టక్‌.. టక్‌... అని తలుపు మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది. హాల్లో టి.వీ చూస్తూ నిద్రలోకి జారుకుంటున్న రమ్యకు ఠక్కున మెలకువ వచ్చింది. ఒక్క శ్రీరామ్‌ తప్ప తమ ఇంటికి వచ్చే వారంతా బెల్‌ కొట్టేవారే. ఈ టైంలో ఆఫీస్‌లో వుండవలసిన శ్రీరామ్‌ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మనసులోకి వస్తున్న పలు ఆలోచనలతో సతమతమవుతూ లేచి వెళ్లి తలుపు తీసింది.రమ్య అనుకున్నట్టే ఎదురుగా శ్రీరామ్‌.‘‘మీరా! ఏంటి ఈ టైంలో?... ఒంట్లో బావొలేదా?... ఆఫీసులో ఏమన్నా ప్రాబ్లమా?’’భార్యను సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకున్న శ్రీరామ్‌ రమ్య ప్రశ్నలకు నీరుకారిపోయాడు.‘‘ఆఫీసులో పెద్ద పనేమి లేదు... లీవులు కూడా చాలా వున్నాయి.’’ అని నీళ్లు నమిలాడు.రమ్య ఏమి మాట్లాడకుండా చేతిలోంచి బ్యాగు, లంచ్‌ బాక్స్‌ తీసుకొని లోపలికి నడిచింది. చేసేదేం లేక శ్రీరాం కూడా రమ్య వెనకాలే లోపలికి నడిచాడు. కూర్చుని వుండగానే రమ్య మంచినీళ్లు, టీ కప్పుతో వచ్చి ముందు నిల్చుంది.‘‘రమ్యా మనం అలా బయటకు వెళదామా!’’‘‘కాని శ్రీరాం, పనిపాప ఇపుడు వస్తానంది. అది వస్తే దుప్పట్లు మార్పించాలి. పిల్లల రూమ్‌లు రెడీ చేయించాలి. 

ఇక నాలుగైదు రోజులే వుంది పిల్లలు రావడానికి. చాలా పనివుంది మీరు వెళ్లిరండి. ముందైనా చెప్పివుంటే రెడీ అయి వుండేదాన్ని’’‘‘అవును నిజమే రమ్యా నేను ముందు నీ దగ్గర అపాయింట్‌మెంట్‌ తీసుకొని వుండాల్సింది. లాస్ట్‌ మినిట్‌లో చెబితే నన్ను నీ బిజీ షెడ్యుల్‌లో అకామిడేట్‌ చేయటం కష్టమే మరి!’’ అని లోపలికి వెళ్లిపోయాడు.శ్రీరాంకు అంతకోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఒక పది నిముషాలలో శ్రీరాం ఫ్రెష్‌ అయ్యి వచ్చి ‘‘నేను అలా బయటకు వెళ్లి వస్తాను’’ అని రమ్య రెస్పాన్సు కోసం చూడకుండా బయటకు వెళ్లిపోయాడు.బయటకు వచ్చిన శ్రీరాంకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అలా నడవడం మొదలుపెట్టాడు. తనలో రోజు రోజుకు పెరుగుతున్న అసహనాన్ని, అసంతృప్తిని ఎలా బయటకు చెప్పాలో అర్థం కావడం లేదు. తన మనసులో మెదిలే ప్రతి భావనను ఇట్టే పసిగట్టే రమ్య రోజు రోజుకు దూరంగా వెళ్లి పోతున్నట్టుగా వుంది. తన మనసు పొరలలో వుండే విషయాన్ని పసిగట్టే రమ్య తన కోపాన్ని ఎందుకు గ్రహించడం లేదు. పిల్లలు వస్తారు, వాళ్ల అవసరాలు ముందు పూర్తి చెయ్యాలి. పిల్లల ముందు తను కనిపించడం కూడా లేదు. తన అవసరం లేనట్టే ప్రవర్తిస్తోంది. చెపుదామంటే ఎలా రియాక్ట్‌ అవుతుందో.. చెప్పకుంటే తను ఈ ఆలోచననే భరించలేకుండా వున్నాడు.