సదువుకునే దినాలల్ల పంద్రాగస్టు గూడ మాకు పండగే. గా దినం యాల్ల పొద్దుగాల్లే లేసి తానం జేసెటోల్లం. ఇస్త్రి బట్టలు గట్టుకోని బడికి బోయెటోల్ల. సాగర్‌గాడు, దుగ్యానోల్ల ప్రేంగాడు బ్యాండు గొట్టుకుంట ముంగట నడ్వంగ ఎన్కపంటి భారత్‌ మాతాకీ జై, జై బోలో స్వతంత్ర భారత్‌కీ అనుకుంట మేము నడ్సెటోల్లం. మా వాడకట్టు మీదికెల్లి తోల్లోల్ల ఇంటి కాడికెల్లి హైద్రాబాద్‌ చౌరస్త మీదుంగ మా బడికి జులూస్‌ దీసెటోల్లం. ప్రబాత్‌ భేరి అయినంక మేము సోల్పుత నిలబడెటోల్లం. మా పెద్ద సారు జెండ ఎక్కిచ్చెటోడు. జెండ ఎక్కిచ్చినంక జనగనమన పాడెటోల్లం. జెండ వందనం అయినంక మాకు తలా ఒక చాకిలేటు ఇచ్చెటోల్లు.ఇంటికి బోయి గింత దిన్నంక మల్ల పదిగొట్టంగ బడికి బోయెటోల్లం. బల్లె ఆటల పోటీలు అయ్యేటియి. ఇద్దరు దగ్గర నిలబడితె ఒకని కుడి కాలును ఇంకొకని ఎడ్మకాలు తోని బిర్రుగ గట్టెటోల్లు. గాల్లిద్దరు బుజాల మీద చేతులు ఏస్కోని నిలబడెటోల్లు. సీటి ఊదంగనే మూడు కాల్లతోని ఉర్కెటోల్లు.

ఎవ్వలు ముందుగాల్ల బేతకాడ్కి బోతె గాల్లు గెల్సినట్లు లెక్క. గోనె బస్తల కాల్లుబెట్టి చేతులతోని బస్త బట్టుకోని ఉర్కెటోల్లు. చెంచ మీద నిమ్మకాయ బెట్టుకోని గది కింద బడకుండ ఉర్కుట్ల పోటీలుండేటియి. ఉర్కుట్ల గూడ పోటీలు ఉండేటియి. పెద్దబడిల ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, హాకీ, కబడ్డీ, బాడ్మింటెన్‌, చెస్‌ ఆటల పోటీలు అయ్యేటియి. ఆటలల్ల గెల్సినోల్లకు ప్రేజులు ఇచ్చెటోల్లు. పంద్రాగస్టు దినాన రాత్రిపూట బల్లె డ్రామాలు ఏసెటోల్లు. డ్రామలను జూసెతందుకు పెద్దోల్లు గూడ వొచ్చెటోల్లు.పెద్ద బడి ముంగట పెద్ద మైదానం ఉన్నది. పంద్రాగస్టు దినాన గా మైదానంల పొద్దుగాల్ల కెల్లి పొద్దుమీదె దాంక ఆటల పోటీలు అయితుండేయి. ఒక దిక్కు వాలీబాల్‌ పోటీలు అయితుంటె ఇంకోదిక్కు కబడ్డి పోటీలు అయితుండేయి. పెద్దబడిల ఆటలు జూసెతందుకు పోరగాల్లమంత బోయెటోల్లం. పదో తరగతి ఎ, బి సెక్షన్ల నడ్మ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అయ్యేది. మేము కబడ్డీ పోటీలు సూసెటోల్లం. సీటి గొట్టుకుంట కాలు బట్టు, ఔట్‌ జెయ్యి అనుకుంట ఒల్లెటోల్లం.