‘‘నాన్నా మీరో దెయ్యం కథరాయకూడదూ?’’ అని అడిగిందినన్ను స్పందన ఓ రోజు.‘‘నీకెందుకా కోరిక పుట్టింది?’’ అని అడిగాను.‘‘దెయ్యం కథలు చదవడానికి బాగుంటాయి. థ్రిల్లింగ్‌ గానూ ఉంటాయి. రియాలిటీ వదిలేస్తే ఫిక్షన్‌ టైపులో వినోదాన్నిస్తాయి’’ అంది.‘‘అది చెప్పింది నిజమే. ఇంతదాకా అన్ని రకాల కథలూ రాశారు. దెయ్యం కథ ఒకటి కూడా రాయలేదు. ఇపడు రాస్తే మీ సొమ్మేం పోతుంది?’’ అంది నా శ్రీమతి రాధిక.‘‘సొమ్ము పోదు వస్తుంది, పత్రికల నుంచి పారితోషికం రూపంలో’’ అన్నాను నవ్వుతూ.‘‘అయితే రాయండి నాన్నా నా కోసం...ప్లీజ్‌’’‘‘అలాగే నా అభిమానిగా నీ కోరిక తప్పక తీరుస్తాను’’ అంటూ చేయెత్తి అభయమిచ్చాను.అప్పట్నుంచీ మొదలయ్యాయి నా పాట్లు. ప్లాట్లు తోస్తున్నాయి కాని అన్నీ యిదివరకే చదివినట్లు అనిపించసాగాయి. క్రొత్తగా అనిపించినవాటికి ముగింపు తోచడం లేదు. అపడు గుర్తుకొచ్చారు నా చిన్ననాటి స్నేహితులు చక్రపాణి, సుధీర్‌లు. 

ఈ సారి చిత్తూరు వెళ్ళినపడు వాళ్ళను కలసి నా కథకు ముడిసరకును అందజేయగలరేమో కనుక్కోవాలి. ఎందుకంటె వాళ్ళ పెద్దలు పల్లెటూరు నుంచి ఉద్యోగరీత్యా పట్టణానికి వచ్చి స్థిరపడినవాళ్ళు. వీళ్ళిద్దరు తరచుగా తమ గ్రామానికి వెళ్ళి వస్తూండేవాళ్లు. కాబట్టి వాళ్ళకు దెయ్యం గురించిన అనుభవాలు ఎదురై ఉండవచ్చు. లేదా తమ పెద్దల ద్వారా అటువంటి అనుభవాల గురించి విని ఉండవచ్చు అనుకున్నాను.అలా అనుకున్న నెల రోజులకే తిరుపతి వెళ్ళే అవకాశం వచ్చింది నాకు. తన పుస్తకావిష్కరణ సభకు రమ్మని ఓ సాహితీ మిత్రుడు ఉత్తరం రాసి ఆహ్వాన పత్రికను జతచేసి పంపాడు. మరో ఆలోచన లేకుండా వెంకటాద్రికి టికెట్టు రిజర్వ్‌ చేసుకున్నాను.ఆదివారం ఉదయం తిరుపతి చేరాను. పదిగంటలకు సభ మెదలై ఒంటిగంటకు ముగిసింది. భోజనం ముగించుకుని మూడు గంటలకు చిత్తూరు బస్సెక్కాను. అయిదుగంటలకు బస్సు దిగి నేరుగా చక్రపాణి ఇంటికి వెళ్ళాను. నేను వస్తున్నట్లు తెలియజేసినందువల్ల చక్రపాణి నా కోసమే ఎదురు చూస్తున్నాడు. నన్ను చూసి ఎంతో సంతోషించాడు.‘‘నువ్వు వస్తున్నట్లు సుధీర్‌కు చెప్పాను. నువ్వు రాగానే మిస్‌ కాల్‌ యివ్వమన్నాడు తను బయలుదేరి రావడానికి’’ తన సెల్‌ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు.