సాయంత్రం ఆరు. రోజూలాగే శ్రీవారు, నేను వాకింగులో ఉన్నాం. రోజూలాగే దేశ కాల సాంఘిక రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తూ నిట్టూరుస్తున్నాం. రోజూలాగే ప్రభాకర్‌ బండి దగ్గర ఆగి మసాలా మిక్చర్‌ ఆర్డర్‌ చేసేక, ‘‘ఏంటీ నాలుగు రోజులుగా బండి పెట్టడం లేదు?’’ అన్నారు శ్రీవారు.ప్రభాకర్‌కి కీళ్ళ నొప్పుల్లాంటి వొచ్చి డాక్టర్‌ దగ్గిర కెడితే ఆయన మూడ్రోజుల పాటు ఇంజక్షన్లు చేసి - ఆర్రోజులు విశాంత్రి తీసుకోమన్నాట్ట. ఆయనకివ్వాల్సిన ఆరొందలూ వెంటనే ఇవ్వాలంటే విశ్రాంతి కుదరదనిఈ రోజే బండి పెట్టేసాడు.నేను వెంటనే ‘‘ఆరోగ్యశ్రీ ఉందిగా - ఆరొందలెందుకూ?’’ అంటే ప్రభాకర్‌ కూడా అంత వెంటనే నవ్వేసాడు. కట్నమడిగిన వరుడి తండ్రి, లంచమడిగిన ప్రభుత్వోద్యోగి, ట్రాఫిక్‌లో వెహికల్‌ డ్రైవరు - చట్టం గుర్తు చేసిన వారిఅమాయకత్వానికి అలాగే నవ్వుతారేమోననిపించింది.వాకింగు రిటర్నులో ఆ విషయమే చెబితే, ‘‘ఇతరుల దాకా ఎందుకూ... మనం చేసే వాకింగుకీ - తినే మసాలా మిక్చర్‌కీ పొసుగుతుందంటావా?’’ అన్నారు ఫిట్‌నెస్‌ కాన్షస్‌ ఉన్న శ్రీవారు.‘‘రాళ్ళు తిని హరాయించుకునే వయసులో - మసాలా మిక్చర్‌ మన్నేం చేస్తుంది? అందులోనూ ప్రభాకర్‌ చేతిలో అమృతముంది కూడా. నో రిగ్రెట్స్‌ - ఎంజాయ్‌’’ అని మందలించాను.‘‘ఇలా అమృతానికి ఆశపడితే ఆరోగ్యానికి గ్రహణం తప్పదు’’.

‘‘రైతులకి ఉచిత విద్యుత్తు, ఆత్మహత్యలు ఆపలేదు. భాగ్యనగరంలో వరదలు, నీటికొరత తగ్గ లేదు. గూఢచర్యకి ఉపగ్రహాలు, తీవ్రవాదుల్ని అరికట్ట లేవు. తినడానికి జంక్‌ఫుడ్స్‌, మన ఆరోగ్యాలకి ఢోకాలేదు’’ శ్రీవారు నవ్వి, ‘‘అంతులేని సామాజిక స్పృహ, కథలకే పరిమితం. అసలు సిసలు ప్రజాస్వామ్యం, వ్యక్తిపూజకి ఢోకాలేదు’’ అన్నారు. అది కేవలం జాబితాని పెంచడానికనలేదు. నా మీద విసురు. నేను కథల్రాస్తాననీ, పద్మక్కని ఆరాధిస్తాననీ ఆయనకి ఎగతాళి.్‌్‌్‌నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. నాన్న ఇంటికి పెద్దకొడుకు. ఆయనకి ఆరుగురు తమ్ముళ్ళు, అయిదుగురు చెల్లెళ్ళు. ఆఖరి చెల్లెలు పద్మ నాకంటె అయిదేళ్ళే పెద్ద కావడం వల్లనేమో... తనని అత్త అనకుండా అక్క అనమనేది. అదే అలవాటైంది నాకు.నాకు మూడేళ్ళప్పుడు తాతగారు పోయారు. అప్పుడు నానమ్మ - ఇంటిబాద్యత మా అమ్మ కప్పగించి తను దైవచింతనలో మునిగిపోయి - నిత్యం పూజలు, వ్రతాలు, దానాలు, గీతా పఠనాలతో కాలం గడిపేది. ఆఖరి పిల్ల కావడంతో పద్మక్క నానమ్మతోనే ఉండేది. వయసుకు తగ్గట్లు స్నేహితులతో ఆడుకోమని నాన్న మందలిస్తే, ‘‘నానమ్మతో ఉంటే నష్టమేమిటి? క్లాసులో టాప్‌ ఫైవ్‌లో ఉంటున్నాగా?’’ అనేది.అప్పట్లో నాకు పద్మక్కంటే ఆరాధన. దానికి తోడు ఆమె రీజనింగ్‌ కూడా నచ్చి, ‘‘ఔను కదా, నాన్నా!’’ అంటే ఆయన, ‘‘ఆ పిల్లికీ ఎలక సాక్ష్యం’’ అంటూ కోపం, ముచ్చట కలిసిన ముఖం పెట్టే వారు.