‘‘నేనూ వస్తారా. రాగల్ను. నాకూ చూడాలని వుంది పాపం’’గాద్గికంగా అన్నది అమ్మ.‘‘నువ్వా... అంత దూరం ప్రయాణం చేయలేవమ్మా. పైగా సాయంత్రమే మళ్లీ తిరుగు ప్రయాణం... చాలా హైరానాపడతావ్‌. అంత సేపు కూర్చోవటం అంటే కష్టం కదమ్మా. ఇంతా చేస్తే మనం అక్కడ వుండేది రెండు గంటలే’’అనునయంగా అన్నానేగానీ నాకూ అసంతృప్తిగానే వున్నది. అమ్మని రావద్దనడం. ఆమె ఇష్టాన్ని కాదనలేకపోతున్నాను. అలాగే ఆమెను కష్టపెట్టటానికీ మనసు ఒప్పటం లేదు.మా మేన మామ భార్య చనిపోయినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోను ద్వారా తెలిసింది. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ నిద్ర లేచారు. తెల్లవారి ప్రయాణం గురించిన చర్చలో భాగంగా అమ్మకు నాకు ఆ విధంగా సంభాషణ జరుగుతుండగానే.‘‘నువ్వు వెళ్లలేవులే అత్తయ్యా. ఆయన్ని ఒక్కర్నే వెళ్లిరానీ. అంత దూరం ప్రయాణం చేయలేవు నువ్వు’’నాభార్య నాకే వత్తాసు పలికింది.‘‘అవును బామ్మా... నాన్నని వెళ్లిరానీ నువ్వు వెళ్లద్దు. సీట్లు వుంటయా? వుండవు. రానూ పోనూ పదిహేను గంటలు ప్రయాణం, రిజర్వేషన్ను కాకుండా, బస్సులోనో, రైల్లోనో తెలియకుండా వెళ్లాలంటే... నువ్వు చాలా ఇబ్బంది పడ్తావ్‌’’ నా కూతురి సలహా.‘‘అంతేలే బామ్మా .. నాన్న చాల్లే’’నా కుమారుడి ఆకతాయి తనపు అవాకు. అందరి మాటలూ ఆలకిస్తున్న నా మనసులో అత్తయ్య రూపు రేఖలు, హావ భావాలు, ఆమె మాట తీరు, నడక తీరు, వగైరాలన్నీ మనసు పొరల్లోంచి ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నట్లుగా బయటకు వస్తున్నాయ్‌.

 బహుశా అమ్మ పరిస్థితి అలాగే వుండి వుంటుంది. మౌనంగా కూర్చున్న ఆమె మస్తిష్కంలో ఎన్నెన్ని జ్ఞాపకాలో మరి!చనిపోయిన మనిషి అమ్మకు ఏమవుతుంది? అన్న భార్య అరవై అయిదు సంవత్సరాల అనుబంధం, ఆత్మీయత, స్నేహం, సుదీర్ఘ ప్రయాణం. ఎన్ని వేడుకలు, ఎన్ని విషాదాలు, ఎన్ని ఛలోక్తులు, మరెన్ని ఊరడింపులు! చిన్నతనంలో ఒకరి పట్టుచీరలు ఒకరు మార్చుకుని కట్టుకున్న సందర్భాలు, ఒకరి కోసం ఒకరు పూల మాలలు దాచిపెట్టి అందించనున్న మధుర ఘట్టాలు, కలసి వడ్డించిన పంక్తి భోజనాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, సమస్త బంతులు, అట్ల తద్దిలు, గోరంటాకులు, వయసచ్చాక కలసి వెళ్లిన ఆలయాలు, కలసి చేసిన కార్తీక స్నానాలు, కలసి చదివిన సహస్త్ర నామ పారాయణలు, భజనలు, పాటలు, మామయ్య చనిపోయినప్పుడు అత్తయ్యను ఓదార్చిన అమ్మ, నాన్న మరణించినప్పుడు అమ్మను అక్కున చేర్చుకుని ఊరడించన అత్తయ్య, కలసి పంచుకున్న సుఖ దుఃఖాలు, కలిమి లేములు, మనసెరిగి మసలుకున్న వారి ఆత్మీయత, అనురాగం వీటిల్లో కొన్ని విన్నవాడిని, కొన్ని చూసిన వాడ్ని కావటం వల్ల అన్నీ తెలిసిన వాడ్ని. ఆ యిద్దరి స్నేహం అర్థం చేసుకోగలిగిన వాడ్ని నేను.