దాగుడు మూతలు

తమిళ మూలం: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ - జయకాంతన్‌

అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

ఆమె అతణ్ణి సినిమాకు పిలిచింది. ఇదే మొదటిసారి కాదు; దేవకి, నటరాజన్‌ను ఎన్నోసార్లు సినిమాకు తీసుకెళ్ళింది. నటరాజన్‌ను మాత్రమేనా? అతణ్ణి తీసుకెళ్ళటం తక్కినవాళ్ళ కంటికి కంటగింపుగా ఉంటుందేమోనన్న భయంతో, తన డిపార్టుమెంటులో పనిచేసే కన్నప్పతోనూ, రంగసామితోనూ వేర్వేరుగానూ, కొన్ని సమయాల్లో గుంపుగానూ మరికొంతమందితో కలిసి ఆమె సినిమాకు పోవడం కద్దు.అయితే అదంతా వేరు. నటరాజన్‌తో సినిమాకు వెళ్లే అనుభవం వేరు అన్నది ఆమె మనసుకు తెలుసు; నటరాజన్‌కూ తెలుసు. దాన్ని బయటికి చెప్పడానికి ఆమెకు ధైర్యం లేదు. దీనికి ధైర్యం ఎందుకు? ఆమెకు లోలోన ఏదో అడ్డుపడుతోంది. అతనూ ఆమె మనసును తెలుసుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేసి చూశాడు. అన్నీ పరస్పర, చమత్కార మాటలుగానూ, మాటల్లో దాచిపెట్టి వెదికి పట్టుకోవడానికి, ఎక్కడో దాక్కుని ఆడే ఆటలా ఉందే తప్ప, నిజమైన స్పందనల్ని మాటల ద్వారా పరివర్తనం చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలిగా, అది ఆమెకు కలిగిందే లేదు.

నటరాజన్‌ ఇవ్వాళ కూడా ఆలోచించాడు. ‘ఒకవేళ ఆడవాళ్ల తీరు ఇంతేనా? ఇందులోనే వాళ్లు సుఖాన్ని పొందుతారా! ఒక వేళ దేవకి నన్ను నమ్మటం లేదా? నమ్మకపోతే నాతో ఎందుకు స్నేహం చేస్తోంది? ఇంత సన్నిహితంగా ఎందుకు మెలగుతోంది? ఇలా ఒక మగాణ్ణి తపింపచేయటంలో ఎంతోమంది ఆడవాళ్లు తమ స్త్రీత్వానికి అర్థం వెదుక్కుంటున్నారా? అందుకు నేనే దొరికానా? నన్ను ఓ మొద్దులా, కీ ఇచ్చి ఆడుకునే బొమ్మలా అనుకుంటోందా? ఇవ్వాళ నేను ఆమెను ముఖంమీదే అడిగెయ్యనా? అడిగితే మాత్రం ఏంటట? అదే దాగుడు మూతల మాటలేగా! పెదాలు కొరుక్కోవటమూ; ముఖం ఎర్రబడటమేగా! ఇంకా చిన్నపిల్లనన్న భావనేమో! ముప్ఫై ఏళ్లు కావస్తోంది... తలకూడా నెరవడం మొదలైంది.ఎలాపోతే నాకేం? ఆమె కోసం నేనెందుకు ఎదురుచూడ్డం? ఊరికెళ్ళిన ప్రతీసారీ - అమ్మ ఏడ్చి ఏడ్చి, గడ్డం పట్టుకుని అర్థిస్తుందిగా... ఆమె మనసైనా తృప్తిపడనీ - వత్సలనో, వళ్లియమ్మనో ఎవరినైనా చేసుకుని వచ్చేస్తే ఈమె బాధ తప్పుతుంది. ఇవ్వాళ తనతో ఏదైనా మాట్లాడ్డానికి రానీ... ఆఫీసు విషయాలేవైనా ఉంటే మాట్లాడండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి అని చెప్పేయాల్సిందే’ అని గట్టిగా నిర్ణయించుకునే ఇవ్వాళ ఆఫీసుకొచ్చాడు.