రాజారాం గారికళ్ళ నుండి కన్నీరు బయటికి తొంగి చూడలేదు. చేతికర్ర జారలేదు. పక్కనున్న స్నేహితుని భుజం ఓదార్పుగా పట్టుకోలేదు. ముఖంలో భావానికి మాట సరిపోలేదు.జరగవలసింది జరక్క తప్పదు కదా అన్నాడు మెల్లగా. స్వరం నూతిలోంచివచ్చినట్టయింది. పక్కనున్న గోపాలరావు గారు ఆశ్చర్యపోయారు. మిత్రునికి ఓదార్పుగా భుజంపైచేయి వేసారు.నెమ్మదయిన స్వరాలతో కొందరు మాట్లాడుకుంటున్నారు.

అగరొత్తుల వాసన తెలియని భయాన్ని కలిగిస్తోంది. ఇద్దరు ఆడవాళ్లు ముక్కులు చీదుకుంటూ కొంగుతో కళ్ళొత్తుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళంతా గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరి మాటల మధ్య ఓదార్పు వచనాల మధ్య రాజారాం గారు సూటిగా చాప వైపే చూస్తున్నారు. ఆ చాపపై పార్వతమ్మ శవంలా లేదు. ఇంకా కదులుతున్నట్టే ఉంది. మత్తుగా నిద్రపోతున్నట్లే ఉంది. తన పక్కనే నిద్రించే పార్వతిని రాత్రి రెండు మూడు గంటల వేళ లేచి తను నిశ్శబ్దంగా చూసేవాడు కాపురానికి వచ్చిన నాటి నుండి నిన్న మొన్నటివరకు.పెళ్లయిన కొత్తలో తను అలా చూస్తు న్నప్పుడు ఒకసారి పార్వతికి కూడా మెలుకువ వచ్చింది. ఏమిటండీ.. నన్నే చూస్తున్నారు అంది అల్లరిగా.పార్వతీ! నా ఆత్మలో ఆత్మగా కలిసిపోయిన నువ్వు నిశ్శబ్దంగా నా పక్కన నిద్రిస్తుంటే ఎలా ఉన్నావో తెలుసా...ఎలా ఉన్నానో...మూసిన నీ కనురెప్పలు నా ప్రాణాన్ని దాచి ఉంచిన కలువ పూపేటికలా.. నిద్రలో కూడా కొంచెం విచ్చుకున్న నీ చిన్ని నోరు పెదాలమాటున అమృతం దాచి ఉంచినట్టు... చీర పైట తొలగి... మాటల మధ్యలోనే పెదాలపై దాడి చేసింది. 

జుత్తు చెరిపి చెంపలు గిల్లి మెల్లగా తన కౌగిట్లో ఒదిగిపోయింది. ఆ మాటలు ఆ చేతలు తేనెవాకలే.తనకి మాత్రం మెలుకువ వచ్చిన ప్రతిసారి నిద్రిస్తున్న పార్వతిని చూడ్డం చాలా ఇష్టం. ఈ ‘పిల్ల’లో ఏముంది. పెళ్లిచూపుల నాడు తను చూసిన చూపులో ఏ శక్తి దాగి ఉంది అనుకునేవాడు.ఆర్థిక పరిస్థితులు, సిద్ధాంతాలు, ఆదర్శాలు, బాధ్యతల రాపిడిలో తను నలిగి పోతున్నప్పుడు ఆ చేతులే ఊతలు.. ఆ నవ్వులే విందులు.నలభయ్యేళ్ళ అనుబంధం ఇప్పుడు శవాకారమై నిద్రిస్తోంది. మధ్యలో మరి లేవదా.. ఇంకా ఎంతసేపు చూస్తారు అనదా.. పెద్దవాడు, చంటిది పుట్టిన తరువాత కూడా ఇంకా ఇలాగే చూస్తున్నారా... అని అడుగుతూ తన గుండెల్లో తలదాచుకోదేం. ఆలోచనల్లో మునిగిపోయారు రాజారాం గారు.