సెల్‌ అదేపనిగా రింగవుతోంది. ఆరోజు గురువారం కావడంతో గురు చరిత్ర పారాయణం చేసి బాబాకు హారతిస్తున్నాను. ఒక ప్రక్క ఇంకా వంట పని పూర్తి కాలేదు. అవతల ఆఫీసుకు తొందరగా తగలడాలి. నా చిరాకులో నేనుంటే దాని మానాన అది మ్రోగుతూనే వుంది. పూజ అయ్యిందన్పించి, చెంగుతో చేతులు తుడుచుకుంటూ హాల్లో కొచ్చాను. సెల్‌ అందుకున్నాను. ఎవరిదో నెంబరు. మధు అయితే కాదు. అతడొక్కడే అన్నిసార్లు చేసి లిఫ్ట్‌ చేసేదాకా ప్రాణాలు తీసేది. ‘ఎవరబ్బా’ అనుకుంటూ సెల్‌ ఆన్‌ చేసాను.‘హల్లో’ అన్నాను.‘హల్లో! వైష్ణూ?’ అవతల ఎవరిదో స్ర్తీ కంఠం.‘‘అవునూ. మీరెవరు?’’‘‘నేనే... నేనేనే... బాగున్నావా?’’ అవతల స్వరం చాలా ఉద్వేగంగా ఉంది.‘‘చా...లా బాగున్నాను. మీరు?’’ అన్నాను అర్థం కాక.‘‘నేనే వెర్రి మొహమా! గుర్తు పట్టలేదూ?’’ ఫోన్లోనే నేను వెర్రిమొహాన్ని అని గుర్తించారంటే వాళ్లెవరో నా సంగతి బాగా తెల్సిన వాళ్లయి ఉంటారు.‘‘అవును వెర్రిమొహాన్నే. తమ తెలివైన మొహం నామధేయం ఏమిటి?’’ అన్నాను చిరాగ్గా.‘‘నేనే. వేదాని’’ ఆ స్వరంలో ఆనందం కొట్టొచ్చినట్టుగా ఉంది.‘‘అమ్మా.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు... ఎక్కడున్నావ్‌? ఎలా ఉన్నావ్‌? బాగున్నావా?’’ నాలో ఆశ్చర్యం ఆనందం ఒక్కసారి పొంగాయి. గత జన్మస్మృతులేవో పలకరిస్తున్నట్లుగా ఉంది. తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడు చాన్నాళ్ళకు దొరికినట్లుగా ఉంది. నన్నెంతో అభిమానించే, నన్ను ప్రాణంగా చూసుకునే వేదానే మర్చిపోయానా? గుర్తుపట్ట లేక పోయానా?‘‘అంతా బాగున్నామే. 

మేం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. రెండేళ్ళయింది పూనా నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చి. ఓ గంట క్రితం మీ బాబాయి బస్‌స్టాప్‌లో కన్పించి నీ విషయాలన్నీ చెప్పి నీ సెల్‌ నెంబరిచ్చాడు’’. ‘‘అవునా! చాలా ఆనందంగా ఉందే. మనం కల్సుకొని ఓ ఇరవై ఏళ్ళయిందా?’’ అన్నాను.‘‘ఇంకా పైనే అయ్యిందేమో. నిన్ను అర్జంటుగా చూడాలనుందే. చిన్నప్పటి కబుర్లన్నీ చెప్పుకోవాలి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు తప్పితే నాకు ఆత్మీయులెవరున్నారు చెప్పు’’.అదే అభిమానం, అదే ఆప్యాయత. దశాబ్దాలు గడిచిన చెదిరిపోని, చెరిగిపోని, కరిగిపోని బంధం.‘‘తప్పకుండా కలుద్దాం. విజయవాడకు హైద్రాబాద్‌కు ఎంత దూరమే’’ అన్నాను. నాకూ తనని కలవాలనే ఉంది. అన్ని విషయాలు అందర్కి చెప్పుకోలేం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, మన కోసం ఏదైనా సరే చేసే వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు. నిజాన్కి మధు నా జీవితంలో ప్రవేశించాక వేదాని దాదాపుగా మర్చేపోయాను.‘‘సారీ వైష్ణూ! నిన్ను నీ మ్యారేజ్‌ తర్వాత చూడలేదు. మా పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో అవడం, మా వారితో ఢిల్లీ వెళ్ళిపోడంతో ఎవరితో సంబంధాలు లేకుండా పోయాయి. నీ పెళ్ళైన ఐదేళ్ళకే ఇద్దరిపిల్లల్ని, నిన్ను వదిలేసి ఆనంద్‌ అనంత లోకాలకి వెళ్ళిపోయాడని మీ బాబాయి చెప్పాడు. ఆ విషయం తెల్సాక ఎంత ఏడ్చానో తెల్సా. నిజంగా నువ్వు నమ్ముకున్న భద్రాద్రి రాముడు నీకు అన్యాయం చేసాడు కదటే’’ అంది. దాన్ని స్వరాన్ని బట్టి నా పరిస్థితిని ఊహించుకొని చాలా బాధ పడ్తోందని తెలుస్తూనే ఉంది. అది మొదట్నుంచి అంతే. నాకే చిన్నకష్టం వచ్చినా తట్టుకోలేక పోయేది.