మన జీవితం ఊహలకి, కలలకే పరిమితం కావడం ఎప్పుడో ఆగి పోయింది. ఆరడుగుల స్ఫురద్రూపులైన అందగాళ్ళను, సౌష్టవంగా, అందంగా ఉన్న విశ్వసుందరుల్ని కలల్లోనే కాదు, జీవితాల్లోకి ఆహ్వానించి దాన్ని సత్యం చేసుకునేంత వెసులుబాటు, అవకాశం కల్పించింది సాఫ్ట్‌వేర్‌.రంగుల కలల్నీ, ఇంద్రధనస్సుల్లాంటి ఊహల్నీ, కళ్ళకూ, మనసుకు దూరం చేసి, ఆనందాల్ని, సంతోషాల్ని ఔట్‌సోర్సింగ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ జీవితం. మన బ్రతుకుల్ని, బంధాల్ని ఆఖరికి మన సమయాన్ని కూడా ఎవడి చేతుల్లోనే పెట్టి, చేతులు దులిపేసుకుంది.ప్రపంచమంతా పనిచేస్తున్నంత సేపూ మొద్దునిద్ర, చందమామ ఉదయించగానే ఉలిక్కిపడి లేచి, పడుతూ తీస్తూ ఆఫీసులకి పరిగెడ్తూ, తెల్లవార్లూ కళ్ళుకాయలు కాచేలా పనిచేస్తూ, ఒళ్ళు విరుచుకుంటానికి కూడా అవకాశం లేక, ఎక్కడో ఏడు సముద్రాల కవతల, ఎవడో వాడి పగలు వాడు పని చేసుకోవడానికి, మనం మన జీవితాల్ని అంకితం చేస్తూ, మన ఆనందాల్ని బలిస్తూ, అదే అద్భుతమైన బ్రతుకు అను కుంటూ పగటి కలల్లోనూ, రాత్రి ఆవలింతల్లోనూ, వేళగానీ వేళ ప్రకృతి విరుద్ధమైన బ్రతుకులు కోసం ఎన్ని తిప్పలు? ఎన్ని వెతలు?పొద్దున్నే ఆరయ్యింది. ఆఫీసు నుంచి ఆవలిస్తూ, అలసిన కళ్ళతో బయట పడ్డాడు కార్తీక్‌. 

తనకి క్యాబ్‌ ఫెసిలిటీ లేదు. తనే వద్దనుకున్నాడు. ఆఫీసుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అతన్ని ఫస్ట్‌ పికప్‌ చేసుకుని, రోజూ హైదరాబాదంతా తిప్పి చూపించి ఎక్కిన మూడు, నాల్గుగంటలుకి కానీ ఆఫీసుకు చేరిన ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆ హింసని తట్టుకోలేక తనే క్యాబ్‌ ఫెసిలిటీని వద్దనుకున్నాడు. టైం సేవ్‌ చేసుకున్నా వచ్చేప్పుడూ విపరీతమైన ట్రాఫిక్‌తో ఆఫీసుకి వచ్చేసరికి అలసట, ఆ ఆలసటతోనే పని చేసి, వెళ్ళేప్పుడు నిద్రలేమితో మరింత అలసట, ఆఫీస్‌ మెట్ల మీదే పడుకోవాలనేంత అలసట, కానీ తప్పదు జీతం కోసం జీవితాన్ని ధార పోయాల్సిందే.నిస్సత్తువుగా బండి తీసి, నీరసంగా నడుపుతున్నాడు. కడుపులో ఆకలి, కళ్ళల్లో నిద్ర చేతగానివాడిలా బండి నడుపుతున్నాడు. వేగంగా దూసుకుపోతున్న కార్లు, ఎవడు ఎట్నుంచి వస్తాడో, వచ్చి ఎక్కడ, ఎప్పుడు, ఎలా గుద్దుతాడో తెలీని ప్రశ్నార్థకం లాంటి ప్రయాణంతో, సడన్‌గా బ్రేక్‌ వేసి బండి ఆపాడు లేదంటే ఎగిరి అవతలపడి కాళ్ళో, చేతులో విరిగి పోయేవి. రోడ్డు ఎడమ సందులోంచి వేగంగా వచ్చిన కారు, రివ్వున దూసుకుపోయి కళ్ళుమూసి తెరిచేంతలో అల్లంత దూరం వెళ్ళిపోయింది. అంత ఫాస్టుగా డ్రైవ్‌ చేసేవాడికి తన ప్రాణాల మీద తీపికన్నా, ఎదుటి వాడి ప్రాణాల మీద జాలి ఉంటే బావుండునని ఆలోచించాల్సిన రోజులు. ఇలాంటివి నిత్యకృత్యమైనా, కార్తీక్‌కి అది ఫస్ట్‌టైం.