హస్తకార్తె వచ్చి వారం రోజులైంది.ఆకాశంలో అక్కడక్కడా వున్న పల్చటి మేఘపు తునకలన్నీ పొద్దుపొడుపు దిశగా సాగిపోతున్నాయి. ఎక్కడో పడమటి అంచుల్నించి పయనమై నెమ్మదిగా కదలి వస్తున్నవి కాస్తా తూర్పు దిశకు వంగేసరికి వడుపందుకొంటున్నాయి.మేఘాల నీడల వల్ల ఎండ బాధ తప్పినా సూదుల్తో పొడిచినంత ఉక్కపోతగా వుంది.కూలీల వొళ్లంతా చెమటలు కారుతున్నాయి.అంతస్తుపైకి మోసుకుపోతున్నారు వాళ్లు.ఓవైపు తాపీ పని చేస్తూనే అన్నీ గమనిస్తున్నాడు చెన్నకేశవ.మేఘాల కదలిక అతనికి కొంత అలజడిని కలిగిస్తూ వుంది.‘‘రాండి... రాండి... రోంత బెరీన నడ్సండి...’’ కూలీల్ని హెచ్చరించాడు. ‘‘మీరు తెచ్చే మాల్‌ బెల్దార్లు తిని ఎగజూస్చాండరు... వాల్లకాడ కుప్పలు బడాల వాల్లకు సెమటలు బట్టాల... ఆ...’’ఓ ఆడమనిషి అతనికేసి తలదిప్పి చూసింది. ‘‘యింగా యాడ పరిగెత్తమంటావన్నా! ఎక్కి దిగి పిక్కలు పట్టకపోతాంటే...’’ అంది.‘‘ఇదేం కలుపుదీసే పనెనుకున్నెవా? తొల్లికతో అట్టా పొడ్సుకుంటా యిట్టా పాట బాడుకుంటా కూకోడానికి. టౌనుపనెమ్మా యిదీ... యీపూట జమాయించి పన్జేస్చేనే రేపు కూలికి పిల్చేది.... ఆ...’’ కొంత వ్యంగ్యం మిళితం చేస్తూ చెప్పాడు చెన్నకేశవ.ఈరోజు సరిగ్గా పన్జేయకుంటే రేపు పని దొరకదనే బెదిరింపు అతని మాటల్లో.మరో మాట లేకుండా దిగిపోయింది ఆమె.నడుములెత్తు కట్టిన గోడపైన్నించి మిద్దె ముందు భాగంలోకి తొంగి చూశాడు చెన్నకేశవ.కూలీలంతా కొత్తవాళ్లే.అడ్డపంచెలు, గోచికట్టుళ్లు, బరువు మోస్తూ మిద్దె ఎక్కడంలో తడబాట్లు, మాటల్లేకుండా మౌనంగా కదలటాలూ... యీ పని కొత్తే అయినా పల్లెల్లో అపారమైన వ్యవసాయానుభవం ఉండటం వలన అలవోకగా చేసుకుపోతున్నారు.

తనే వాళ్లని అనవసరంగా తొందరిస్తున్నాడేమో!తప్పదు మరి! బంగాళాఖాతంలో వాయుగుండం లేచినట్టుంది. అది తుఫానుగా మారితే యిబ్బందే. ఈరోజు రేపట్లో పనయిపించుకోవాలి. లేకుంటే తను దెబ్బతినగలడు.అతని చూపులు రోడ్డువెంట కొంతదూరం సాగాయి.అక్కడక్కడా మిద్దె పనులు జరుగుతున్నాయి.ఇటుక, ఇసుక రోడ్డుమీదకు రావడంతో వాటిని దాటుకొనేందుకు ఆటో ఒకటి తంటాలు పడుతోంది.దారిన వెళ్లేవాళ్లు మిద్దెపనికేసి ఎగాదిగా చూస్తూ నడుస్తున్నారు.చూపులు వెనక్కి లాక్కుని తాపీనిండా సిమెంటు తీసి ఇటుకల సందులకు మెత్తుతూ ఏదో సందేహం వచ్చిన వాడిలా తాపీని కదల్చకుండా ఇటుక మీదే నిలిపిన చూపుల్ని మాత్రం కదల్చి తిరిగి దారికేసి చూశాడు.ఎదురుగా వంద గజాల దూరంలో రోడ్డుమీద నిల్చుని కొత్తగా కడుతోన్న మరో మిద్దెకేసి తదేకంగా చూస్తున్నాడు ఓ మనిషి.ఎవరో ముసలాయన. తలగుడ్డ, ముతక చొక్కా, గోనెపంచె... ఆ దృశ్యమే తన చూపుల్ని తిరిగి లాక్కుంది.ఎక్కడో చూసినట్టుంది అతన్ని.ఏదో జ్ఞాపకాన్ని మెదడులోంచి వెలికి తీసేందుకు చూపులు తెగ అవస్థపడుతున్నాయి.ఆ మనిషి... పల్లెటూరి మనిషి... తెల్లారింది మొదలు మట్టిలో మశానంలో పొర్లాడే రైతు... ఆ మనిషి.... ఏదో జ్ఞాపకం... అందినట్టే అంది జారిపోయే స్మృతి.. అతన్ని పోల్చుకొనేందుకు ప్రయత్నించి... ప్రయత్నించి...