కృష్ణప్రసాద్‌ వుండేది వూరు కాదు. అలా అని అడవే కాదు. అడవిలో కట్టిన రైల్వే స్టేషన్‌ ఆనుకుని కట్టిన రైల్వే క్వార్టర్‌. అక్కడ మహా వుంటే పదిపదిహేను రైల్వే క్వార్టర్స్‌ వుంటాయి. రైల్వేలో పనిచేసేవారు తప్ప మరెవరూ అక్కడ వుండరు. ఆ ఊరే పేరే ‘‘త్యేడా’’ రైల్వే స్టేషన్‌ అయినా అదే... ఊరైనా అదే... ఇది కొత్త వలస. కిరిండూల్‌కు వెళ్లే రైలు మార్గంలో వుంది.డ్యూటీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్‌ వేడి నీళ్లతో తలస్నానం చేసి బాత్‌రూమ్‌ నుండి తల తుడుచుకుంటూ తన గదిలోకి వచ్చి మంచంపై వాలాడు. ఉదయం నుండి ఎండలో డ్యూటీ చేసి వచ్చిన అతనికి బడలిక కొంత తీరినట్లుగా వుంది. మంచం పై నుంచి లేచి ఏవైనా ఉత్తరాలు వచ్చాయోమోనని తన టేబుల్‌పై చూసాడు. గుండ్రని ముత్యాల్లాంటి అక్షరాలతో తన అడ్రస్‌తో వున్న కవరు కనిపించింది. ఆ దస్తూరి చూడగానే తన ఆప్తమిత్రుడు హరగోపాల్‌ నుండి వచ్చిందని తెలియగానే వున్న కాస్త బడలిక పోయి ఉత్సాహంగా కవరు తీసుకొని ఉత్తరాన్ని పైకి తీసి చదవడం మొదలుపెట్టాడు.‘‘ఒరే! కృష్ణా!...’’ఆ సంబోధన ఎంతో మధురంగా, ఆత్మీయంగా వుంది. హరగోపాల్‌ ఉత్తరం ఎంత బాగా రాయగలడో తను అంత పేలవంగా రాస్తాడు. గోపాల్‌ ఉత్తరం చదువుతుంటే ఎదురుగా మాట్లాడుతున్నట్లే వుంటుంది. ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు.

‘‘నీవు రాసిన ఉత్తరం అందింది. వెంటనే జాబు రాస్తున్నాను. నీ ఉత్తరం చదువుతుంటే నాకు మన చిన్ననాటి ఎన్నో సంఘటనలు గుర్తుకు వస్తాయి. ‘గోళికాయలు’, ‘కోతి కొమ్మొచ్చు’,‘కర్రబిళ్ల’ ఆటలు... ఓహ్‌! ఆ రోజులే వేరు. ఒరే! కృష్ణా ఒకోసారి ఏమనిపిస్తుందో తెలుసా?! భగవంతుడు మన వయస్సును పెరగనీయకుండా అక్కడితో ఆపేస్తే ఎంత బాగుండునని. కానీ నా పిచ్చి ఆలోచనకు నాకే నవ్వు వస్తుంది. ఇప్పటి జీవితాలు ఏమిటో అంతా ‘మెకానికల్‌’గా వుంటున్నాయి. నా మటుకు నేను ఉదయం లేవడం ఆరోజుకి అటెండ్‌ అవవలసిన కేసులు చూసుకోవడం, కోర్టుకు వెళ్లడం, ఆర్గ్యుమెంట్స్‌, సాయంత్రం ఇంటికి రావడం అంతా రొటీన్‌ లైఫ్‌ బోర్‌ కొడుతుందిరా.