ఏటి ఒడ్డుకి కొట్టుకొచ్చిన మృతదేహం పైనే అక్కడ గుమిగూడిన జనం చూపులు కేంద్రీకృతమయి వున్నాయి. మృతురాలి బంధువుల రోదనలతో ఆ ప్రదేశం విషాద భరితంగా వుంది.ఇంతలో పోలీసు జీవు అక్కడకి వచ్చి ఆగింది. జీపు దిగిన ఇన్స్‌పెక్టర్‌ రవిచంద్రని చూడగానే ఒక నడివయసు వ్యక్తి ఆవేశంగా ముందుకొచ్చాడు.‘‘ఇన్స్‌పెక్టర్‌గారూ! నా కూతురిని నా అల్లుడే హత్య చేశాడు. వాడిని అరెస్ట్‌ చేయండి. వాడికి ఉరిశిక్ష పడేలా చెయ్యండి’’ అన్నాడు. ఆయన స్వరం ఆక్రందనలా వుంది.ఆయన్ని రాజగోపాలంగా గుర్తుపట్టాడు రవిచంద్ర. చనిపోయిన యువతి ఆయన కూతురా? అంటే లావణ్య... ఒక్కంగలో వెళ్లి మృతదేహాన్ని పరిశీలనగా చూశాడు. ఎస్‌! ఆమె లావణ్యే! ఓ గాడ్‌! అతని కళ్లు చెమర్చాయి. ఆరునెలల కిందట భర్త, అత్తమామలు తనని వరకట్నం కోసం వేధిస్తున్నారని కంప్లయింట్‌ ఇవ్వడానికి స్టేషన్‌కి వచ్చిన ఈ యువతి ఇపడు శవంగా మారి ఏటి ఒడ్డున పడి వుండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు.సరిగ్గా నెల రోజుల క్రితం రాజగోపాలం తన అల్లుడు వంశీలో పరివర్తన వచ్చిందని, అతనిపై పెట్టిన కేసుని విత్‌డ్రా చేసుకుంటున్నామని చెప్పాడు. ఆ కేసు అలా క్లోజయిపోయింది. వంశీ కూడా స్టేషన్‌కి వచ్చి ఇక ముందు భార్యని బాధ పెట్టనని, ఆమెని ప్రేమగా చూసుకుంటానని, తన వల్ల ఆమెకి ఎలాంటి కష్టనష్టాలు ఎదురవ్వవని హామీ ఇచ్చాడు. ఆ రకంగా లావణ్య కాపురం సెటిలయ్యింది. 

లావణ్య అత్తవారి ఇంట్లో వుందని, ప్రస్తుతానికి అల్లుడు వల్లగాని, ఆమె అత్తమామల వల్లగాని ఎలాంటి సమస్య లేదని రాజగోపాలం మళ్లీ స్టేషన్‌కి వచ్చి తనతో చెప్పాడు. పర్సనల్‌ ఇంట్రస్ట్‌తో ఆ కేసుని డీల్‌ చేసిన రవిచంద్రకి లావణ్య కాపురం కుదుటపడినందుకు తృప్తిగా అనిపించింది. కాని, నెల కాకముందే ఆమె అనుమానాస్పద పరిస్థితులలో మరణించడం బాధగా వుంది. తన కూతురి వయసున్న లావణ్య...ప్చ్‌...! తలవిదిలించాడతను. అయితే భర్త వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఆమె భర్తే ఆమెని హత్య చేశాడా? అన్న కోణంలో నుంచి కేసు దర్యాప్తు చేయవలసి వుంది. శవాన్ని పోస్టుమార్టంకి తరలించమని సబార్డినేట్స్‌కి చెప్పి వంశీ ఇంటికి పోనిమ్మని జీపు డ్రైవర్‌కి చెప్పాడు.్‌్‌్‌పోలీసులని చూడగానే వంశీ తల్లిదండ్రుల ముఖాలలో వ్యక్తమయిన భయాందోళనలు ఇన్స్‌పెక్టర్‌ రవిచంద్రలో కలిగిన అనుమానాన్ని బలపడేలా చేశాయి.‘‘వంశీ ఎక్కడ?’’ అతనికి తెలియకుండానే స్వరం కరుగ్గా ధ్వనించింది.‘‘ఆఫీసు పనిమీద చెన్నై వెళ్లాడు సార్‌!’’ భయంగా చెప్పాడు అతని తండ్రి.వంశీ తల్లి ఏడుపు స్వరంతో చెప్పింది. ‘‘ఇన్స్‌పెక్టర్‌ గారూ! నా కోడలు నిన్న సాయంకాలమనగా ఎక్కడికో వెళ్లింది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు.’’