ఫణీంద్ర రైల్వే సర్వీసు పూర్తికానున్న ఉద్యోగి. అతని భార్య శాంతి. పేరుకి తగ్గట్టే ఎంతో శాంతంగా ఉంటూ తన పేరుని సార్ధకత చేసుకుంటోంది. అప్పుడప్పుడు భర్త అడగకపోయినా సలహాలిస్తూ సంసార నావ ఆటుపోట్లకి గురికాకుండా జాగ్రత్తపడుతూ కరణేషు మంత్రి అనిపించుకుంటూంది. వారికి ఇద్దరు పిల్లలు. అదృష్టమో, దురదృష్టమో ఇద్దరూ మగపిల్లలే. పెద్దవాడు శ్రీధర్‌ ఇంజనీరింగ్‌ చదివి, ఓ పేరున్న మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ పెళ్లాం పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. రెండవ కొడుకు రాఘవ ఈ మధ్యనే ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యాడు. అంతా సవ్యంగానే ఉంది కదా, ఇంక ఈ నస ఎందుకు అనుకుంటున్నారు కదూ, అదిగో అక్కడే తెలియకుండా కథలో కాలేసేసారు కాబట్టి లోతుని గూడా చూసి బయటికి రండి.్‌్‌్‌‘ఐతే నీకు ఇంజనీరింగ్‌ చదవడం ఇష్టం లేదంటావ్‌’ కొడుకు రాఘవని ఉపోద్ఘాతంగా అడిగాడు ఫణీంద్ర.‘అదే కదా చెబ్తున్నాడు’ చెప్పింది శాంతి.‘నువ్వుండు, వాడిని చెప్పనీ’ చిరుకోపంతో శాంతి మాటలకు అడ్డుపడ్డ ఫణీంద్ర, ‘ఊ చెప్పరా నీకు ఇంజనీరింగ్‌ చదవడం ఎందుకు ఇష్టం లేదు?’ కొంచెం గొంతుస్థాయిని పెంచి అడిగాడు.తండ్రి కోపాన్ని అర్థంచేసుకొన్న రాఘవ ఏం మాట్లాడకుండా అలాగే నించున్నాడు.ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న కొడుకుని చూడగానే సహనం చచ్చిపోయిన ఫణీంద్ర ‘ఏంటిరా ఏం సమాధానం చెప్పకుండా అలా ముంగిలా ఊరుకుంటావే’ ఈసారి కొంచెం కోపంగానే అన్నాడు.

‘ఏంటండి, వాడేదో నేరమో, ఘోరమో చేసినట్లు అలా వాడిమీద కోప్పడతారెందుకు’ అంతవరకు శాంతంగా ఉన్న శాంతి కొంచెం సీరియస్‌గా అనడంతో మెత్తబడ్డ ఫణీంద్ర ‘సరేనే విషయం కనీసం నీకైనా చెప్పమను, కన్నతల్లివి కదా’ వ్యంగ్యంగా రాఘవ వంక చూస్తూ అన్నాడు.అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకొన్న రాఘవ మొదటిసారిగా తండ్రి ముందు నోరువిప్పి ‘సారీ నాన్నగారు, నాకు ఇంజనీరింగ్‌ చదవడం ఇష్టంలేదు’ ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లగా చెప్పాడు.‘అదే ఎందుకిష్టం లేదు అనే అడుగుతున్నాను’ తిరిగి అన్నాడు ఫణీంద్ర.‘నాకు ఫైన్‌ ఆర్ట్స్‌ అంటే ఇష్టం నాన్నగారు. నేను ఫైన్‌ ఆర్ట్స్‌ లోనే జాయినవుతాను’ చెప్పాడు రాఘవ.‘ఎందుకూ పనికిరాని ఫైన్‌ ఆర్ట్సా! కూడు పెట్టేనా? గుడ్డ పెట్టేనా? పిచ్చి వెధవలా బొమ్మలు గీసుకుంటూ కాలం గడపాలి తెలుసా?’ వ్యంగ్యంగా అన్నాడు.‘అలా అనకండి నాన్నగారు! దయచేసి ఏ విద్యనీ అంత చులకనగా తీసిపారెయ్యకండి. ఫైన్‌ ఆర్ట్స్‌ చేసి పైకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు’ అంటూ మనసులోని మాటని ధైర్యంగా చెప్పాడు రాఘవ.‘అలా పైకొచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. చెప్పాలంటే వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. కాని నేను కోరుకున్నట్లు నువ్వు కూడా మీ అన్నలాగే ఇంజనీరింగ్‌ చదివేవనుకో, ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు’ రాఘవ మనసు మార్చేందుకు మరో ప్రయత్నం చేస్తూ అన్నాడు ఫణీంద్ర.