పొద్దుగాల్ల లేసి బంగ్ల ఎక్కి జూస్తె మా బోన్గిరి ఖిల్ల గండ్లబడలేదు. ఖిల్ల ఏమైంది? యాడికి బోయింది? ఎవ్వరన్న ఎత్కబోయిండ్రా? ఎత్కబోయెతందుకు గదేమన్న చిన్న రౌతా? ఎవడో ఒక మంత్రగాడు మాయం జేసి ఉంటడు. ఐతారం మా దోస్తులతోని గలిసి ఖిల్లమీదికి బోయిన. గదే ఆకరి అని గపడు ఎర్కలేకపాయె. ఖిల్లలేని మా ఊరు బూరుబీకిన కోడిలెక్క, చందమామ లేని మొగులు లెక్క ఉంటది గదా. మల్ల ఖిల్లను జూసె మోక దొర్కుతదో లేదో అన్కుంట మొకం గడుక్కున్న. చాయ్‌ దాగి లెక్కలు జేస్కుంట గూసున్న. ఎన్మిది గొట్టింది. ఎండ ముదిరింది. ఖిల్ల గండ్లబడ్డది. గిదంత మంత్రగాని పనే అని అనుకున్న.ఖిల్ల మీద ఒక మోట బాయి ఉన్నది. గుర్రాల కొట్టాలు ఉన్నయి. ఖిల్ల మీదికెల్లి జూస్తె ఇండ్లు బొమ్మరిండ్లు లెక్క గండ్లబడ్తయి. పట్టాల మీదికెల్లి బోయేటి రేల్‌గాడి చెట్టు మీదికి బాకుతున్న బొంత పుర్గు లెక్క అనిపిస్తది. ఎవ్వడో నవాబ్‌ మా ఊరి ఖిల్లను గట్టిండట. మా ఊరి పెద్దోల్లు ఖిల్ల గురించి ఒక కత జెప్తుంటరు. ఎన్కట ఒక నవాబ్‌ ఖిల్ల గట్టెతందుకు గుట్ట కోసం లెంకుకుంట లెంకుకుంట గిపడు మా ఊరు ఉన్న తాన్కి వొచ్చిండట. గపడు మా ఊరంత అడివేనట. నవాబ్‌కు గొర్లు గాస్తున్న ఒక గొల్లోడు గండ్లబడ్డడట. గాడు -

‘‘నవాబ్‌ సాబ్‌ గీ అడ్వికి ఎందుకొచ్చిండ్రు?’’ అని అడిగితె -‘‘ఖిల్ల గట్టెతందుకు గుట్టకోసం లెంకుతున్న’’ అని నవాబ్‌ జెప్పిండు.‘‘పది దినాలైనంక మీరు గీడికే రాండ్రి. మీకు గుట్టను సూపిస్త’’ అని గొల్లోడు అన్నడు.గొల్లోని మాట మీద బరోస ఉంచి పది దినాలైనంక నవాబ్‌ గాడ్కి బోయిండు. గాడ గాయినకు ఒక గుట్ట గండ్లబడ్డది.‘‘ఇంతకుముందు వొచ్చినపడు గీడ గుట్ట లేకుండె. గిపడు యాడికెల్లి వొచ్చింది. నీగ్గిన మాయలు, మంత్రాలు వొస్తయా?’’ అని నవాబ్‌ అడిగిండు.‘‘ఇంతకుముందు గూడ గుట్ట గీడనే ఉన్నది. గని తీగలు అల్లుకోని ఉండబట్కె మీకు గండ్లబడలేదు. గీ పది దినాలు నేను మా పోరగాల్లు గొడ్డల్లతోని తీగలను నర్కబట్కె ఇయ్యాల్ల గుట్ట గండ్లబడుతున్నది’’ అని గొల్లోడు జెప్పిండు.