భానోదయమయ్యాక మూడు గంటలు గడిచాయి.యూనివర్సిటికి దగ్గర్లోని ఓ ఎయిర్కండిషన్డ్ రెస్టారెంట్,డిజైనర్ దుస్తులతో, అల్ర్టా మోడ్రన్ గా అలంకరించుకున్న అమ్మాయిలతో, వాళ్ల కోసం ఎదురుతెన్నులు పడ్తున్న అబ్బాయిల అల్లరితో కళకళలాడుతోంది.సరిగ్గా ఆ సమయంలో అక్కడికొచ్చి ఆగింది ఓ ఆటో.బంగారంతో పోతపోసినట్టున్న గ్రీక్ శిల్ప సౌందర్యాన్ని, నీలిరంగు జీన్స్ ప్యాంటు, స్లీవ్ లెస్ టాప్ తో ప్యాక్ చేసినట్టున్న ఓ లావణ్యం ఆటోలోంచి దిగి, ఫేర్ చెల్లించి, వడివడిగా రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది. అప్పటివరకు కోలాహలంగా వున్న రెస్టారెంట్ క్షణం పాటు నిశ్శబ్దంగా మారింది.అందరూ, ఓ క్షణం పాటు ఆ సౌందర్యాన్ని కళ్లతో పలకరించి, తమకలవాటైన చిరునవ్వును స్వీకరించి, మళ్ళీ తమ లోకంలోకి జారిపోయారు.ఆ సౌందర్యం పేరు మధుమతి!వైరాలజీ సబ్జ్‌క్టులో డాక్టరేట్ కోసం రీసెర్చ్ చేస్తున్న స్కాలర్.తమ కలవాటైన కార్నర్‌లో, అల్పాహారం చేస్తూ, తన కోసం ఎదురుచూస్తున్న నేస్తం స్నేహలత కనిపించడంతో ఆ టేబుల్ దగ్గరకు నడిచింది. అప్పటికే, అల్పాహారం తినడం పూర్తవడంతో మధుమితను పలకరించి తనకు అత్యవసరమైన పనుందని, పావుగంటలో తిరిగొస్తానని, అప్పటిదాకా రెస్టారెంట్లో తన కోసం వేచివుండమని చెప్పి, హడావుడిగా బయటకెళ్ళి పోయింది స్నేహలత.మధుమిత బేరర్‌కి ఆర్డర్ చెప్పి, ఆ టేబుల్ దగ్గరే కూర్చుని, హడావుడిలో తన నేస్తం మరచిపోయిన పుస్తకాన్ని గమనించి దాన్ని, తిరగేస్తూండగానే టిఫిన్ రావడంతో, పుస్తకాన్ని తిరగేస్తూ మెల్లగా తినడం ప్రారంభించింది.
సరిగ్గా అపడు జరిగిందా సంఘటన!!దబ్ మన్న పెద్ద శబ్దంతో మనిషికూలిన చపడుకి రెస్టారెంట్లో వున్న వాళ్ళందరూ తలలు తిప్పి అటుకేసి చూసారు. మరుక్షణం వాళ్ళందరూ కట్రాటల్లా బిగుసుకుపోయారు. కారణం అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ నిశ్చేష్టులయ్యారు.మధుమిత టేబుల్ పై ఒరిగిపోయివుంది!క్షణం తర్వాత, అందరూ ఆదుర్దాగా ఆ టేబుల్ చుట్టూ గుమిగూడారు. ఆ గుంపులోంచి తేరుకున్న ఓ వ్యక్తి ‘‘ప్లీజ్! అందరూ పక్కకు జరగండి. నేను డాక్టర్ని నన్ను చూడనివ్వండి’’, అంటూ అందర్నీప్రక్కకు జరిపి, మధుమితను పరిశీలించి, ‘‘ఓహ్! గాడ్...షీ ఈజ్ డెడ్’’ అన్నాడు.మరుక్షణం చేష్టలుడిగి పోయిన జనం కట్రాటల్లా బిగుసుకుపోయారు.అందరి ముఖాల్లోనూ భీతి ఒక్కసారిగా తన్నుకొచ్చింది.అందరికన్నా ముందుగా తేరుకున్న రెస్టారెంట్ యజమాని ఈ తలనొప్పిని ఎలాగోలా వదిలించుకోవాలని పనివాళ్ళను కేకలేసి, ‘‘అంబులెన్స్ ని పిలవండి...త్వరగా...’’ అన్నాడు.‘‘పిలవాల్సింది అంబులెన్స్‌ని కాదు.పోలీసుల్ని’’ జనంలోంచి ఎవరో అరిచారు.మరుక్షణం రెస్టారెంట్ యజమాని ముఖం తెల్లగా పాలిపోయింది. గజగజా వణికిపోతూ అన్నాడు ‘‘పోలీసులెందుకు? ఈ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళితే బ్రతుకుతుందేమో?’’‘‘అంటే, శవానికి ప్రాణంపోసే హాస్పిటల్ హైదరాబాదులో వుందా?’’అతని ముఖంలోని భయాన్ని పసికట్టిన కొందరు, కావాలనే అన్నారు.