కొందరు తండ్రులు వాళ్ల పిల్లలకు కొన్ని పేర్లెందుకు పెట్టారో కారణాలు ఎంత వెతికినా దొరకవు. వెతికి లాభమేముందిలే అనుకుని తన ఇష్టమొచ్చిన పేరు మార్చుకోడానికి మించింది లేదని చిన్నపడే నిర్ణయానికొచ్చాడు అండపిండ బ్రహ్మాండ లింగం.ఇంటి పేరు చూద్దామంటే ఏడంగుళాలవారు. ఇంటి పేర్లు ఎలా ఉడికాయో చెప్పడం మానవాతీతమైన పని అనుకున్నాడు.‘‘నాన్నా పేరు మార్చుకుంటాను. పూర్తి పేరుతో పిలవడానికి స్కూల్లో టీచర్‌ చికాకు పడుతోంది. ఒకసారి అండం అంటోంది. ఇంకోసారి నోటికొచ్చిన ముక్కతో కేకేస్తున్నది. ప్రతీసారీ నవ్వుల పాలవుతున్నాను’’ కంటికి నీళ్లు లేకుండా ఏడుస్తూ చెప్పాడు.కొడుకు మనసులో నొప్పిని తెలుసుకున్న తండ్రి కొన ఊపిరి వదులుతూ అనుమతిచ్చాడు ఓ నిబంధనతో.‘‘ఏ పేరన్నా పెట్టుకో నాయినా లింగం మాత్రం వదిలిపెట్టకు. అది మన తాత ముత్తాతల నుంచి వస్తోంది. లింగాభిషేకాలు చేసి చేసి ఏడు బావుల నీళ్లెండిపోయాయి. రెండు బండలు పడ్డాయి. 

నా తరం వచ్చేసరికి బోరింగేయిస్తే కన్ను లొట్టబోయింది’’ అని చెప్పి చచ్చాడు.్‌్‌్‌ముందు ‘అనంత్‌’ అనుకున్నాడు. తండ్రికిచ్చిన మాటతో తన పేరులో లింగం ముందుండాలా వెనకుండాలా అని నిద్రలేకుండా ఆలోచించి-అనంత లింగంగా సెటిల్‌ అయ్యాడు.తను ఆస్తికుడన్న సంగతి తనకే తెలియని పరమ నాస్తికుడు అనంతలింగం. తన తల్లి తన బోసి నవ్వులతో ఆడుకుంటూనే కన్ను మూసేసిందట అనే గుర్తుంది. అన్నీ అమ్మమ్మగా చిన్నతనం గడిచింది. నాన్నకు కోపం వచ్చినపడల్లా అమ్మమ్మ దగ్గర దాక్కునేవాడు. అమ్మమ్మ దగ్గరుంటే గోవర్థనగిరి కింద గోపాలుడి పక్కన వున్నట్లుండేది.్‌్‌్‌మనవడు పూజలెలాగూ చేసేట్లులేడని ఇంట్లో నిత్య పూజారిని పెట్టింది అమ్మమ్మ. అనంతలింగం ఒకసారి శివలింగం మీద వేరుశనక్కాయలు కొట్టుకొని తింటుంటే గట్టిగా మొట్టికాయ పెట్టింది. ఆ రాత్రి తను నిద్రలో వున్నపడు ‘‘నీ నెత్తిమీద నాస్తికం ఎవరు రుద్దారురా’’ అని తల నిమిరి బాధపడింది అమ్మమ్మ.అమావాస్య, దుర్ముహూర్తం, రాహుకాలం విషగడియలేం లేవు అనంత లింగానికి. ఆ సమయాల్లోనే వద్దన్నవి చేసేవాడు. ఏటా ఓ పాఠం అన్నట్లుగా పదోతరగతే ఓ వృత్తి విద్యలా పూర్తి చేశాడు. మనవడికి చదువబ్బట్లేదు దానికి కారణం వాడి నాస్తిక పోకళ్లే అని ఎవరన్నా అంటే అవునని తలవూపేది. అంత కంటే ఎక్కువేమన్నా అంటే ఇంకో మాటనకుండా అంటుకునేది. వాళ్లు రాళ్లు నములుతూ వచ్చినట్లే వెళ్లేవాళ్లు.ఇక అనంతలింగం ఆనందించే వ్యాపకం స్నేహితులే! స్నేహితులకే తనతో ఆనందం అని తర్వాత తెలుసుకున్నాడు. అనంతలింగానికి ఆకాశమంత అహంభావం. ఏమాటకామాట అందులో చెడులేదు. తను ఏదనుకుంటే అది చేయగలను, ఏదవ్వాలనుకుంటే అదవ్వగలను అని మాత్రమే. ఆ అహంభావంలో పుట్టింది ఓ ఊతపదం. అనంతలింగం లేచాడంటే- అని సినిమా స్టైల్లో వదిలేవాడు వేడి వేడి సందర్భాల్లో. అనంతలింగాన్ని లేపకురో అని బతిమిలాడేవాళ్లు స్నేహితులు!