భూమి అంగారక గ్రహంలా ఎర్రగా కనిపిస్తోంది.అస్తమిస్తున్న సూర్యుడి వెంట ఆ ఎర్ర రంగు కొండల వెనక్కి జారిపోతోంది.హార్సిలీ హిల్స్‌కు పడమర దిక్కున ఉన్న కొండవాలు ప్రాంతం గాలిబండ మీద కూర్చున్న ప్రేమ జంట... ఆ సంధ్యా సమయాన్ని ఆస్వాదిస్తోంది. సూర్యుడి బంగారు కాంతి కిరణాలు ప్రసరించి మెరుస్తున్న ఆమె పాదాల మీద అతని చూపులు నిలిచి ఉన్నాయి. అతని చేతులు ఆ పాదాలను తన్మయత్వంతో తడుముతున్నాయి. అప్పుడప్పుడూ అతని పెదవులు వొంగి ఆమె పాదాలపై కృతజ్ఞతతో చప్పుడు చేస్నున్నాయి.ప్రియుడు తన పాదాక్రాంతమయ్యాడని మురిసిపోతున్న ఆమె ప్రపంచంలోకి ఓ దీర్ఘ విరామం చొరబడింది.

ఏకాంతం చెదిరి ఆమెకు గర్వభంగమైంది. అతని చేతులు తన పాదాల మీద ఉన్నాయనే కానీ మనసెక్కడో ఉంది. పరధ్యానాన్ని ఆమె సహించలేకపోయింది. కోపాన్ని పంటి బిగువున అణచిపెట్టి అడిగింది.‘‘నీ మనసెక్కడుంది? నువ్వేమాలోచిస్తున్నావ్‌?... ఉన్నది ఉన్నట్టు చెప్పు! అబద్ధాలు చెప్పకు! ఎందుకు సడెన్‌గా సైలెంటైపోయావు?’’ మాటల్లో కంటే ఎక్కువ అసహనం ఆమె కళ్ళలో, ఎగసిపడుతున్న గుండెల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది.పిడుగులాంటి ఆ ప్రశ్నకు అతను కలవరపడలేదు. వెంటనే సమాధానం చెప్పడం చేతగాక... ఆమె అసహనానికి కారణమైన మౌనాన్ని మరికాసేపు కొనసాగించాడు. తన నిజాయితీ మీద నమ్మకంతో చివరికి అతను మెల్లగా నోరు విప్పాడు.‘‘ఎంత సంతోషంలో కూడా నాలో ఏదో దిగులు తిరుగుతుంటుంది.

 నీ పాదాలు తాకాలని, వాటిని ముద్దుపెట్టుకోవాలని, మరే ధ్యాసా లేకుండా ఆ పాదాల దగ్గరే పడి ఉండాలని అనుకుంటానా... తీరా అవకాశం వచ్చేసరికి అలా ఉండలేకపోయాను. నేను మౌనంగా ఉన్న ఆ కాసేపూ నా ప్రియురాళ్ళు గుర్తొచ్చారు. అందమైన వారి ముఖాలు గుర్తొచ్చాయి. వాళ్ళలో నేను కోరుకున్న వాళ్ళున్నారు, నన్ను కోరుకున్న వాళ్ళున్నారు... నాతో ఏ సంబంధమూ లేని వాళ్ళూ ఉన్నారు. ఈ క్షణం వాళ్ళంతా ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాను... నా అంత సుఖంగా ఉన్నారా లేదా అని దిగులుపడుతున్నాను...’’అతని సమాధానం పూర్తికాక ముందే ఆమె రెట్టించిన అసహనంతో తోక తొక్కిన తాచులా లేచి నిలబడింది. ఆ క్షణం ఆమె కంటికి అతనో పురుగులా కనిపించాడు.