ఈ అయిదేళ్ల పరిచయంలో...‘దివ్యాని’ని అలా అంత ‘డల్‌’గా చూడడం ఇదే మొదటిసారి.నేనా ఆఫీసులో చేరిన మొదటిరోజు నుంచే ‘అది’నాకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిపోయిందన్న విషయాన్ని... ‘ఆఫీస్‌ స్టాఫ్‌’ ఎవరూ నమ్మకపోగా- ‘ఆ... తియ్యండి చాలు... ఈ మూణ్ణాళ్ల ముచ్చట ఎన్నాళ్లో చూస్తాంగా?’ అంటూ కొట్టి పారేశారు.వాళ్ల కామెంట్స్‌కు మూలకారణం దివ్యాని ప్రదర్శించే దర్పమే అయ్యుంటుదని అనుకున్నాను. ఆఫీస్‌ జనాల అంచనాలను తారుమారు చేస్తూ... ఈ అయిదేళ్ల కాలంలో అత్యంత ‘క్లోజ్‌’ ఫ్రెండ్స్‌ అయిపోయామే తప్ప చిన్నపాటి ఆర్గ్యుమెంట్‌కుకూడా తావియ్యలేదు.స్టయిలిష్‌గా వుండడం, ఎవర్నీ లెక్కచేయకపోవడం ఒక్కోసారి తన స్టేటస్‌ను ఎగ్జిబిట్‌ చేయడం...తన పర్సనల్‌ విషయాలుగా భావించానే తప్ప...మరేమీ ఆలోచించలేదు.‘దివ్యాని’ డ్రైవింగ్‌ నేర్చుకొని...అపడపడూ తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వస్తుంటే... ఆఫీస్‌ స్టాఫ్‌ అంతా ‘నియోరిచ్‌’ మహిమంటూ చెవులు కొరుక్కుంటుంటే వింటూ.. చిరునవ్వుతో తలూపానే తప్ప పట్టించుకోలేదు.అందంగా...హుందాగా వుండే తనలోని ఓ చిన్న బలహీనతే అపడపడు నా హార్ట్‌ను టచ్‌ చేసేది.దివ్యానికి బెగ్గర్సన్నా...క్రిపిల్డ్‌ పర్సన్స్‌ అన్నా అసహ్యం, చిన్నచూపు. ఆఫీస్‌ బాయ్‌ రామునైతే ఏనాడు పేరుపెట్టి పిల్చిన దాఖలాలు లేవు. ఎపడూ ఏరా! ‘టింకూ’ అనే పిల్చేది.తొలిరోజుల్లో తనేదో సరదాగా అంటోందేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది. ‘కుంటి’ అనే పదాన్ని తిరగేసి పిలుస్తోందని.

అయినా తనిష్టం తనదని సరిపెట్టుకున్నాను. పోలియో మూలంగా కుంటుకుంటూ నడిచే రాముని చూసినపడల్లా బాధపడేదాన్ని. దివ్యానినెపడూ ఆ విషయం గురించి అడగలేదు.అలాంటి దివ్యానిని ఇటువంటి పొజిషన్లో చూడడం ‘సంథింగ్‌ రాంగ్‌’ అనుకుంటూ తన సీటు దగ్గరకెళ్లి...భుజం మీద చెయ్యేసాను. నా స్పర్శకు ఉలిక్కిపడిందే తప్ప తలెత్తి చూడలేదు.తన ముందు కూర్చుంటూ ‘‘ఏమైంది దివ్యా? ఏమైనా యాక్సిడెంట్‌ అయ్యిందా? డాలీతో ఏమైనా ప్రాబ్లమా?’’ అని అడుగుతుంటే దాని మూడేళ్ల కూతురు డాలీ కళ్ల ముందు ఫ్లాషయ్యింది.‘డాలీ ఎంత క్యూటో...అంత నాటీ’తనకు నచ్చిన వస్తువేదైనా వెంటనే ఇచ్చేయాలి. లేదా టపీమని కూర్చుండిపోయి ‘ఐ వాంట్‌ దట్‌ మమ్మీ’ అంటూ రాగయుక్తంగా పీకి పాకానపెట్టేస్తుంది.