భార్య చనిపోతే-కొడుకు కర్మ చేయాలి.కొడుకేవిఁటి? అసలు పిల్లలే లేరు-ఆకెళ్ల కిష్టప్పకి తప్పలేదు.బ్రాహ్మడు చెప్పే మంత్రాలు వింటూ పనిజరిపిస్తున్నాడు -వైదిక బ్రాహ్మణ పుట్టుక మరీ!ఆ మంత్రాలర్ధమవుతాయి.‘‘మానసికంగాగాని, దైహికంగాగాని, ఈమె వ్యభిచరించి వున్నట్టయితే - ఆ పాప పరిహారం ఆగుగాక!’’-కిష్టప్ప మనస్సు ఉద్వేగం పొందింది.‘‘ఇదొకటా? - నేనెందుకు ప్రార్థించాలి?’’‘‘భార్య కదా - నువ్వే భరించాలి - బాధ్యత నీదే!’’ అని ఎవరో పొడిచినట్టు అనిపించింది.ఈ స్వరాజ్యం, భార్య కానేల?తనలో అనుమానపు చిచ్చుపెట్టనేల?అది ‘చెడి’దని తేలిపోతే - అదో పద్ధతి - తేలలేదే! - పూర్తి నమ్మకం కలగదు; పోదు!భగవంతుడు స్త్రీ సంపర్కంలో ఇంతటి కిటుకు పెట్టనేల? డబ్బు సంపాదించి చూపించలేని భర్తని ఏ భార్యా భరించలేదు. ఆమెకు నలుగురిలో అవమానం. పెద్దవాళ్లు అన్నీ చూసే చేశామని సమర్థించు కుంటారు గాని, మూడు వంతుల పెళ్లిళ్లు వినికిడి మీద, నమ్మకం మీద జరిగేవే!స్వరాజ్యం పెళ్లి ఆకెళ్ల కిష్టప్పతో జరిగిందలాగే-పెళ్లినాటికి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడనీ, నెలకు పదహారు వందలు జీతమని మభ్యపెట్టారు. డిగ్రీ ‘‘వరకూ’’ చదివాడన్నారు.అంతా హుళక్కే-ఇంటరు మూడో ఛాన్సులో పాసయ్యాడు. నాటకాల రాయుడు. నాట కాల పేరు చెప్పి చీటికి మాటికీ డ్యూటీ ఎగేస్తే ఎవరు సహిస్తారు? - ఆ ఉద్యోగం పోయింది.పైగా - పెళ్లయ్యాక మన ప్రాంతానికి వచ్చేస్తాడని బోడి హామీ ఒకటి!సంగతంతా బయటపడ్డాక రెండు కుటుంబాల మధ్య యుద్ధాలై పోయాయి.

ఏమనుకుని ఏమి లాభం? స్వరాజ్యం తండ్రి కోపం దిగమింగుకుని తన ప్లీడరీ గుమస్తా లౌక్యం అంతా ఉపయోగించి - బెజవాడలో ఒక మార్వాడీ పేపరు మార్టు కంపెనీలో ఆకెళ్ల కిష్టప్పకి ఉద్యోగం ‘‘ఇప్పించు కున్నాడు’’.అప్పుడు స్వరాజ్యం ఏలూరు విడిచి కాపరానికి రావలసి వచ్చింది.్‌్‌్‌దహనం పూర్తయింది.ఆకెళ్ల కిష్టప్ప తదేకంగా మంటల్లోకి చూస్తూ నిలబడ్డాడు.పునిస్త్రీ చావు పుణ్యమన్నారు. ఈ పాపాత్మురాలికీ పుణ్యం ఏమిటి?ఆకెళ్ల కిష్టప్పని దొలిచేస్తున్న ప్రశ్న ఇది---బెజవాడలో జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా అనిపించిందతనికి-ఉదయం తొమ్మిదింటినించి రాత్రి ఎనిమిదింటి దాకా ఉద్యోగం - ఆ పైని కౌతావారి సత్రంలో నాటకాల రిహార్సల్సు - రాత్రి ఏ ఒంటిగంటకో ఇంటికి-నాటకాలు ఒక వ్యసనం, నటుడనిపించుకొని - పరిషత్తుల్లో బహుమతులు పొందడం ఒక మత్తు.ఆ మత్తులో సుఖాన్ని గొప్పగా అనుభవించాడు ఆకెళ్ల కిష్టప్ప.భార్యవిషయంలో - ఏమాట కామాట చెప్పుకోవాలి - చాలా ఉదారంగా ఉన్నాడు. కొంతలో కొంత, - తనవాళ్లు, తనింట్లో, పెళ్లికాని తన శ్రేయస్సు కోసం, అబద్ధాలాడి స్వరాజ్యం పుట్టింటి వాళ్లని మోసగించారనే న్యూనతాభావం అతన్ని బాధించేది.