చీకటి. నల్లగా దుప్పటిలా పరుచుకున్న చీకటి.కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించడం లేదు.వెనక నుంచి ఏదో అలికిడి.సడన్‌గా ఎవరో గొంతు పట్టుకున్నారు.గట్టిగా పెనుగులాడదామనుకుంది. కానీ చేతులు, కాళ్ళు కదలటం లేదు. పక్షవాతం వచ్చినట్లుగా శరీరం స్వాధీనంలో లేదు.అరవటానికి నోరు పెగలటం లేదు.అయిపోయింది. అనుకున్నవి ఏవీ సాధించకుండానే జీవితం అంతం అయిపోతోంది. అలా అనుకోగానే ఆమె నుంచి హృదయ విదారకంగా వెలువడిందొక కేక.‘‘కరాటే, తైక్వాండో ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉన్న మార్షల్‌ ఆర్ట్స్‌. కరాటే జపాన్‌లోని ఒకినావా ప్రాంతంలో ప్రారంభం అయితే, తైక్వాండో సౌత్‌కొరియా నుంచి మొదలై ప్రపంచమంతా విస్తరించింది. కరాటే అంటే ఖాళీచేతుల్ని ఆయుధాలుగా చేసుకుని పోరాడటం. ఇందులో 60ు చేతులని, ఉపయోగించి చేసే పంచెస్‌, చాప్స్‌ మొదలయినవి ఉంటే 40ు మాత్రమే కిక్స్‌ ఉంటాయి. అయితే తైక్వాండోలో దీనికి విరుద్ధంగా 60ు కిక్స్‌ని, 40ు పంచెస్‌ని వాడతాము.ఒలింపిక్స్‌లో చేర్చబడ్డ మొట్టమొదటి మార్షల్‌ ఆర్ట్‌ తైక్వాండో. మైండ్‌ యూ! కరాటే ఇప్పటికీ ఒలింపిక్స్‌లో గుర్తించబడలేదు. తైక్వాండో కేవలం మార్షల్‌ఆర్ట్‌ మాత్రమే కాదు. తైక్వాండో ఒక ఆర్ట్‌. ఒక సైన్స్‌. ఒక ఫిలాసఫీ. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌. యుద్ధ ప్రక్రియ. మిమ్మల్ని మీరు డిఫెండ్‌ చేసుకోగలిగే సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్‌. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇట్స్‌ ఎ వే ఆఫ్‌ లైఫ్‌!’’.మెత్తగా వినబడుతోంది జయంత్‌ సర్‌ గొంతు.గ్రౌండ్‌లో పదిహేను మంది దాకా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.ఒకచోట గాలిలోకి ఎగురుతూ ఫ్లయింగ్‌ కిక్స్‌ని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 

మరోచోట ఇద్దరిద్దరు పార్ట్‌నర్స్‌గా చేరి స్పారింగ్‌ టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.‘‘కమాన్‌ వీణా! సిటప్స్‌ మధ్యలో ఆపేశావేం?’’ మాట్లాడుతూనే మధ్యలో ఎవరేం చేస్తున్నారో గమనిస్తుంటాడాయన.ఇంతలో ప్రాక్టీస్‌ చేస్తున్న మీనా బిళ్ళ బీటుగా నేల మీద పడింది.‘‘నడక వచ్చిన వాళ్ళకు పరుగు నేర్పించొచ్చు. పరుగువచ్చిన వాళ్ళకు ఎగరటం నేర్పొచ్చు. అసలు ఏదీరాని వాళ్ళతో ఇదే ప్రాబ్లమ్‌!’’ తల పట్టుకున్నాడు మాస్టర్‌.‘‘మీనా! ఒకసారి పడ్డావంటే నీకీ కిక్‌ వచ్చేసినట్లే. ట్రై ఇట్‌ ఎగయిన్‌!’’ మోటివేట్‌ చేయటంలో ఆయనకి ఆయనే సాటి.‘‘అది నీ బాడీనే కదయ్యా! నీ బాడీని నువ్వు లేపటానికి పెద్దబిల్డింగ్‌ని లేపినట్లు చేస్తున్నావు?’’ మెత్తగా శ్యామ్‌కి చురకలు పెడుతున్నాడు.‘‘మీ కట్లాగే ఉంటది సర్‌! మీరు గాల్లో ఎగరమన్నా ఎగురుతారు. ఈ ఎక్సర్‌సైజ్‌ ఎంత కష్టమో తెలుసా?’’ గుడ్లలో నీళ్ళు కుక్కుకున్నాడు శ్యామ్‌. హడావుడిగా వంట చేస్తోంది సంధ్య.ఇంతలో హాల్లో నుంచి భళ్ళుమన్న శబ్దం.గుండె గుభేలుమంది.హాల్లోకి పరుగెత్తింది.ఫ్లవర్‌వాజ్‌ని టేబుల్‌ కేసి కొట్టినట్లున్నాడు మోహన్‌.గాజు టేబుల్‌ ముక్కలయింది.