సుధీర నాయక్‌కి ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగట్లేదు. ఉండుండి కళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. భుజం మీదున్న తువ్వాలు ముక్కతో కళ్లు తుడుచుకుంటూ భోజనాల బల్ల, కుర్చీలు శుభ్రంగా తుడుస్తున్నాడు. కొంచెం దూరంలో సోఫాలో కూర్చుని పేపర్‌ చదువుతున్న ప్రకాశ్‌ మధ్య మధ్యలో అతన్ని గమనిస్తూనే ఉన్నాడు.‘‘ధీరా... ధీరా!’’‘‘వస్తున్నానమ్మా!’’ పరుగు పరుగున వెళ్లాడు సుధీర నాయక్‌. కన్నీళ్ళు బయటికి రాకుండా మింగేసి, అమాయకంగా నవ్వుతూ.‘‘పట్టుకో... పెద్దాయన జారిపోతున్నాడు’’ఒక చెయ్యి మోకాళ్ళకింద, ఒక చెయ్యి వీపు కింద వేసి, మంచం మీది నుంచి జారిపోతున్న పెద్దాయన్ని బలమైన చేతులతో పట్టుకున్నాడు సుధీర. సునాయాసంగా మంచంమీద సర్ది కూర్చోపెట్టి, ఫ్యాన్‌ వేసి ఒళ్లంతా వేడి వేడి నీళ్ళల్లో ముంచిన బట్టతో తుడిచి, పౌడర్‌ వేసి, ఇస్ర్తీ బట్టలు వేశాడు. అక్కడే నిల్చుని చూస్తున్న రజని మెచ్చుకోలుగా చూసింది.ఆ ఇంట్లో ప్రతీవారి నోటా మెలకువగా ఉన్నంతసేపూ ధీరా అనే పిలుపు వినిపిస్తూనే ఉంటుంది. ఒక్క పెద్దాయన తప్ప. ఆయన కూడా పిలుస్తూనే ఉండేవాడేమో... పక్షవాతంతో నోరూ, కుడి చెయ్యీ, కాలూ పని చెయ్యకపోవడంతో కళ్ళతోనే కోపాన్నీ సంతోషాన్నీ చూపిస్తుంటాడు.

‘‘ధీరా! నన్ను స్కూల్లో దింపాలి పద’’ ఐదేళ్ళ బబ్లూ... వాడే ఆ పేరు పెట్టింది. తన చిన్ని చేతివేళ్ళు విప్పి సుధీర చేతిలో చాక్లెట్‌ పెట్టి, చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. బబ్లూని చూస్తే సుధీర నాయక్‌కి ప్రత్యేకమైన అభిమానం. ఇంట్లో ఉన్నంతసేపూ ఒక్క క్షణం కూడా బబ్లూని వద లడు. వాడు దగ్గరకి రాగానే అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. మనసు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఇంట్లోకీ వీధిలోకీ పరుగు పెడుతున్నాడు రెండున్నరేళ్ళ విష్ణు నాయక్‌.‘‘అయ్యా! ఇత్తీస్కో...’’ తన చిన్ని పిడికిలి మూసి తండ్రి ఎదురుగా నిల్చున్నాడు.గుండ్రటి మొహం, చిన్ని కళ్ళు, కొద్దిగా వెడల్పుగా ఉన్న ముక్కు, సన్నని పెదవులు. పెదవులు బిగించి చెయ్యి ముందుకు చాచిన కొడుకుని ఎగరేసి ఎత్తుకున్నాడు సుధీర నాయక్‌. పిడికిలి విప్పితే అందులో బంక పట్టిపోయిన పటిక బెల్లం ముక్క. కన్న తండ్రి హృదయం కరిగి నీరైపోయింది. గట్టిగా హత్తుకుని కన్నీరు ఆపడానికి ప్రయత్నించాడు.