సంధ్యావందనం ముగించి లేచేను. బనీను వేసుకొని బయటకు వరండాలోనికి వచ్చాను. ఎదురుగా బల్లమీద ఆ వేల్టి దినపత్రిక పడేసి ఉంది. పేపరు తీసుకుని వాలు కుర్చీలో కూలబడ్డాను. సమయం సుమారు ఎనిమిదిన్నర గంటలు అవతూంది. మెల్లగా పేజీలు తిరగవేస్తూ పేపరు చదవడానికి ఉపక్రమించాను.గడచిన ఎనిమిది సంవత్సరాలుగా దినచర్య ఇలాగే ప్రారంభమవుతూంది. పూజ ముగించి, ఓ గంటసేపు పేపరు చదవడం, తర్వాత నేను రాస్తున్న జ్యోతిష గ్రంథంలోని విషయాలమీద ప్రామాణికాల కోసంరకరకాల పుస్తకాలు తిరగేయటం, తరువాత మా ఆవిడతో కలసి భోజనం చేయడం, ఓ రెండు గంటల నిద్ర, సాయంకాలం ప్రయివేటు పిల్లలకి పాఠాలు చెప్పడం, ఈ విధంగానే రోజులు గడిచి పోతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం మా ఊరిఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పదవీ విరమణ చేసినప్పటినుంచీ అటూ ఇటూగా ఇదే చర్య. పెద్ద కూతుళ్ళిద్దరికీ సర్వీసులో ఉండగానే పెళ్లిల్లు చేసి అత్త వారింటికి పంపేసాను. కాస్త ఆలస్యంగా పుట్టిన ఆఖరు దానికి కూడా పెళ్లి చేసేస్తే ఉన్న కాస్తా బాధ్యతా తీరిపోతుంది. అందుకే అలసట, అలజడి లేకుండా రోజులు గడిచి పోతున్నాయి.అంతట్లోనే వీఽధిలో ఏదో అలజడి మొదలయింది. పేపరు పక్కన పడేసి, మెల్లగా లేచి బయటికి వచ్చాను.

 రోడ్డుమీద కోలాహలం అంతకంతకూ పెరుగుతోంది. ‘‘మీ విలువైన ఓటు ఫలానా పార్టీకే వేయండి’’ అంటూ లౌడ్‌ స్పీకరులో రణగొణధ్వనులు వినిపించేయి. ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి. ఈసారి అటు దేశానికి, ఇటు రాష్ర్టానికి ఒకేమాటు ఎన్నికలు జరుగుతున్నాయి. కోలాహలం మరీ దగ్గరయింది. వరుసగా మూడు టాపులేని జీపులు మెల్లగా కదులుతూ వచ్చి, మా ఇంటి ముందు ఆగాయి. జీపు ఇరుపక్కలా నడుస్తున్న కార్యకర్తలు వారి చేతుల్లో ప్లే బోర్డులు పక్కనే పెట్టి గేటు తలుపులు తెరుచుకొని బిలబిల లాడుతూ, మా ఇంట్లోకి వచ్చేరు. వారి వెనకగా తెల్లని మల్లెపూవుల్లాంటి బట్టల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులిద్దరూ రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ లోనికి వచ్చారు. వాళ్లిద్దరూ స్థానికులే! నాలుగు పదుల వయస్సులో ఉన్నవారే! మా స్కూల్లో నా దగ్గర పాఠాలు చదువుకున్న వాళ్లే! నా చేత మొట్టికాయలు తిన్నవారే! నా మీద గౌరవం వున్న వారే! అందులో ఒకని పేరు త్రినాథ రావు. ఇంకొకడు వేంకట్రావు. పాలక పార్టీ ఎం.పి. టికెట్టు ఈసారి పంచదార మిల్లు ఓన రు త్రినాథరావుకు దక్కింది. అసెంబ్లీ టికెట్టు గతంలో పార్టీలో పని చేస్తూ చనిపోయిన వాళ్లన్నయ్య మీద గౌరవం కొద్దీ బస్సుల ఓనరు వెంకట్రావుకి ఇచ్చేరు. ఒక ఊళ్లోనే ఉంటున్నా, వాళ్ల వాళ్ళ వ్యాపారాల వలన, హడావిడి వలన వాళ్ళు నా దగ్గరకి రావడం మాత్రం తక్కువ.