దభేల్‌మని ఎగిరిపడ్డాడు రంగ. అప్పటికి సమయం మధ్యరాత్రి ఒక గంట దాటి పదో ఇరవయ్యోనిమిషాలవుతుంది.ఊరి చివర ఉన్న ఇళ్ళేమో ఎక్కడా జనసంచారం కానీ వాహన సంచారం కానీ లేవు.చీకటి చినుగుల దుప్పటిలా చిక్కగా ఉంది. దుప్పట్లో చిరుగుల్లా పైన నక్షత్రాలు, దయ్యం కళ్ళలా మినుకూ మినుకూ మంటున్నాయి.చలిగాలి జివ్వుమని కొడుతూ ఉంది. ఆ కాలనీ కొంపలకి దగ్గర్లో ఉన్న మామిడి తోట కొమ్మల, రెమ్మల సందుల్లోంచి దూరి ‘‘ఇస్సు’’మంటూ పిశాచం బుసకొట్టినట్టు వినపడుతూ ఉంది.నేల మీంచి లేచి దుమ్ము దులుపుకున్నాడు రంగ. ఇక ఈ రాత్రికి శివరాత్రే అనుకున్నాడు.అప్పటికి నెలరోజులపైనే అవుతుంది రంగకి అన్న వరస అయ్యే దూరపు బంధువు వీర్రాజు భార్య ఆ కొంపలో ఉరేసుకుని చనిపోయింది.కడుపునొప్పి భరించలేక ఉరేసుకుందని కొందరు, వీర్రాజుగాడు పెట్టే బాధలు పడలేక పోయిందని కొందరూ, చింతలపూడి నూనెమిల్లులో ఆపరేటర్‌గా చేసే వీర్రాజుగాడే తాగేసి ఏమీ తోచక పెళ్ళాన్ని ఉరేసేడని కొందరూ, ఇలా సమైక్యాంధ్ర వేరు వేరు రాష్ర్టాలా అన్న సమస్యకి ఎన్నివాదనలున్నాయో, అన్ని రకాల వాదనలు వినిపించారు. కానీ ఆ విషయం త్వరగానే మరుగున పడింది... వీర్రాజు భార్య మంగ దయ్యంగా మారడంతో.చనిపోయిన పది రోజుల తర్వాత తెల్లచీర కట్టుకుని, జుట్టువిరబోసుకుని పాత, కొత్త సినిమాల్లో డ్రస్‌ కోడ్‌ పాటిస్తూ, డ్యూటీ ఎక్కిన కొత్త కుర్ర పోలీసోడిలా తన దయ్యం యూనిఫాం మెయింటెన్‌ చేస్తూ, కాలనీ పక్క యెగ్గెన్నారాయణ మామిడి తోటలో డ్యూటీ మీద విరగ తిరుగుతూ ఉంది.అక్కడున్న కాలనీలో అరవై కొంపలున్నా పూర్తయినవి సుమారు ముప్ఫైయే. 

గవర్నమెంటోళ్ళు ఇచ్చిన సొమ్ము పోనూ సొంత డబ్బు ఇరవై వేలుపైన వేసుకుని పూర్తి చేసి కాపురం పెట్టగలిగినోళ్ళే అక్కడున్నారు.అందలో ఓ అన్నాబత్తుల సూర్రావు రాత్రేళ మూత్రం పోసుకుందుకు తన ఇంటికి, తోటకి మధ్య ఉన్న కంప దగ్గరికి పోయే సరికి, మసక మసక వెన్నెల్లో మబ్బులా నడుచుకుంటూ పోతూ ఉంది మంగ. మంగ నీడ పడి తలెత్తి చూసిన సూర్రావువేపు తిరిగి రామ్‌సే బ్రదర్స్‌ సినిమా దయ్యం డిటిఎస్‌లో నవ్వినట్టు పలకరింపుగా నవ్వింది.ఆ దెబ్బకి లుంగీ తడిపేసుకున్న అన్నాబత్తుల సూర్రావు ఎలా తన కొంపలోకి చేరాడో, ఎలా ఆంజనేయస్వామి పటాన్ని పట్టుకుని విరుచుకుపడిపోయాడో జనం వింతగా చెప్పుకున్నారు.మర్నాడు రాత్రి కొంత మంది ఇళ్ళ తలుపులు దబదబా కొట్టింది మంగ దయ్యం.దాహంతో మూలుగుతున్నట్టూ, నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నట్టూ ఉందని కొందరన్నారు.మూలిగింది దాహంతో కాదని, మెడకున్న ఉరితాడు తియ్యమని అడిగిందని కొందరన్నారు. జనం ఏదో ఒకదాన్ని అంత తొందరగా ఒప్పుకోరు కదా. పిల్లలు సందేలైతే చాలు గుమ్మాలుదాటి రావట్లేదు.