పండ్గలల్ల మాకు హోలి, దివిలె అంటె శాన ఇష్టం. హోలి దినాన రంగులతోని ఆడ్తె దివిలె పండ్గ దినాన పటాకులు గాల్చెటోల్లం. గా దినం పొద్దుగాల్ల నాలుగ్గొట్టంగనేమా అమ్మ నిద్రలేసేది. కట్టెల పొయ్యి ముట్టిచ్చి నీల్లు కాగబెట్టేది. నీల్లు ఉడుకైనంక నన్ను నిద్రలేపేది. సలిబెడుతుంటే చద్దరు గపకోని పండుకున్న నాకు మెల్కొచ్చినా లెవ్వబుద్ధి అయ్యేది గాదు.‘‘ముందుగాల్ల అన్నను లేపు. గాడు తానం జేసినంక నేను జేస్త’’ అనేటోన్ని.అందరి తానాలు అయినంక మెల్లగ లేసెటోన్ని. మా అమ్మ నాకు బుడ్డగోసి బెట్టి పెయ్యంత నూనె రాసి నలుగుబెట్టేది. అటెంకల పీట మీద గూసుండబెట్టి కుంకుడు కాయ పుల్సుతోని నెత్తికి బోసేది. కండ్లుగిన దెరిస్తే కుంకుడు పుల్సు బడి కండ్లు మండేటియి. తానం అయినంక మాకు మా అమ్మ, అక్క మంగలార్తి ఇచ్చేటోల్లు. కోవపేడలు బెట్టేటోల్లు. పొద్దుగాల్ల జెరన్ని పటాకులు గాల్సెటోల్లం.దివిలె పండ్గ దినాన మా ఇంట్ల పాసెం, పులిహోర, బచ్చాలు, ముర్కులు జేసెటోల్లు. మా నాయిన మిఠాయి దుక్నం కెల్లి పేనీలు గొన్కొచ్చెటోడు. గవ్విటిని ఉడుకు పాలల్ల యేసి, శక్కరి యేస్కోని తినేటోల్లం. గవ్వి శాన బాగుండేటియి. రాత్రి ఎపడైతదా అని మేము ఒక్కతీర్గ ఎదురు సూసెటోల్లం. నడ్మనడ్మ పటాకుల కాడ్కిబోయి ఒచ్చెటోల్లం. పటాకుల దుక్నాల కాడ మస్తుమంది జెనం ఉండెటోల్లు.

దివిలె దినాన పటాకుల ధరలు బెర్గేటియి. ధరలు బెర్గినా అందరు గవ్విటిని గొనెటోల్లు.దివిలె నాడు పండ్గంత రాత్రి పూటనే. రాత్రి పూట ఊరంత దీపాలతోని చమ్కాయించేది. అమాస రాత్రి దినమయ్యేది. ఇండ్ల ముంగట సోల్పుత దీపంతెలు బెట్టెటోల్లు. అయ్యగారు వొచ్చినంక లచ్చిమి పూజలు జేసెటోల్లు. మా అన్న లచ్చిమి బాంబులు, చిల్కబాంబులు గాలుస్తుంటె అందరం దూరం ఉండెటోల్లం. గవ్వి ధన్‌ధన్‌ మనేటియి. సీసల రాకిట్‌ బెట్టి ముట్టిస్తే రయ్యిమని మొగులు మీదికి బోయేది. కొన్ని రాకిట్లు మొగులు మీద్కి బోయినంక ధన్‌మనేటియి. ఒక్కోపారి రాకిట్లు ఇండ్లల్లకు జొర్రేటియి. భూచెక్రం బూమీమ్మద దిర్గుతె విష్ణు చెక్రం చేత్ల దిర్గేది. సుర్‌సుర్‌ బత్తీలు, ఫుల్‌చడీల కెల్లి ఎల్గు రవ్వలు ఎల్లేటియి. శేరు పట్టాకులు ఒకటెన్క ఒకటి శానసేపటి దాంక ధన్‌మనేటియి. పాము బిల్లలను ముట్టిస్తే బుస్సుమని పాములు వొచ్చేటియి. అగ్గిపెట్టె లేకుంటె దీపంతెల తోని పటాకులు గాల్చెటోల్లం.