చీకటి... కటికచీకటి... కళ్ళు పొడుచుకున్నా కనపడనంత చీకటి. ఆ చీకటిలో చిన్నశబ్దం... చాలా చిన్నశబ్దం. ఎవరికీ వినపడకుండా నోరునొక్కుకుని పెడుతున్న వెక్కిళ్ళ శబ్దం. అంత చీకటిలో అంత నిశ్శబ్దంలో ఆ సన్నని వెక్కిళ్ళు వినపడుతుంటే అదొకలాంటి భయం. బెంగ, వెన్నుపూస లోంచి వణుకు. బలవంతంగా తెరుద్దామనుకుంటున్న కళ్ళని బలంగా మూసేసుకోవాలన్న ఆత్రం. వెక్కిళ్ళు వినపడకుండా వుండాలని చెవులు, వెక్కిళ్ళు పెడుతున్న అమ్మని చూడకుండా వుండాలని కళ్ళు, బలవంతంగా మూసుకున్న గాయత్రికి తెల్లగా తెల్లారితే కాని మెళకువ రాలేదు. మెళకువొచ్చాక చూస్తే యేముంది... అమ్మలేదు... అందనంత దూరాలకివెళ్ళిపోయింది...ఉలిక్కిపడిలేచింది గాయత్రి మంచం మీంచి. గబగబా ఫ్రిజ్‌లో నీళ్ళు తీసుకుని తాగి టైము చూసింది. తెల్లవారగట్ల మూడున్నర. ఇంకింతే. యివాల్టికింక నిద్రపట్టదు.... ఎంత కాలమిలా? నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. ఎప్పడో ఇరవైయేళ్ళ క్రిందటి సంఘటన. అప్పుడు తనకి యేడేళ్ళ కన్నలేవు. మెదడు లోపలి పొరల్లో ఎక్కడో గాఢంగా పడిన ఆ ముద్ర ఇప్పటికీ తనని అర్ధరాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచేలా చేస్తోంది.అమ్మమ్మ, తాతయ్యల చల్లని వాత్సల్యంతో పెరగడం, దరిమిలా చదువు, పరీక్షలు, వుద్యోగం వీటితో అసలు చాలా సంవత్సరాల నుంచి ఈ కల రావటం లేదు. మళ్ళీ ఇవాళిలా... ఎంతమంది డాక్టర్ల దగ్గరో తీసుకున్న కౌన్సిలింగుతో చాలావరకు పాజిటివ్‌ థింకింగ్‌ లోకి మారిన గాయత్రికి ఈ మధ్య మళ్ళీ నెగెటివ్‌ ఆలోచనలు ఎక్కువవుతున్నాయి.ఎందుకు? తనని తనే ప్రశ్నించుకుంది యిరవైయేడేళ్ళ గాయత్రి.

 తనకున్న ప్లస్‌ పాయింట్లన్నీ మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంది. కాస్త మనసు సర్దుకున్నట్లనిపించింది. లేచి, బ్రష్‌ చేసుకుని కాఫీ పెట్టుకు తాగుతుంటే సెల్‌ ఫోన్‌ మోగింది.ఎవరా అని చూస్తే తాతయ్య. వెంటనే ఆన్‌ చేసింది.‘‘అమ్మడూ, ఎలా వున్నావురా?’’ ఆప్యాయంగా తాతయ్య పలకరింపు.‘‘బాగున్నాను తాతయ్య, ఏంటి సంగతి?’’‘‘అబ్బే యేం లేదమ్మా, యివాళ సాయంత్రం నీకేమైనా వీలవుతుందేమోనని’’ అర్థమైపోయింది గాయత్రికి. అంటే రేపెవడో పెళ్ళి కొడుకు చూసుకుందుకు వస్తాడన్నమాట.‘‘కుదర్దు తాతయ్యా, ప్రాజెక్టు ఎండింగ్‌లో వుంది. యేం, యేమైనా పనుందా?’’తాతయ్య కాసేపు మాట్లాడలేదు. అమ్మమ్మ అందుకున్నట్టుంది ఫోను.‘‘పనిలా అనిపిస్తోందిటే నీకు? పాతికేళ్లు దాటాయి, యింకా యెప్పుడు చేసుకుంటావే...’’‘‘అమ్మమ్మా, ముఫ్పై యేళ్లు దాటిన వాళ్ళున్నారిక్కడ పెళ్ళిళ్ళు కాకుండా’’‘‘అందరి సంగతీ నాకెందుకు? నీ సంగతి చెప్పు. నీ ఆఫీసు అయ్యాకే కలుస్తాడులే ఆ పిల్లవాడు. తాతయ్య నీకు అన్నీ చెప్తారు. కాస్త బుర్ర దగ్గరుంచుకుని మాట్లాడు’’.అమ్మమ్మ ధోరణి అలవాటైన గాయత్రి నవ్వుకుంది. తాతయ్య ఫోన్‌ తీసుకుని, ఆ కుర్రాడి వివరాలు చెప్పి, గాయత్రి ఫోన్‌ నంబర్‌ యిచ్చినట్లూ, ఏ టైముకి ఎక్కడ కలిసి మాట్లాడుకోవాలో చూసుకోండన్నట్టూ చెప్పారు. ఆఖరిగా తాతయ్యన్న మాట గాయత్రి మనసుని కుదిపేసింది.