ఒకరోజు శాంతి స్కూల్‌కు వెళ్ళడానికి సిద్ధమౌతోంది. ఇంతలో కొంతమంది పత్రికా విలేఖరులు కెమెరాలు పట్టుకుని గబగబా ఇంట్లోకి వచ్చి ‘‘నువ్వేనా శాంతివి? మేం కొన్ని ప్రశ్నలడుగుతాం.. సమాధానం చెప్పమ్మా!’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది ఊహించని పరిణామమే అయినా ఇదంతా దేనికోసమో అర్ధమయ్యింది. వాళ్ళేవో ప్రశ్నలు వేస్తున్నారు. తనేవో సమాధానాలు చెప్తోంది. కెమెరాలు క్లిక్‌ మంటున్నాయి. కానీ ఆమె మనస్సంతా కుమారిగారిని తలచుకుంటూ కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.అది చిన్న పల్లె కాదు. ఒక మోస్తరు పెద్ద ఊరే. హైస్కూలు, జూనియర్‌ కాలేజి, రెండు సినిమా హాళ్ళు, హోటళ్ళు, లాడ్జింగ్‌ హౌస్‌లు, పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌లో ఒక సి.ఐ, ఎస్‌.ఐతో పాటూ కొందరు మహిళా కానిస్టేబుళ్ళు కూడా ఉన్నారు. మహిళా కానిస్టేబుల్‌ కుమారికి పెళ్ళి కాగానే కొన్ని నెలల్లోనే జబ్బు చేసి భర్త చనిపోయాడు. ఇంట్లో తల్లి ఒకత్తే ఉన్నది. అందుకని కుమారి మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా పోలీసు ట్రైనింగ్‌ అయ్యాక కాని సేబుల్‌గా ఉద్యోగంలో చేరింది. ఊళ్ళో మంచి పేరు సంపా దించింది. 

చుట్టుపక్కల వారినందరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనకి తోచిన సాయం చేస్తుంటుంది. నేర స్తుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.ఒకరోజు సాయంత్రం కుమారి డ్యూటీ మీద పోలీస్‌ స్టేషన్‌కి బయలుదేరింది. అప్పుడే కొద్దిగా చీకటి పడుతోంది. వీధి దీపాలింకా వెయ్యలేదు. దారిలో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తూ కనిపించింది. కొంచెం దగ్గ రగా వెళ్ళాక పోల్చుకుని పలకరించింది.‘‘ఎక్కడికమ్మా, శాంతి! చీకట్లో బయలుదేరావు?’’వెంటనే శాంతి పక్కకు తిరిగి ఆమెని చూసింది. రోజూ స్కూలుకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కుమారి శాంతిని పలకరిస్తూ ఉంటుంది. శాంతి వాళ్ళ వీధిలోనే ఆమె కూడా ఉంటోంది.‘‘కిరాణా కొట్టుకి వెళ్తున్నానండి.’’ అని సమాధానం చెప్పింది శాంతి.‘‘చీకటి పడ్డాక బయటికి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళకమ్మా. అసలే రోజులు బాగాలేవు. రోజూ పేపర్లో వార్తలు చూస్తున్నాం కదా. ఎవర్నయినా తోడుగా తీసు కొని వెళ్తూండు.’’