సుల్తానా - రెహమాన్‌ పెండ్లి.మధ్యాహ్నం నిఖా జరిగింది. ఇపడు రాత్రి 11 గంటలైంది. ‘జుల్‌వా’ - శోభనం.‘ఇవేం పెండ్లిల్లో ఏమో నాయనా! మారోజుల్లో సాయిబుల యిండ్లల్లో పెళ్ళంటే ఏడు రోజులు సందడి సందడిగా జరిగేది... కాలాలు మారిపోయాయి’’. మగపెళ్ళి వారి వైపు ముసలామె బుగ్గలు నొక్కుకుంటూ పక్కావిడతో అంది.‘‘మీ రోజులు యిపుడు ఎక్కడున్నాయ్‌ అవ్వా! నా పెండ్లి కాలానికి పెండ్లంటే - ఒకరోజు షుక్రానా రెండు రోజు నిక్కా... ఆ మరుసటి రోజు వలీమా... ఆ తరువాత అయిదు శుక్రవారాలు అయిదు జుమాగీలు జరిగేవి. ఆ పద్ధతి యిపడు లేకపోయే కదా!’’ అంది మధ్యవయసు పెద్దమ్మ.‘‘అది కాదు చిన్నమ్మా! మీ కాలంతో యిపడు పోలిస్తే ఎట్లా. ఇపడు ఎవరికి మాత్రం తీరిక ఉంది. మీ రోజుల్లో కాలం కాళ్ళతో నడిచేది. ఇపడు విమాన వేగంతో కదా పోతూవుంది. అందుకే ఒక్క రోజులోనే అన్ని సాంగ్యాలు అయిపోజేస్తున్నారు.

కాలంతోపాటు మనం పరిగెత్తకపోతే - ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అయిపోతుంది’’ - పంజాబీ డ్రస్సులో పెదాల రంగు సరిచేసుకుంటూ అంది పెళ్ళికొడుకు అక్క - పర్వీన్‌.‘‘అవున్లే తల్లీ! మేం కూర్చునే నీళ్ళు తాగేవాళ్ళం. ఈమె కాలంలో నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇపడు మీ కాలంలో పరుగెత్తుతూ పాలు తాగుతున్నారు. మంచిదే! రాను రాను యింక ఏం ఏం చూడాల్నో...’’ అంది అవ్వ.‘‘ఇక్కడ కూర్చోని ఏం చేస్తారమ్మా... పెండ్లి మంటపం పైకి రండి! వారా ఫేరీ చేద్దురుగానీ’’ పెళ్ళి సంబంధం కుదిర్చిన పేరమ్మ - జులేఖా అంది.పెళ్ళి మంటపం... పూలబారులతో గుబాళిస్తోంది. రంగురంగుల తగట్‌ కాగితాలతో తళుకులీనుతోంది.ఎవరి తాహతుకు వారు తీసిపోని విధంగా బంగారు నగలు ధరించి.. బనారస్‌ జరీ శారీలలో... పంజాబి లాచా డ్రస్సులతో.. మజ్మా, జన్నతుల్‌ ఫిర్‌దోస్‌, గులాబ్‌ అత్తర్ల ఘుమఘుమలతో వాతావరణం వింత వాసనలు జాడిస్తున్నాయి. 

రంగులైట్ల సరాలు... బార్‌ లైట్లు, ఫోకస్‌ లైట్లు వెలుగుల్ని కుమ్మరిస్తున్నాయ్‌.మంటపమే వేదిక కాగా దానిపైన పూలపందిరి మంచం... రంగుల దోమతెరతో రాజఠీవి దర్పిస్తోంది.ఆ పందిరి మంచంపై ఒకవైపు సర్‌గా ముసుగులో పెండ్లికూతురు... ఇంకొకవైపు పెండ్లికొడుకు. ఇరుపక్కల ఆడపడుచుల కలకల నవ్వులు.పెండ్లికూతురు - పెండ్లి కొడుకునకు మధ్య ఎర్రని తెర అడ్డం పట్టారు. వధూవరులు ఒకరి తలపై యింకొకరు బియ్యం తలంబ్రాలు పోసుకున్నారు. తరువాత అడ్డు తెర తీసి - వధూవరులు యిద్దరి తలలపై కప్పారు.ఎదుట కూర్చున్న వధువు ముఖాన్ని ముసుగులో నుంచే అద్దంలో చూడమని వరునికి అద్దమందిస్తూ చెప్పారు. అలాగే చేశారు. మొదటిసారి తన దుల్‌హన్‌ - వధువును చూసినందుకు శుభసూచకంగా - వరుడు ఆమె చేతికి పత్తేకి అఘోంటి - ఉంగరం ఎక్కించాడు.