సుబ్బారావు గడియారం వైపు చూశాడు. అది పదకొండు చూపిస్తూంది.‘‘సావిత్రమ్మ వస్తుందా? వస్తే ఎలా ఉంటుంది? తను చూసి భయపడకుండా ఉండగలడా?’’ అనుకున్నాడు. అతనికి చిన్నపడు తనుచూసిన ‘‘ఆమె ఎవరు?’’ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాకు అతను సెకండ్‌ షోకు వెళ్ళాడు. సగం సినిమా అయ్యాక భయంతో బయటకు వచ్చేశాడు. అప్పట్నుంచీ రాత్రుల్లో ఒంటరిగా వెళ్ళడానికి భయపడేవాడు. ఆ సినిమాలో అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న జగ్గయ్య కారులో జయలలిత ఎక్కడం, శ్మశానం దగ్గర ఆమె దిగడం, ‘ ఓ...నా..రాజా’ అంటూ పాట పాడటం తరచుగా గుర్తొచ్చి భయంతో వణికిపోయేవాడు. వయసు పెరిగేకొద్దీ అతనిలో అటువంటి భయాలన్నీ క్రమంగా పోయాయి. అందుకే యీ రోజు సావిత్రమ్మను చూడాలని ధైర్యంగా యీ ఇంట్లో పడుకున్నాడు.‘‘సావిత్రమ్మ యింకా రాదేం? మానస అబద్ధం చెప్పిందా? ఆ అమ్మాయి అటువంటిది కాదు. చాలా మంచి అమ్మాయి. మరీ చిన్నపిల్లా కాదు. ఇంటర్‌ చదువుతూంది. అయితే తల్లిపోయిన షాక్‌ వల్ల ఏదో మానసిక వ్యాధికి లోనై చనిపోయినతన తల్లి రోజూ రాత్రిపూట తన దగ్గరకు వచ్చి మాట్లాడిపోతున్నట్లు ఆమె భ్రమ పడుతూందని తన అనుమానం. ఆ విషయం నిరూపించాలనే తను యిక్కడికి వచ్చాడు.మానసను, ఆమె తమ్ముణ్ణి కూడా యిక్కడే పడుకోమంటే ఆ అమ్మాయి వినలేదు. ఇంట్లో తామిద్దరు తప్ప యింకెవరు ఉన్నా తన తల్లికి కోపం వస్తుందని, ఆమె కోపం తను చూడలేనని అంది.

 తను వాళ్ళిద్దరినీ తన ఇంట్లో పడుకోమంటే అందుకు ఒపకుందిఅనుకున్నాడు.గంట పన్నెండు కావస్తుంది. ‘‘అవును సినిమాల్లో సరిగ్గా పన్నెండు గంటలకే దయ్యం శ్మశానం నుండి బయలుదేరుతుంది. ‘దయ్యాలు నిజంగానే అలా పంక్చువాలిటీ పాటిస్తాయా లేక అది సినిమావాళ్ల కల్పనా’ అని తను చాలాసార్లు ఆలోచించాడు. జవాబు ఇప్పటికీ దొరకలేదు తనకి. ఒకవేళ సినిమావాళ్ళు చెప్పిందే నిజమైతే సావిత్రమ్మ ఇపడు బయలుదేరాలి. మరో పదినిమిషాల్లో నా ముందుండాలి అనుకున్నాడు.అంతవరకూ చదివిన వార్తపత్రిక ప్రక్కన పెట్టి టీవీ ఆన్‌ చేశాడు సుబ్బారావు. పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవి అది. డిష్‌ కనెక్షన్‌ లేదు. దూరదర్శన్‌ ఛానల్‌లో ఏదో హారర్‌ సీరియల్‌ వస్తూంది. ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు.