మసక మసక చీకట్లో పాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పరిగెత్తతా వుండాడు.దేవరెద్దు రంకెలేస్తా వస్తా వుండాది. దాని కండ్లు చుక్కలు మాదిరి మెరస్తా వుండాయి. పాము మాదిరి బుసపెడతా వుండాది. మెళ్ళోని మువ్వలు గణగణా మోగతా వుండాయి.మండుతున్న తోకని పైకెత్తింది. దుమ్మును రేపుకుంటా కసిగా కుమ్మేదానికి కొమ్ముల్ని ఇసరతా వుండాది.బలమంతా కాళ్ళల్లోకి తీసుకుని పరిగెత్తతా వుండాడు. వొళ్ళంతా చెమటలు పోసినాయి. నోరు పిడసకట్టింది. పరిగెత్తతా వుంటే రాయి తగులుకొని బొక్కబోర్లా పడినాడు. పొగలాగ దుమ్ము పైకిలేసింది.కాళ్ళూ చేతులూ కొట్టకపొయినాయి. మూతి అదిరిపొయింది. పొండ్లు కదిలిపొయ్యి నెత్తురొచ్చింది.పైకి లేసినాడు.పరిగెత్తతా వుండాడు.బొటనవేలికి రాయి తగిలి నెత్తురు కారతా వుండాది.అరికాల్లో ఇరిగిన ముల్లు సలపతా వుండాది.‘‘దేవరెద్దు సంపేస్తింది.. కాపాడండి... కాపాడండి...’’ గొంతు చించుకుని అరస్తా వుండాడు.ఎవురికీ వినపడడం లేదు.కాలుతీసి కాలు పెట్టేదానికి కష్టంగా వుండాది. సుడిగాలిలో ఎండినాకులా పల్టీలు కొడతా వుండాడు.ఎంత పరిగెత్తినా అడుగు ముందుకు పడడం లేదు.దేవరెద్దు దెగ్గిరికొచ్చేసింది.ముందుకు అడుగేద్దామంటే దారిలేదు. ముందర పెద్దబాయి. నిండుగా నీళ్ళతో తొణకతా వుండాది.తిరిగి చూస్తే,మిందికొచ్చేసింది ఎద్దు. ముందు చూస్తే బాయి. వెనక చూస్తే ఎద్దు.ఎగిరి బాయిలో ‘దబీమని’ దూకినాడు.

రాత్తిరి బాగా నిద్దర పట్టేసింది రాజన్నకు. వాళ్ళమ్మ లేపేంతవరకూ మెలుకువ రాలేదు.ఎద్దుల్ని తీసి చింతచెట్టు కింద కట్టేస్తుంటే పలపలా నాలుగు చినుకులు రాలినాయి.తలెత్తి చూసినాడు.ఏడున్నాయో గుంపులుగుంపులుగా వచ్చి పాలకొండ మింద వాలినాయి మోడాలు.‘‘ఈపొద్దు తప్పకుండా వానొస్తింది’’ అనుకొన్నేడు మనసులో.వాళ్ళమ్మ చెయ్యిపట్టుకోని వీధిలోకి లాక్కోనొచ్చి,‘‘పాలకొండమింద గొర్రెల్ని మందలు మందలుగా తోలినట్టుండాయి గదా మోడాలు. ఈ పొద్దు తప్పకుండా వానొస్తింది’’ అంటా మోడాల్ని చూపించినాడు.ముందు మోడాలు కల్లా చూసి,మల్ల రాజన్న కళ్లల్లోకి చూసి,‘‘వాన కురిస్తిందో లేదో తెలీదుగానీ నీ కండ్లల్లో మాత్తరం వాన కురస్తా వుండాది’’ అనింది.‘‘ఎన్ని దినాలైంది మా మోడాల్ని చూసి’’ అన్నేడు.‘‘తలకోన మూలన వాన దిగతా వుండాది’’ తలకోన మూలకల్లా చూసి అనింది వాళ్ళమ్మ.‘‘తలకోన మూలన వాన దిగితే మనకు తప్పకుండా వాన పడితింది. ఎంగట్రవణస్వామీ! కరువుతీరా వాన కురవల్ల స్వామీ! నీ కొండకొచ్చి మొక్కు తీర్చుకుంటాను తండ్రీ’’ అని తిరుమల కొండకల్లా మల్లుకోని మొక్కుకున్నాడు.