ఆదివారం ఉదయం తొమ్మిదయి ఉంటుంది. వరండాలో కూర్చుని దినపత్రికను తిరగవేస్తున్నాను. చల్లటి ఎండ నేను కూర్చున్న మడతకుర్చీ వరకు వచ్చి ఆగింది. ఒక్క ఆదివారమే ఏపని చేయకుండా గడుపుతాను. అత్యవసరమయితే తప్ప ఎక్కడికీ వెళ్లను. నా భార్య కాని, పిల్లలు కాని ఫోన్లు తీసుకుంటారు. ఇంట్లో ఎవరూ నా విశ్రాంతికి భంగం కలిగించరు. నేను ఇంట్లో ఉన్నా లేననే చెబుతారు. ఎవరినీ చూడను.ఆ ఉదయం మటుకు తప్పించుకోలేక పోయాను. నా బంగళా బయట కారు ఆగిన చప్పుడయింది. నేను కూర్చున్న చోట నుండి కారు నాకు కనిపిస్తోంది. ఆ కారును అక్కడినుండి తీసేయమని వాచ్‌మేన్‌ అరుస్తున్నాడు. కారు ముందుకు వెళ్లి దిగినట్టుంది. వెంటనే తలుపు మూసిన చప్పుడయింది.కారు దిగింది ఆమే అనుకుంటాను. వాచ్‌మేన్‌ దగ్గరకు వచ్చి ఏదో అడుగుతోంది. వరండాకు గేటు అట్టే దూరంలో లేదు కాని మాటలు వినబడడం లేదు. ఆమెకు ముప్పయి అయిదు సంవత్సరాలుంటాయి. ఎర్రగా, సన్నగా ఉంది. వేసుకున్న సల్వార్‌ కుర్తా ఆమె వంటికి వదులుగా ఉన్నాయి. చదువుకున్న వ్యక్తిలా కనిపిప్తోంది.

 ఆమె నన్ను కలవాలని వాచ్‌మేన్‌ను అడుగు తోందనుకుంటాను. అతను ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో ఆమె రావడం నాకూ సమ్మతంగా లేదు. కాకపోతే ఆమెను ఎక్కడో చూశాను. పరిచయం ఉన్న వ్యక్తే. ఎక్కడ చూశాను గుర్తు రావడం లేదు. విజిటింగ్‌ కార్డు వాచ్‌మేన్‌ చేతిలో పెట్టి చేతులు జోడించి బతిమిలాడు తోంది. కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఏమో నాకు కనిపించడం లేదు. చాలా మంది కన్నీళ్లల్లో నిజం ఏ మాత్రం ఉండదు. నటన నిజం కన్నా నిజంగా అనిపిస్తుంటుంది.వాచ్‌మేన్‌కు ఆమె మాటలకు జాలి కలిగిందో, ఏమో ఆమె కార్డు చేత్తో పట్టుకుని నా దగ్గరకు వస్తోంటే లేచి ఇంట్లోకి వెళ్లి పోదామనిపించి లేవబోయే లోపల అతను నా దగ్గరకు వచ్చి భయ పడుతూనే తను తెచ్చిన కార్డు నా ముందుకు చూపారు. తీసుకున్నాను. అందులో జి.భారతి, ఎం.టెక్‌ అని ఉంది. చిరునామా ఉంది. ఉద్యోగ వివరాలు ఏమీ లేవు. ‘‘నేడు ఎవరినీ చూడదల్చు కోలేదని చెప్పు’’ అని కార్డు తిరిగి అతనికి ఇవ్వబోతూ తన పేరు కింద పెన్నుతో రాసింది. చూసి ఆగాను. డాటర్‌ ఆఫ్‌ జస్టిస్‌ జి.కృష్ణారావు అని ఉంది. కృష్ణారావు గారు నాకు గురువు. నన్ను పైకి తీసుకు వచ్చిన వ్యక్తి ఆయనే. హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌ కావలసిన సమయంలో చనిపోయాడు. భారతి నాకు బాగా తెలుసు. కుర్చీలోంచి లేచే ప్రయత్నం విరమించుకుని, ‘‘రమ్మను’’ అన్నాను.