అది వేసవికాలం. సమయం ఉదయంఆరు గంటలయ్యింది. భానుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సన్నద్ధం అవుతున్నాడు.రైలు వేగంగా పరిగెడుతోంది. చల్లటిగాలి వీస్తూండడంతో ప్రాణానికి హాయిగా అనిపించింది నాకు. ఇక నాలుగు గంటలు ప్రయాణం చేస్తే గమ్యం చేరుకుంటాను.చాలా రోజులుగా వ్యాపార వ్యవహారాలపై తిరుగుతున్న నాకు ఎప్పడెప్పుడు ఇంటికి వెళతానా, ఎప్పడు భార్యాపిల్లల్ని చూస్తానా అని ఆతృతగా ఉంది. రైలులో నాకు ఎదురుగాఒక ముసలాయన కూచున్నాడు.ఆయనకి సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటాయి. మాటలలో తెలిసింది విధిలేక ఒక్కడూ ప్రయాణం చేస్తున్నాడట. ఆయనకు బి.పి, షుగరు, గుండె జబ్బు ఉన్నాయట. నిజానికి ఆ వయస్పుతో, అనారోగ్యంతో ఒంటరిగా ప్రయాణం చెయ్యడం చాలా కష్టం. ఆ విషయమే నేను ప్రస్తావిస్తే ఆయన వేదాంతిలా నవ్వి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నాడు.రైలు ఏదోస్టేషనులో ఆగింది. నేను ఆయనకు కాఫీ, టిఫిను తెచ్చి ఇచ్చాను. ఆయన కళ్ళలో కృతజ్ఞతాభావం ప్రస్ఫుటంగా కనిపించింది. కొంతమందికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత ఉండదు సరికదా మనకే అపకారం తలపెడతారు. కాని ఆయన నేను చేసిన అతి చిన్న సహాయానికి పొంగి పోయాడు.అది ఆయన గొప్పతనం. 

రైలు ప్రయాణిస్తోంది.ముసలాయన ప్రక్కన ఒక నడి వయస్కురాలైన స్త్రీ, ఆమె కూతురు కూచొని ఉన్నారు. అమ్మాయి ఒడిలో పసిపాప ఉంది. ఆపెద్దావిడ రైలు ఎక్కిన దగ్గర నుంచీ తను ఎంత గొప్పదో ఎంత దయార్ద్ర హృదయురాలో చుట్టు ప్రక్కల వారందరికీ గొప్పగా చెప్పడం గ మనించాను.ఆవిడ తన ధోరణిలో నాకేసి తిరిగి ఏదో చెప్పబోయింది. నేను అనాసక్తిగా ఉండడంతో ఆప్రయత్నం విరమించుకుంది. న్యూస్‌పేపరు అందుకున్నాను. రైలు ఆగింది. ఏదో చిన్న స్టేషను. అక్కడ హాల్టులేదు. ఊరు స్టేషనుకి చాలాదూరంలో ఉంది. బహుశా ముందు వెళ్ళిన రైలు ఇంకా క్లియర్‌ అవలేదేమో. ఎంతసేపటికి రైలు కదిలే సూచనలు కనిపించలేదు. నిమషాలు, గంటలు గడవసాగాయి. సమయం పది గంటలయ్యింది. ఎండ తీవ్రత పెరగసాగింది. నాలో కొంచెం అసహనం మొదలు అయ్యింది. ఎందుకంటే రైలు మామూలుగా వెళితే ఆ సమయానికి మా ఊరు చేరేవాడిని. నేను రైలు దిగి గార్డు దగ్గరికి వె ళ్ళి వాకబు చేసాను. ఆయన చెప్పిన సమాధానం వినేసరికి నాకు నీరసం ఆవహించింది. అంతకు ముందు వెళ్ళిన రైలు ప్రమాదానికి గురయ్యిందట. రైలు ఎప్పుడు కదులుతుందో చెప్పలేడట. నేను నెమ్మదిగా నడుచుకుంటూ వె ళ్ళి నాసీటులో చతికిలబడ్డాను. మరలా చదివిన పేపరే అందుకున్నాను. తరువాత నేను రైలులో కొన్న పుస్తకం పూర్తి చేసాను.