ఉన్నట్టుండి వాన వెలిసింది.యాపచెట్టు కొమ్మల్ని ఇదిలించేసరికి నీళ్ళు పలపలా రాలినాయి.‘‘వాన చానాసేపు కురిసింది. ఏవేళ అయింటుందో?’’ అని ఆవులించింది దిగవింటి దీపం.‘‘ఈపాటికి పిల్లల కోడి మంగళగుట్ట మింద వాలిపొయింటుంది’’ అనింది ఎగవింటి దీపం.‘‘అట్లయితే ఇంగ రెండు జాములు గడిస్తే తొలికోడి కూసేస్తుంది. ఇంగా రాలేదేమమ్మా ఈ గోపినింటిది. ఈ మనుషులకి వేళాపాళా లేదు. రాత్రిళ్ళు మనచేత ఊడిగం చేయించుకుంటారు’’ అని విసుక్కునింది చిలకముక్కు దీపం.‘‘మనము ఊడిగం చెయ్యటానికి పుట్టలేదు. వెలుగునివ్వడానికి పుట్టినాము. దీపం పెట్టిన చేతులకి చేతులెత్తి మొక్కాలి. తిట్టగూడదు’’ అనింది పెద్దింటి దీపం.‘‘ఎందుకు మొక్కాలి?’’ అని అడిగింది చిలకముక్కు దీపం.‘‘ఎందుకు మొక్కాలంటే ఏం చెప్పేది? నీకు అర్తమయ్యేట్టు దీపం పెట్టిన చేతులు కత చెప్తాను. కుదురుగా కుర్చోని విను’’ అనింది పెద్దింటి దీపం.

పెదబ్బవాళ్ళ బడి సంతతోపులో వున్నింది.ఉస్తికాయలపెంట నుంచి బక్కగా వుండే బాపనయివోరు వచ్చి చదువు చెప్పేవాడు. ముక్కు పట్టుకుంటే పాణం పొయ్యేట్టు వుండేది. ఆయన ఉన్నింది కొన్నాళ్ళే.అనుమంతునాయుడు పెదబ్బ నెత్తుకోని, పీట పట్టుకోని వచ్చేవాడు. పిలకాయలందరు ఇసికలో కుర్చుంటే పెదబ్బ మాత్తరం పీటమింద కుర్చునేవాడు.ఈ భోగం ఎన్నోనాళ్ళు జరగలేదు. బాపనయివోరు పొయ్యి పీలేరునుంచి సుబ్బారెడ్డి అయివోరు వచ్చినాడు.వచ్చీరాగానే,‘‘పిలకాయలందరూ ఇసికలో కుర్చుంటే నువ్వేమి ప్రత్యేకంగా పీటమింద కుర్చునేది? నువ్వేమన్నా పుడింగివా? లెయ్యి... పీటమింద నుంచి లేసి ఇసికలో కుర్చో’’ అన్నేడు బెత్తం చూపిస్తా సుబ్బారెడ్డి అయివోరు.‘‘సార్‌.. వాళ్ళు దొరలు సార్‌. ఇసికలో కుర్చోరు’’ అన్నేడు మద్దిలో దూరి కుమ్మరోళ్ళ సూరిగాడు.‘‘రేయ్‌.. నువ్వు ఇట్లారా?’’ అని పిలిచినాడు.సూరిగాడు పైకిలేచి అయివోరు ముందుకొచ్చి చేతులు కట్టుకోని నిలబడినాడు. బెత్తం తీసుకోని వాడ్ని నాలుగు పీకులు పీకినాడు. ఆ దెబ్బతో పీటమింద నుంచి గబుక్కున లేసి ఇసికలో కుర్చున్నాడు పెదబ్బ.బడి పైకప ఎగిరిపొయ్యి వాసాలు కనిపిస్తా వున్నేయి. వానొస్తే తడిసిపోతా వున్నింది. ఆదివారం పొద్దున్నే పిలకాయలందర్ని లేపి, చేతుల్లో కక్కర కొడవలి పెట్టి మంగళగుట్టకి పిలుచుకోనిపొయినాడు సుబ్బారెడ్డి అయివోరు.