శ్రీఎస్వీ యూనివర్శిటీలో ఎం.ఏ. చదువు పూర్తి అవుతూనే మా ఇంట్లో వాళ్లు నాకెలాగైనా పెళ్ళి చేసేయాలని తహతహలాడారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని మా వాళ్ళ కోరిక. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఉపయోగముండదని మా అమ్మ అంటుండేది.మా అమ్మ నాన్నలు వయసు కొస్తూనే, సరైన సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకు నలభైఏళ్ళు వస్తూనే చెట్టంత కొడుకులు, కూతురు చేతికి అందొచ్చారని వాళ్ళ సంబరం.ఎం.ఏ. పూర్తి అవుతూనే నేను పిహెచ్‌.డి.లో చేరాలని... డాక్టరేట్‌ అవార్డు అయ్యేంత వరకు పెళ్ళి చేసుకోనని భీష్ముడిలా భీష్మించుకున్నాను. సరే ఇక చేసేదేముంది? రాజుకన్నా మొండి బలవంతుడని మా వాళ్లు నన్ను దేవరపోతులా వదలి పెట్టేశారు.పిహెచ్‌.డి. చేసే రోజుల్లోనే నాకు ఎస్వీయూలో ఆంత్రోపాలజీ విభాగంలో ‘ఫొటో గ్రాఫర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌’ ఉద్యోగం వచ్చింది. మా అమ్మ మళ్ళీ పెళ్లంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. చిన్న ఉద్యోగం, తక్కువ జీతం. పైగా రీసెర్చ్‌ పూర్తి కాలేదు... అంటూ మళ్ళీ తప్పించుకున్నాను.

 ఆంత్రోపాలజీలో ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి పిహెచ్‌.డి. పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టాను పొందాను. అప్పట్నుంచి నా పేరు ముందు ‘డాక్టర్‌’ తగిలించు కొని మురిసిపోయేవాణ్ణి. మా అమ్మకు చదువు రాదు. వేలిముద్ర అంటే మహా ఆనందంగా వేసేస్తుంది. మా నాయన ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. పెద్ద చదువుల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇతరుల నుండి ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుందో తెలుసుకునే వారు.మొత్తానికి మా అమ్మానాన్నలు నేను లెక్చరర్‌ ఉద్యోగం కోసం చదువుకున్నానని అనుకునే వారు. నాకైతే ఆ ఉద్యోగం వచ్చిన కాలానికిలే అనే అపనమ్మకం ఉండేది. నేను పరిశోధనలో చేరినప్పుడు మా చెల్లెలికి, పరిశోధన పూర్తి చేశాక మా తమ్ముడికి పెళ్ళిళ్లై పోయాయి. నా కన్నా ముందు మా తమ్ముడు ఉద్యోగరీత్యా స్థిర పడటంతో వాడి పెళ్లి నా ప్రోద్బలంతోనే జరిగిపోయింది.ఎస్వీ యూనివర్శిటీలో లెక్చరర్‌ ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. మా తెలుగు అధ్యయన శాఖలో కూడా ఒక ఎస్‌.సి., మరో ఓ.సి. క్యాటగిరిలలో లెక్చరర్‌ పోస్టులున్నాయని తెలిసి నేను దరఖాస్తు చేసుకున్నాను. ఓ.సి. కేటగిరీలో నూటరెండు మంది దరఖాస్తులు ఆంధ్రదేశం నుండి, పక్క రాష్ట్రాల నుండి వచ్చాయని విని ఆశ్చర్యపోయాను. అప్పటికే నేను నాలుగు పరిశోధక గ్రంథాలను వెలువరించాను. నావి పాతిక పరిశోధనా వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. అనేక జాతీయ సదస్సులో పరిశోధక వ్యాసాలను సమర్పించాను. ఇది నా బయోడేటా.