మా ఊర్లె కరెంటు లేకుంట బట్కె రాత్రి గాంగనే ఎక్కలు, కందిల్లు ముట్టిచ్చెటోల్లు. దినాం కందిల్లను బూడ్డితోని తుడ్సి గ్యాంచునూనె బోసెటోల్లు. బజార్ల ఎక్క బత్తి ఏకానకు కందిల్‌బత్తి చారానకు దొర్కేది. మా ఇంట్ల నాలుగైదు కందిల్లు మూడునాలుగు ఎక్కలుండేటియి. కందిల్ల కాడ గూసోని మేము సదువుకునేటోల్లం. కందిల్లు ముట్టిచ్చినంక అటిటు దిర్గుతుంటె తెల్లటి గోడల మీద నల్లటి మా నీడలు బడేటియి. గా నీడలను జూస్తుంటె తమాసగ వుండేది. మా అన్న కందిల్‌ ముంగట ఏల్లను తీరుతీర్ల బెట్టి గోడ మీద కుక్క, గద్ద, జింక అసుంటి నీడ బొమ్మలు దించెటోడు.రాత్రి పూట జల్ది బువ్వ దిని మా ఊరోల్లు పండుకునేటోల్లు. ఇంట్ల కెల్లి అవుతలకు బోయెపనిబడ్తె కందిల్లు దీస్కోని బోయేటోల్లు. కందిల్‌ లేకుంటె తొవ్వ మీద యాడ గుంతలున్నయో ఎర్క అయ్యేది గాదు. ఒకపారి మా పక్కింటి యాద్గిరి కందిల్‌ లేకుంటనే రాత్రి పూట ఇంట్లకెల్లి ఎల్లిండు. జెర దూరం బోంగనే రాయి అడ్డం దల్గి మోరిల బడ్డడు.

దాంతోని గాయిన కాలిరిం్గది. ఇర్గిన కాలుకు పట్టిగట్టిపిచ్చుకోని నెలదినాలు గాయిన మంచంల బన్నడు.మావాడకట్టుల నాలుగైదు కంబలుండేటియి. గవ్విటి మీద పెద్ద కందిల్లు వుండేటియి. శీకటి కాంగనే ఒకడు నిచ్చెన దీస్కోని వొచ్చి గవ్విటి మీద్కి ఎక్కి కందిల్లు ముట్టిచ్చెటోడు. ఎన్నడన్న గాడు రాకుంటె మా వాడకట్టుల శీకటి రాజ్జెం జేసేది. రాత్రి పూట పాలుదాగకుంట ఏడేసిటి పోరగాల్లను శీకట్ల ఇడ్సిపెడ్తమని బెదిరిస్తె దెబ్బకు పాలు దాగెటోల్లు. ఎన్నెల వున్నపడు మా ఊరి జెనం అటిటు దిర్గెటోల్లు. పోరగాల్లు నాలుగు డబ్బల ఆట ఆడెటోల్లు. మా నాయినమ్మ మాకు చందమామ రావే జాబిల్లి రావే పాట నేర్పిచ్చింది. రాత్రి పూట నేను మా నాయినమ్మ పక్కల పండుకునేటోన్ని. గామె నాకు కతలు జెప్పేది.‘‘చీమల పుట్టల ఏలుబెడ్తె కుడ్తదని జెప్పినవు గదా. పుట్టల ఏలు బెట్టకున్నా మొన్న చీమ నన్ను ఎందుకు కుట్టింది’’ అని నేను అడిగితె-