అర్థరాత్రి.....!!పెరట్లో దబ్బుమన్న చపడయింది...మరి కొద్ది సేపట్లో తలుపులు విరగ్గొడుతున్న శబ్దం...ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు శివతాండవ రావు.... ఆ వెంటనే చటుక్కున లేచి కూర్చుంది నాగవల్లి....‘‘నాగూ! ఏమిటా చపళ్ళు కొంపదీసి దొంగలు కాదుకాదా?....’’ తన బెంగంతా బయట పెట్టాడు.‘‘అబ్బ మీకన్నీ అనుమానాలే.... ఎలక కోసం పరిగెడుతూ పిల్లి చేసిన హడావుడే అదంతా....వూరకే సణక్క పడుకోండి...’’ అని దపట్లో దూరి పోయింది నాగవల్లి.కాని....మళ్ళా దడదడలాడుతూ శబ్దాలు... ఈసారి నాగవల్లికే ఒళ్ళంతా గగుర్పాటు మొదలైంది....దుప్పటి తీసేసి లేచి కూర్చుంది.మొగుడు పెళ్ళాలిద్దరూ కళ్లు, పత్తి కాయల్లా చేస్కుని భయంగా చూస్తుంటే....మరోసారి ‘ఛడ్‌’మన్న చపడయింది. మరో క్షణంలో ఇద్దరు వ్యక్తులు లోనికి సుడిగాలిలా దూసుకు వచ్చారు. ఒకడు కండలు తిరిగినట్టున్నాడు...మరోడు పీనుగుకి ప్రతి రూపమే!‘‘దొ....దొ....దొంగలు...’’ భీతిల్లి పోతూ అన్నది నాగవల్లి.‘‘అరిచారో చంపేస్తాం... ఏం తమాషాలు చేస్తున్నారా!’’దగ్గరగా వచ్చి పీక మీద చెయ్యేసి నిలబడ్డాడు ఏనుగులాంటి దావూద్‌.మొలలోంచి కత్తి తీసి బెదిరించాడు పీనుగులాంటి డేవిడ్‌.వాళ్ళను చూడ్డంతోటే పై ప్రాణాలు పైనే పోయాయి శివతాండవరావుకి...‘‘మీ ఇల్లు పీకి పందిరేసి...అదీయిదీ పట్టుకుపోయే గూండాలం కాదు...’’ అన్నాడు దావూద్‌.‘‘దొరికిందల్లా దోచుకుపోవటమే కాక...చివర్న అడ్డంగా నరికి పారేసి పారిపోయే కసాయిలం అంత కన్నా కాదు’’ అన్నాడు డేవిడ్‌.

 ‘‘మరి....మీరు...మీరు...’’ భయంగానే అడిగాడు శివతాండవరావు.‘‘దొంగలం కామని మాత్రం అనుకోకండి...మా దాడి కేవలం ఏ శ్రమ లేకుండా అప్పనంగా దొచుకుంటున్న వారిమీదనే...’’ సూటిగా చూస్తూ చెప్పాడు దావూద్‌...‘‘అయితే మా ఇంటికెందుకొచ్చినట్లో....’’ కాస్త గొంతు విప్పింది నాగవల్లి.‘‘షటప్‌! మీరా జాబితాలో చేరారు కాబట్టి మీ ఇంటి మీద పడ్డాం....’’ కోపంగా అన్నాడు డేవిడ్‌.‘‘బ్బె....బ్బె...బ్బె.... మేము మామూలు మధ్యతరగతి మనుషులం... మా....మీదకి..మీదాడి...’’ వణికేగొంతుతో అన్నాడు శివతాండవ రావు.‘‘ఇంకా మధ్యతరగతి మనుషులమని చెపకోడానికి సిగ్గులేదూ మీకు...’’ గద్దించాడు డేవిడ్‌.‘‘అప్పనంగా బంగారం కొట్టేసి శ్రీమంతుల జాబితాలో చేరిపోయారు.... ఇంకా అబద్ధాలాడతారేం...’’ కటువుగా పలికాడు దావూద్‌.ఆ మాట వింటూనే బిక్కచచ్చిపోయినట్లుగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు శివతాండవరావు, నాగవల్లి ఇంక బావురు మనటమే తరువాయి.ఈ గడబిడకి ఉలిక్కిపడి లేచిన పాప కెవ్వుమన్నది.‘‘ఇంకా బిక్కమొహాలేస్తారేం చెప్పండి. మీరు టి.వి. వాళ్లు పెట్టే ప్రతీ అడ్డమైన పోటీకి హాజరయిపోయి.... వాళ్ళడిగే చెత్తాచెదారాల్లాటి ప్రశ్నలకి ఠకీఠకీమని జవాబులు చెప్పేసి పోగు చేసుకోలేదూ!’’ హూంకరిస్తూ ప్రశ్నించాడు డేవిడ్‌.‘‘అబ్బే...మరి...మేమూ...’’ నాన్చబోయాడు శివతాండవ రావు.‘‘అబద్ధాలాడినా సరే గోడ కట్టినట్లుండాలన్న మాటని నిజం చేయాలని చూడకండి. మీరు పోగు చేస్కున్న బంగారాన్ని దోచుకుపోవాలనే మేం వచ్చాం. అంతకుమించి మాకుపైసా కూడా అక్కర్లేదు...’’ మీసాలు మెలేస్తూ పలికాడు దావూద్‌.‘‘ఊ ఇంకా గుడ్ల గూబల్లా చూస్తారేం...తెరవండి...మీ ఖజానా ఏ మాత్రం దాచడానికి ప్రయత్నించినా సరే మీ పీక తెగుద్ది...’’ హెచ్చరించాడు డేవిడ్‌.