‘పాడువాన కురుస్తూనే వుంది పొద్దుటనుంచీ’.వాన పాడుగా వుందా?లేదు.ఎర్రగా కాసినా ఎండ ఎయిర్‌ కండిషన్డు రూమ్‌లోంచి చూస్తే మనోహరంగానే వుంటుంది.భోరున కురుస్తున్న వాన, వెచ్చగా పూలు స్వెట్టర్‌ వేసుకుని, చక్కగా గదిలో కూచుని, హాయైన పుస్తకం హాయిహాయిగా చదువుకుంటూ, ఒక్కో గుక్కా కాఫీ తాగుతుంటె మధురంగానే వుంటుంది.డ్రిల్లు చేస్తున్న సర్కస్‌ ఏనుగుల్లా, మబ్బులన్నీ గుంపులు గుంపులుగా గుమిగూడి, రింగ్‌మాస్టర్‌ కమ్చీ విసురుల్లో మెరుపులు మెరుస్తుంటే, ఒకే శృతిలో మ్రోగుతున్న వాయిద్యంలా, ఒకే గతిలో సాగుతున్న పద్యాల్లో, వాన సుందరంగానే కురుస్తూంది.అయినా కావమ్మకది పాడు వానగానే వుంది.దిక్కుమాలినదాని ఏడుపులా, వాన చప్పుడు వినిపిస్తూ మరింత చికాగ్గా వుంది.‘వెధవ వాన!’ అని విసుక్కుంది.‘వెధవ జీవితం’ అని సణుక్కుంది.‘ఏమే, యింకనైనా తిండికి లేస్తావా?’ అని వానలోకి చూస్తూ అరుగుమీద కూచున్న కూతురు వనజని కసురుకుంది.వానలోకి చూస్తూనే ‘ఆకల్లేదే’ అంది వనజ.ఆ గొంతులోని దైన్యానికి కావమ్మ విస్తుపోయి వూరుకుంది.‘ఏమ’ని అడగబోయిన తండ్రి గొంతును దగ్గుతెర అడ్డుకుంది.‘‘నీకిష్టమని కాకరకాయ వేపుడు చేసిందే. లేచి రెండు ముద్దలు తిను’’ అంది సరస్వతి.‘వద్దే అక్కా, ఆకలేస్తే నే తిన్నా?’ అంది వనజ - సరస్వతి వేపు మొహం తిప్పి, ఒక్కోమాట ప్రయత్నం మీద పలుకుతూ.సరస్వతి నిట్టూర్చి వూరుకుంది. ‘అమ్మా! జడ వెయ్యవూఁ’ అంటూ వచ్చిన కూతురుని ‘పన్ని తీసుకురా!’ అని పురమాయించింది.వనజ మళ్ళీ వానలోకి చూపు సారించింది.నీలి ఆకాశంలో రోడ్‌ రోలర్‌లా కదిలే సల్లని మబ్బులు కనబడకుండా ఎదురింటి పచ్చని మేడ అడ్డుకుంటున్నది.

చాచి లెంపకాయ కొడుతున్నట్టు, వాలుగా, బలంగా భూమిని తాకుతున్న వర్షపు ధారలని చూస్తూ కూర్చుంది వనజ.ఆ చినుకులన్నీ చేతులై, నేలే తన ముఖమై ఎవరో తన్నే కొడుతున్నట్టుంది వనజకి.అలుక్కుపోయిన చూపులకి ఏవీ కనబడడం మానేసింది. కళ్ళు మూసి తెరిచింది మళ్ళీ.కాలువలోని నీళ్ళు వడివడిగా పారుతున్నాయి. నల్లగా, బొద్దుగా పెరిగి, పరుగులు తీస్తున్న పాముల్లా మెరుస్తూ.మంచం అంచు నుంచీ నేలకు తగుల్తూ, వ్రేలాడే దువ్వని కురుల్లా రోడ్డు మీద నీరు కాలువలోకి జారుతోంది.కూర్చునే కుచ్చిళ్ళు సర్దుకుంది వనజ. తలతిప్పి గదిలోకి చూపు సారించింది.అమ్మ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు గొణుక్కొంటోంది.తండ్రి పాతకాలపు పడక కుర్చీలో కాళ్ళు ముడుచుకు కూర్చుని, ప్రక్క వాళ్ళ నడిగి తెచ్చిన నిన్నటి పేపరు చదువుకుంటున్నాడు.అక్క వరానికి జడేస్తూంది.తమ్ముళ్ళిద్దరూ తగువులాడుకుంటున్నారు.‘‘పిన్నీ పడవ చెయ్యవా?’’ అంటూ బాబిగాడు చిత్తుకాగితాన్ని పట్టుకొచ్చాడు.మాటాడక, ముఖాన్ని వీధి వేపు తిప్పేసుకుంది మళ్ళీ.వాన..వాన..వాన.ఏ పసిడి నేలనో పండించాల్సిన ఏ చెరువు కడుపునో నిండించాల్సిన వాను.తొలకరియై కురిసి, ఏ ఆల్చిప్పలోనో ముత్యాల గ్రుడ్లు పెట్టాల్సిన వాన.