లం. చీమ చింతకాయలు దెంపెటోల్లం. ఎవ్వరు సూడకుంట తోటలకెల్లి దెంపుకోని వొచ్చిన మామిడి కాయలను గడ్డాముల మక్కబెట్టెటోల్లం. పెద్దబడి మైదానంకు బోయి గిల్లిదండ ఆడెటోల్లం. మా వాడకట్టుల గోటీలు ఆడెటోల్లం . గోటీలాటల ఎపడు గుండుగాడే గెల్సెటోడు. సూటి జూసి గోటీలను గొట్టుట్ల మా దాంట్ల గాడే పస్టు. పైసలు గిన జమైతె మేము సిన్మకు బోయెటోల్లం.ఎండకాలం దినాలల్లను మా ఊరికి ప్రభాత్‌ సర్కస్‌ వొచ్చింది. గంజ్‌ల చర్చి ఎన్క పెద్ద మైదానం ఉన్నది. గా మైదానంల పెద్ద డేర ఏసిండ్రు. రాత్రిపూట గా డేరలనే సర్కస్‌ నడిసేది. సర్కస్ల ఏన్గులు, గుడ్డేలుగులు, పులులు, సింహాలు, చిల్కలు, కోతులు, గుర్రాలుండేటియి. ఏన్గులు చెండాట ఆడితె చిల్కలు సైకిల్‌ దొక్కేటియి. కొంతమంది పోరిలు సన్నటి తీగ మీద నడ్సెటోల్లు. సర్కస్ల లత్కోరుగాల్లు నడ్మనడ్మ వొచ్చి మజాక్‌ జేసెటోల్లు.ఎండకాలం తాతీల్లల్ల మా బక్కోడు గాల్ల తాత ఊరికి బోయిండు. నేను, గుండుగాడు, గున్నాలోడు ఊల్లెనె ఉన్నం.

ఎపడన్న ఒకపారి మేము రేల్‌గాడిని జూసెతందుకు రేల్‌టేసన్‌ బోయెటోల్లం. రేల్‌గాడి ఒచ్చెముంగట గున్నాలోడు పట్టాల మీద చారాన బిల్ల ఉంచెటోడు. రేలు బోయినంక జూస్తె గా చారాన బిల్ల ఆటాన బిల్లలెక్క అయ్యేది. ఎండకాలంల ముంజెలొచ్చేటియి. గవ్విటిన గొనుక్కోని తినేటోల్లం. ఒకపారి ఫకీరోని బాయికి ఈత గొట్టెతందుకు బోయినం. నాకు ఈత రాదు. గుండుగాడు, గున్నాలోడు ఈతగొడుతుంటె నేను సూడబట్టిన. ఇంతల ఎవ్వరో ఒక పోరగాడు నన్ను ఎన్కకెల్లి బాయిలకు నూకిండు. నేను బాయిల బడి నీల్లు మింగుతుంటె జుట్టుబట్టుకోని గున్నాలోడు బాయిల కెల్లి ఇవుతలకు గుంజిండు. అంటెంకల నేను లొట్టలు గట్టుకోని ఈత నేర్సుకున్న. గుండుగాడు దువ్వెనలను మట్టి గవ్విటి తోకలకు దారం గట్టి పతంగులెక్క ఎక్కిచ్చెటోడు. ఎన్నెల దినాలల్ల చెరువుకట్ట మీద గూసుంటె సల్లగాలి దాకేది. పానం సుకూన్గ ఉండేది.