యవ్వనంతో తుళ్ళిపడే ప్రతి శరీరానికి వృద్ధాప్యం వచ్చి తీరుతుంది. కానైతే చివరి మజిలీ ఎవరి చేతుల్లో వెళ్ళమారుతుందో ఎన్నెన్ని నరకాలు వెళ్ళదీయాలో తెలీక చివరకు మిగిలే దుఃఖంతో చెలిమి చేస్తాం. ఒంటరితనంతో పాటు ఎత్తిపొడుపులు, కసిరింపులు మనకోసమే సృష్టించబడినట్లున్న ఒక చీకటి గదిమూల.... ఇదే మన గమ్యం...! ఆ అనుభవపు ముడతలకు ఎక్కడా గౌరవమే లేదు. ప్రేమతో కూడిన ఒక పలకరింపు కోసం కూడా ఈ 93 సంవత్సరాల జీవి ఎదురు చూడాలా? నాకెందుకో మా దాదీమాను చూస్తున్న కొద్దీ దుఃఖం చెలిమలా ఊరుతుంది. ఇంతమంది సృష్టికి మూలమైన ఆ మూతృమూర్తిని ఈ ఇరుకింట్లో కాకుండా చివరి రోజుల్లో హాయిగా గాలి వెలుతురులో తిప్పాలని ఓ రెండు గదులు ఆమె కోసం కేటాయించాలన్న కోరిక నాలో మొలకెత్తింది. మా అబ్బా అమ్మీల హృదయం విశాలమైనా ఇంట్లో భాయి భాబీ పిల్లలు ఎవరైనా వస్తే వచ్చే ఇబ్బంది నాకర్థమయి పోయింది. దాంతో మాకున్న రెండు గదుల ఇంటి పక్కనే మరో రెండు గదులు కట్టించాలన్న తలంపు కలిగింది. అబ్బాతో అంటే చాలా సంతోషపడి, పక్కనున్న స్థలంలో కడదామని అన్నారు. ఇరుకింటితో ఇప్పటిదాకా నెట్టుకొచ్చినా ఇప్పుడు బాగా ఇబ్బందిగా అనిపించడంతో కూడా ఆఅభిప్రాయానికి వచ్చారు అబ్బా. ఆ రెండుగదులు దాదీకోసం... ఆ తరువాత నావి!వెంటనే ఊళ్ళో సీనియర్‌ మేస్త్రీని పిలిపించారు అబ్బా.

 ఆ మేస్త్రీ నెల్లూరు వాస్తవ్యుడు, కానీ ఇక్కడే స్థిరపడ్డాడు. ఆయనతో పాటు ఆ ప్రాంత యాస కూడా వచ్చి వాకిట్లో నిలబడింది. చాలా మర్యాదగా మాట్లాడు తున్నట్లున్నాడు కానీ నన్ను దాటి ఎవరూ ముందుకెళ్ళలేరు అన్న అహంభావమేదో ప్రతిమాటలో ప్రతిధ్వని స్తుంది. అబ్బా అన్నారు. కాయితం రాసుకుందామని. కానీ ఎందుకండీ నేను మాటంటే ప్రాణం ఇచ్చే వాణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు మేస్త్రీ. రెండ్నెలల్లో రెండు గదులు కట్టడం పూర్తిచేయాలనేది ఒప్పందం. ఎస్టిమేషన్‌ కూడా వేసిచ్చాడు. కొంత అటు ఇటుగా అవుతుందని కూడా చెప్పాడు. అబ్బా ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఉండటం వలన కొంత లౌక్య ప్రపంచంతో లావాదేవీలు ఆయనకు అలవాటు లేకపోవడం వలన కూడా ఆ ఇంటి పని మొత్తం పూర్తయ్యే వరకూ నేనే చూడాలని అబ్బా చెప్పడం వలన ఇక నేను ఆ పనుల్లో కూరుకుపోయాను.నేను కట్టిస్తున్నానని అందరూ అనుకుంటున్న రెండు రూమ్‌ల పునాది తీయడానికి ఒక శరీరం భారంగా నడుచుకుంటూ వచ్చింది. మేస్త్రీ ఆదేశాల మేరకు ముగ్గు గీసింది. కొబ్బరికాయ కొట్టి అగర్‌బత్తీలు వెలిగించిన ఆ శరీరం కాలిపోయి చివరకు మిగిలిన నల్లని పుల్లలా వుంది. ముగ్గురు కొడుకులను, ముగ్గురు కూతుర్లను కన్న ఆ దేహానికి ఇప్పుడెవరూ తోడులేరు ఒక రెండు చేతులు, రెండు కాళ్ళు తన భార్య తప్ప. ఇప్పుడు పునాదులు తీస్తే లోపల ఆకలి గోతులను పూడ్చు కోగలదు. అసలు పునాదుల్లోనే ఎంత ఆకలి ఉంది? ముడుతలు పడిన దారుఢ్యంతోనే ఆ దేహం పునాదుల్ని తవ్వింది. వెళ్తూ వెళ్తూ అతను తన ఆకలిని, దాహాన్ని కొంత దుఃఖాన్ని పునాదుల్లోనే వదిలేశాడేమో?